
పునఃమూల్యాంకనం చేయాలన్న ఉత్తర్వులపై సీజే ధర్మాసనం స్టే
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 మెయిన్స్ జవాబు పత్రాలను పునఃముల్యాంకనం చేయాలని లేదా పరీక్ష మళ్లీ నిర్వహించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు సీజే ధర్మాసనం తాత్కాలికంగా రద్దు చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేస్తూ.. ఆలోగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఏవైనా నియామకాలు చేపడితే అవి తామిచ్చే తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది.
ఈ మేరకు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టింగ్‌లపై స్టేటస్‌కో ఆదేశాలు ఇవ్వాలని రిట్ పిటిషనర్ల (ఎంపిక కాని అభ్యర్థులు) న్యాయవాదులు విజ్ఞప్తి చేసినా..ధర్మాసనం తోసిపుచ్చింది. దీంతో గ్రూప్–1 పోస్టింగ్‌లకు లైన్‌క్లియర్ అయ్యింది. టీజీపీఎస్సీతో పాటు ఉద్యోగాలకు ఎంపికై నియామకాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఊరట లభించింది.
అప్పీల్‌ను విచారించిన సీజే ధర్మాసనం
గతేడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించిన గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు, అసమానతలు చోటుచేసుకున్నాయని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ సిద్దిపేట శివనగర్‌కు చెందిన కె.పర్శరాములుతో పాటు మరికొందరు గతంలో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. తుది మార్కుల జాబితా, జనరల్ ర్యాంకింగ్ జాబితా(జీఆర్‌ఎల్)ను రద్దు చేస్తూ తీర్పునిచ్చారు.
గ్రూప్–1 మెయిన్స్ అన్ని సమాధాన పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయాలని కమిషన్‌ను ఆదేశించారు. ఇది సాధ్యంకాని పక్షంలో మెయిన్స్ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని చెప్పారు. ఈ తీర్పు ను సవాల్ చేస్తూ టీజీపీఎస్సీతో పాటు ఎంపికైన అభ్యర్థులు అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ గౌస్ మీరా మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.
పేపర్ లీకేజీ లేదు, అక్రమాలు జరగలేదు: ఏజీ
రాష్ట్ర ప్రభుత్వం, కమిషన్ తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి, సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి, మురళీధర్, మరికొందరు వాదనలు వినిపించారు. కమిషన్ తన సొంత నియమాల నుంచి తప్పుకుని పక్షపాతంగా వ్యవహరించినందున పరీక్షలో పారదర్శకత, సమగ్రత లోపించిందని సింగిల్ జడ్జి తేల్చడం సరికాదన్నారు. పరీక్షను కమిషన్ నిబంధనల ప్రకారం సక్రమంగా నిర్వహించిందని చెప్పారు.
జవాబు పత్రాలు మళ్లీ దిద్దడం అనేది నిబంధనల మేరకు సాధ్యం కాదని తెలిపారు. పరీక్ష నిర్వహణకు సంబంధించి రాజ్యాంగ సంస్థ అయిన పబ్లిక్ సర్వీస్ కమిషన్‌పై సింగిల్ జడ్జి తన తీర్పులో అభ్యంతరకరమైన పదాలు వినియోగించారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఆ తీర్పును కొట్టివేయాలని, పోస్టింగ్‌లు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
సింగిల్ జడ్జి తీర్పు సరైందే..: రిట్ పిటిషనర్లు
గతంలో రిట్ పిటిషన్లు దాఖలు చేసిన ఎంపిక కాని అభ్యర్థుల తరఫున సీనియర్ న్యాయవాదులు విద్యాసాగర్, రచనారెడ్డి, సురేందర్ వాదనలు వినిపించారు. సింగిల్ జడ్జి అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తీర్పునిచ్చారన్నారు. మొత్తం పరీక్షా ప్రక్రియలో విధానపరమైన అవకతవకలు చోటుచేసుకున్నాయని చెప్పారు.
హాల్ టికెట్ల నుంచి సమాధాన పత్రాల మూల్యాంకనం వరకు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని పేర్కొన్నారు. అందుకే మోడరేషన్ పద్ధతిని వర్తింపజేస్తూ మెయిన్స్ జవాబు పత్రాలు పునః మూల్యాంకనం చేయాలని సింగిల్ జడ్జి ఆదేశించారన్నారు. ఆ ఉత్తర్వుల్లో ఎలాంటి జోక్యం అవసరం లేదని అన్నారు.
