పని 'పాడ్‌' అవకుండా.. | Special space pads available at the airport | Sakshi
Sakshi News home page

పని 'పాడ్‌' అవకుండా..

May 21 2026 4:50 AM | Updated on May 21 2026 4:50 AM

Special space pads available at the airport

ఎయిర్‌పోర్టులో ప్రత్యేక స్పేస్‌ ప్యాడ్స్‌ అందుబాటులోకి...

ఆఫీస్‌ వర్క్‌ చేసుకునేందుకు అనువుగా రూపకల్పన

వెయిటింగ్‌ టైమ్‌ సద్వినియోగం చేసుకునే వీలు

సాక్షి, హైదరాబాద్‌: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల కోసం కొత్తగా ప్రైవేట్‌ వర్క్‌స్పేస్‌ పాడ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వ్యాపారాల రీత్యా ప్రయాణాలు చేసేవారు, వృత్తి నిపుణులు, సుదీర్ఘ ప్రయాణాల్లో భాగంగా మధ్య మధ్య విమానా శ్రయంలో గంటల సమయం గడిపే ట్రాన్సిట్‌ ట్రావెలర్స్, ప్రశాంతంగా పని చేసుకునేందుకు ఈ ప్రత్యేక పాడ్స్‌ను ఏర్పాటు చేశారు. మియో పాడ్స్‌ డాట్‌ స్పేస్‌ అనే స్టార్టప్‌ ఈ సేవలను ప్రారంభించింది. 

ప్రస్తుతానికి తొలిదశలో బోర్డింగ్‌ గేట్‌ 9, గేట్‌ 10 సమీపంలో నాలుగు ప్రైవేట్‌ పాడ్స్‌ను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు క్యూఆర్‌ కోడ్‌ ద్వారా బుక్‌ చేసుకొని వెంటనే వినియోగించుకోవచ్చు. అంతేకాదు ముందస్తుగా 7 రోజుల వరకూ రిజర్వేషన్‌ చేసుకొని వినియోగించుకునే సౌకర్యం కూడా కల్పించారు 

సౌండ్‌ ప్రూఫ్‌... సరైన వెంటిలేషన్‌
ఈ పాడ్స్‌ను పూర్తి సౌకర్యవంతంగా తీర్చిదిద్దారు. శబ్ద నిరోధక వ్యవస్థ, సౌకర్యవంతమైన సీటింగ్, చార్జింగ్‌ పోర్టులు, వెంటిలేషన్, లైటింగ్‌ సదుపాయాలు కల్పించారు. విమానం కోసం ఎదురుచూస్తున్న సమయంలో సమావేశాలు, వీడియో కాల్స్, వ్యక్తిగత చర్చలు లేదా కార్యాలయ పనులకు ఎటువంటి అంతరాయాలు, ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు వీలుగా వీటిని రూపొందించారు. 

ఈ సందర్భంగా మియో పాడ్స్‌ వ్యవస్థాపకుడు వికాస్‌ సెఠియా మాట్లాడుతూ ప్రయాణ సమయాన్ని కూడా ఉత్పాదకంగా మార్చాలనే ఆలోచనతో ఈ సేవలను ప్రారంభించినట్టు తెలిపారు. ప్రారంభ ట్రయల్స్‌ సమయంలోనే 2,000 మందికి పైగా ప్రయాణి కులు స్కాన్‌ చేసినట్టు సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం 30 నిమిషాల వినియోగానికి రూ.299 (జీఎస్టీ కలిపి) చార్జ్‌ చేస్తున్నారు.  ఈ సేవలను తర్వాత ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల్లో కూడా విస్తరించే ప్రణాళికలో సంస్థ ఉన్నట్టు సమాచారం.

విశ్రాంతితో నిద్రపోవచ్చు 
ఇటీవలే ట్రాన్సిట్‌ ప్రయాణికులకు విశ్రాంతి సౌకర్యాన్ని అందించేందుకు   రెస్టింగ్‌ పాడ్‌లను ప్రారంభించారు. విమానాల మధ్య విరామం కోరుకునే వారికి, జేపాడ్‌ హోటల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా ఈ పాడ్‌లు అందుబాటులోకి తెచ్చింది. విమానాశ్రయం లోపల ఏర్పాటు చేసిన ఈ రెస్టింగ్‌ పాడ్‌లు, టెర్మినల్‌లోనే ఉండడం వల్ల విశ్రాంతి తీసుకోవడానికి విమానాశ్రయం బయటకు వెళ్లడం లేదా హోటల్‌ గదిని బుక్‌ చేసుకోవడం ఇష్టం లేని, సుదీర్ఘ లేఓవర్‌లు ఉన్న ప్రయాణికులకు ఉపయుక్తంగా మారాయి. 

ఇందులో ఇద్దరు చొప్పున ఉండేందుకు  ఆరు ప్రైవేట్‌ పాడ్‌లు, ప్రత్యేకంగా మహిళల కోసం ఎనిమిది పాడ్‌లు,  దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఒక పాడ్‌ ఉంది. విమాన టికెట్లు లేని సందర్శకులు కూడా పాడ్‌ను బుక్‌ చేసుకునే అవకాశం అందిస్తుండడం విశేషం. గంటకు రూ.500 ఆపైన ధరలో ఇవి అందుబాటులో ఉన్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement