ఊపిరితీస్తున్న సైటోకైన్స్‌ ఉప్పెన

Some Physicians Opinion On Death Of SP Balasubrahmanyam - Sakshi

తీవ్రమైన కోవిడ్‌ రోగుల్లో నయమయ్యాక సమస్యలు

ఊబకాయం, వయోభారంతో తగ్గుతున్న లంగ్స్‌ సామర్థ్యం

ఎస్పీ బాలు మరణం నేపథ్యంలో వైద్యుల అభిప్రాయాలు

సాక్షి, హైదరాబాద్‌: ‘కరోనా తీవ్రతతో ఆసుపత్రుల్లో చేరేవారిలో కొందరు వెంటిలేటర్‌పైకి వెళ్తుంటారు. వారిలో కొందరు సాధారణస్థితికి చేరుకుంటారు. ఇక నేడో రేపో డిశ్చార్జి చేసి ఇంటికి పంపించొచ్చని వైద్యులూ నిర్ధారణకు వస్తారు. కానీ, ఒక్కసారిగా తలెత్తే అనారోగ్య సమస్యలతో కుప్పకూలి, ప్రాణాలు కోల్పోతుంటారు’ అని వైద్య నిపుణులు చెబుతున్నా రు. ప్రఖ్యాత గాయకుడు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం విషయంలోనూ అలాగే జరిగిందని వైద్యులు విశ్లేషిస్తున్నారు. కరోనా నుంచి  కోలుకొని నెగెటివ్‌ వచ్చినా, ఎక్మో చికిత్స చేసినా అంతర్గత అవయవాలపై వైరస్‌ చేసిన దాడితో మృతిచెంది ఉంటారని వైద్యులు అంటున్నారు. కొందరిలో సైటోకైన్స్‌ ఉప్పెనలా ఉత్పత్తి కావడం వల్ల కిడ్నీ లేదా ఊపిరితిత్తుల్లో న్యుమో నియా లేదా గుండె వైఫల్యం వంటివి సంభవిస్తాయంటున్నారు. వెంటిలేటర్ల మీదకు వెళ్లేసరికే సెకండరీ ఇన్ఫెక్షన్లు వస్తాయి. కోవిడ్‌ నుంచి మొదట్లో కోలుకున్నా తర్వాత సెకండరీ సైటోకైన్స్‌ ఉత్పత్తి అవుతాయి.  కొందరిలో బాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ వస్తాయని చెబుతున్నారు.  

సైటోకైన్స్‌ స్ట్రోమ్‌ అంటే.. 
ఏదైనా వైరస్‌ శరీరంలో ప్రవేశించాక దాన్ని నియంత్రించేందుకు శరీరకణాల నుంచి సైటో కైన్స్‌ అనేవి ఏర్పడతాయి. కరోనాపైనా ఇవే పోరాడుతాయి. అంటే కరోనా నుంచి రక్షించడంలో సైటోకైన్స్‌దే ప్రధాన పాత్ర. అయితే కరోనా ప్రభావానికి తీవ్రంగా గురైన వారిలో శరీరం ఒక్కోసారి అతిగా స్పందిస్తుంది. దీంతో సైటోకైన్స్‌ అధికంగా శరీర కణాల నుంచి ఉత్పత్తవుతాయి. వైరస్‌ నుంచి రక్షించాల్సిన సైటోకైన్సే ఉప్పెనలా ఉత్పత్తి అయి ఇతర అవయవాలపై దాడి చేసి వాటి పనితీరును దెబ్బతిస్తాయి. దీన్నే సెకండరీ సైటోకైన్స్‌ స్ట్రోమ్‌ అంటారు. అప్పుడు కోలుకున్నట్టే కనిపించినవారు హఠాత్తుగా కుప్పకూలుతుంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొందరిలో కోలుకున్నాక రక్తనాళాలు బ్లాక్‌ అవుతాయి. దీంతో గుండె, ఊపిరితిత్తుల్లో ఏదో ఒకటి తీవ్ర ప్రభావానికి గురవుతుందని వెల్లడిస్తున్నారు. 