పలు ప్రశ్నలు సంధించిన సీజే..
వాదనల సందర్భంగా సీజే జస్టిస్ ఏకే సింగ్ పలు ప్రశ్నలు సంధించారు. కొందరు అభ్యర్థులు మాత్రమే 10 నుంచి 12 గంటలు చదివారని ఎలా చెబుతారు?, పేపర్ లీకేజీ జరిగిందా.. అవినీతి, అక్రమాలు జరిగినట్లు ఆధారాలున్నాయా?, కొందరికి మేలు చేకూర్చేలా కమిషన్ వ్యవహరించిందనడానికి సాక్ష్యం ఉందా అని ప్రశ్నించగా.. ఏజీ లేదన్నారు.
కేంద్రాల్లో ముందే పేపర్లు ఓపెన్ చేసినట్లు ఆరోపణలున్నాయా? ఎవరి పేపర్ దిద్దుతున్నామో మూల్యాంకనదారులకు తెలిసే అవకాశం ఉందా? అని అడగగా..లేదని ఏజీ బదులిచ్చారు. గ్రూప్–1 లాంటి కీలక పరీక్షలకు ఇంటర్వ్యూ ఉండదా అని అడగగా.. ప్రిలిమ్స్, మెయిన్స్, సరి్టఫికెట్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుందని చెప్పారు. దీంతో కీలకమైన పోస్టింగ్‌లకు అభ్యర్థులను ఎంపిక చేసే ముందు వారి బాడీ లాంగ్వేజ్ కూడా తెలియాలి కదా అని వ్యాఖ్యానించారు.
సింగిల్ జడ్జి తీర్పులో పదాలపై అభ్యంతరం
విచారణ సందర్భంగా తీర్పులో సింగిల్ జడ్జి పేర్కొన్న పదాలపై సీజే ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఊహాజనితాల ఆధారంగా ఘాటు పదాలను వాడుతూ తీర్పునిచ్చారని వ్యాఖ్యానించింది. పేపర్ లీకేజీ, అవినీతి, అక్రమాలకు ఎలాంటి ఆధారాలు లేనప్పుడు సింగిల్ జడ్జి ‘సమగ్రతకు భంగం’లాంటి సున్నితమైన పదాలు వినియోగించడం సరికాదని పేర్కొంది. హాల్‌టికెట్ పంపిణీ నుంచి ఫలితాల వెల్లడి వరకు ఎలాంటి విధానం పాటించాలనేది ఓ రాజ్యాంగ సంస్థకు చెప్పడం సమర్థనీయం కాదంది.
పరీక్ష నిర్వహించే పద్ధతిపై పూర్తి అధికారం కమిషన్‌కు ఉంటుందని తేల్చిచెప్పింది. పారదర్శకత లేదు, సొంత నిబంధనల ఉల్లంఘన.. వంటి పదాలు సింగిల్ జడ్జి వినియోగించడం అభ్యంతరకరమని సీజే అన్నారు. పరీక్షల నిర్వహణకు కమిషన్‌కు పూర్తి అధికారం ఉందని స్పష్టం చేశారు. హాల్‌టికెట్లు ఎలా జారీ చేయాలి.. కేంద్రాలు ఎలా ఎంపిక చేయాలి..మూల్యాంకనదారులను ఎలా ఎంపిక చేయాలి.. వారు ఎలా దిద్దాలి.. మార్కులు ఎలా వెల్లడించాలి.. ఇదంతా న్యాయస్థానం.. కమిషన్‌కు చెప్పాల్సిన అవసరం లేదన్నారు.
అది రాష్ట్రంలో కీలక పరీక్షలు నిర్వహించే రాజ్యాంగబద్ధ సంస్థ అన్నది మరవొద్దన్నారు. మహిళా కాలేజీలో మహిళలు మాత్రమే పరీక్ష రాస్తే తప్పేముందంటూ.. అంతమాత్రాన అక్రమాలు జరిగినట్లు ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని ఈ నెల 9న సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను నిలిపి వేస్తున్నట్లు స్పష్టం చేశారు. వచ్చే నెల 10లోగా రాతపూర్వకంగా వాదనలు అందజేయాలని ఇరుపక్షాల తరఫు న్యాయవాదులను ఆదేశించారు.