ఎక్మో చికిత్స అంటే.. 
ఎస్‌పీ బాలుకు ఎక్మో చికిత్స చేశారు. దీనివల్లే ఆయన ఇన్నాళ్లు ఉండగలిగారు. ఎక్స్‌ట్రా కార్పొరియల్‌ మెంబరేన్స్‌ ఆక్సిజనైజన్‌ (ఎక్మో) అనేది అత్యాధునిక వైద్య విధానం. కీలక గడియల్లో ఊపిరితిత్తుల పని, గుండె పనిని కూడా బయటే పూర్తిచేసి శరీరాన్ని నిలబెట్టే సంక్లిష్టమైన ప్రత్యేక చికిత్సా విధానమే ఇది.. వెంటిలేటర్‌తో కూడా ఉపయోగం లేని సందర్భాల్లో రోగి ప్రాణ రక్షణ కోసం ‘ఎక్మో’చికిత్స చేస్తారు. రోగి రక్తాన్ని ఒక గొట్టం ద్వారా బయటకు తీసుకొచ్చి, ఎక్మో అనే యంత్రంలో శుద్ధి చేసి, తిరిగి ఆ మంచి రక్తాన్ని శరీరంలోకి ఎక్కించడమే దీని ప్రత్యేకత. దీంతో గుండె, ఊపిరితిత్తులు రెండింటికీ పూర్తి విశ్రాంతి చిక్కి అవి త్వరగా కోలుకుంటాయి. అయితే ఒక్కోసారి ఈ చికిత్స వల్ల రక్తస్రావం, రక్తపు గడ్డలు ఏర్పడటం, రక్త నాళాలు చిట్లిపోవటం వంటి సమస్యలు వస్తుంటాయి. ఇన్ఫెక్షన్లూ రావచ్చు. అలాగే రక్తాన్ని బయటే శుద్ధి చేస్తుండే క్రమంలో కొన్నిసార్లు రక్తంలోని ప్లేట్‌లెట్లు, తెల్లరక్తకణాల వంటివి దెబ్బతింటాయి. 

సెకండరీ సైటోకైన్స్‌ స్ట్రోమ్‌తో ముప్పు..  
కొంతమందికి సెకండరీ సైటోకైన్స్‌ స్ట్రోమ్‌ వల్ల కిడ్నీ లేదా ఊపిరితిత్తుల్లో న్యుమోనియా, గుండెలో సమస్యలు వస్తాయి. వెంటిలేటర్ల మీదకు వెళ్లేసరికే సెకండరీ ఇన్ఫెక్షన్లు వస్తాయి. కోవిడ్‌ వల్ల రోగనిరోధక శక్తి తగ్గి బహుళ సమస్యలు వచ్చే ప్రమాదముంది. బాలసుబ్రహ్మణ్యానికి చివరి రెండు, మూడ్రోజుల్లో హై ఫీవర్‌ వచ్చినట్లు సమాచారం. దీంతో డ్యామేజీ జరిగి ఉండొచ్చు.
– డాక్టర్‌ శేషగిరిరావు, ప్రముఖ గుండె వైద్య నిపుణుడు 

ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గడం వల్లే.. 
ఊబకాయం, వయసు మీద పడిన వారిలో కరోనా వైరస్‌ తీవ్రత ఎక్కువై ఆసుపత్రిపాలైతే ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గుతుంది. పైగా ఎస్‌పీ బాలు ఎక్మో నుంచి బయటకు రాలేదు. అయినా ఈ పరిస్థితి వచ్చిందంటే ఊపిరితిత్తులు తీవ్రంగా డ్యామేజీ అయి ఉండాలి. – రాకేశ్‌ కలపాల, ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్‌ 

ఆలస్యమైతే సమస్యే.. 
మొదట్లోనే ఆసుపత్రికి వచ్చినవారు రికవరీ అవుతున్నారు. ఆలస్యమైతేనే సమస్యలు వస్తున్నాయి. ఎస్‌పీ బాలు ఆసుపత్రికి వచ్చాక ఎక్మో చికిత్స వరకు వెళ్లారు. బ్లడ్‌ క్లాట్, ఊపిరితిత్తుల్లో సెకండరీ ఇన్‌ఫెక్షన్‌ రావచ్చు. –డాక్టర్‌ రాజు, పల్మొనాలజిస్ట్,  హైదరాబాద్‌ 

సైటోకైన్స్‌ స్ట్రోమ్‌ వల్లే.. 
సైటోకైన్స్‌ స్ట్రోమ్‌ వల్ల సమస్యలు వస్తాయి. దాంతో కిడ్నీ, ఊపిరితిత్తులపై ప్రభావం పడుతుంది. బాలసుబ్రహ్మణ్యాన్ని ఎక్మో మెషీన్‌పై కూడా పెట్టారు. కొందరు వైరస్‌ నుంచి బయటపడినా ఇతర వ్యాధులకు గురవుతారు. రికవరీ అయినా కొందరిలో ఇలాంటివి అరుదుగా వస్తాయి. – కిరణ్‌ మాదల, క్రిటికల్‌ కేర్‌ విభాగాధిపతి, నిజామాబాద్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ 

చనిపోయేవరకూ బాగానే ఉంటారు.. 
బాలు కోవిడ్‌ నుంచి రికవరీ అయ్యారు. ఊపిరితిత్తుల్లో సమస్య వల్ల ఆయనకు ఎక్మో చికిత్స చేశారు. కానీ ఎక్మోపై రికవరీ తక్కువ. సాధారణంగా చెప్పుకోవాలంటే కొందరి విషయంలో రక్తనాళాలు బ్లాక్‌ అవుతాయి. దీంతో కిడ్నీ, గుండె ఫెయిల్యూర్‌ అవుతుంది. కరోనా బాధితులు కొందరు చనిపోయే ముందు వరకు ఫోన్‌ మాట్లాడినవారున్నారు. కానీ ఒక్కసారిగా కుప్పకూలిపోతారు.
– డాక్టర్‌ రాజారావు, సూపరింటెండెంట్, గాంధీ ఆసుపత్రి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top