సోలార్‌ విద్యుత్‌ నిల్వతో సింగరేణికి లాభాల వెలుగు | Singareni Battery Energy Storage System Proves Profitable in Telangana | Sakshi
Sakshi News home page

సోలార్‌ విద్యుత్‌ నిల్వతో సింగరేణికి లాభాల వెలుగు

May 22 2026 4:45 AM | Updated on May 22 2026 4:45 AM

 Singareni Battery Energy Storage System Proves Profitable in Telangana

బీఈఎస్‌ఎస్‌ ప్రాజెక్టు ఇదే..

మిగులు కరెంట్‌ను బ్యాటరీల్లో భద్రపరిచి రూ.26 లక్షల ఆదా 

రాష్ట్రంలోనే తొలి భారీ బీఈఎస్‌ఎస్‌ ప్రాజెక్టుకు మంచి ఫలితాలు

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి సంస్థ ఏర్పాటు చేసిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌ (బీఈఎస్‌ఎస్‌) ఆశించిన ఫలితాలను ఇస్తోంది. వినియోగం కాకుండా ఉచితంగా గ్రిడ్‌కు వెళ్లిపోయే సోలార్‌ విద్యుత్‌ను ఇప్పుడు బ్యాటరీల్లో నిల్వ చేసి అవసరమైన సమయంలో వినియోగించుకోవడంతో సంస్థకు ఆర్థిక లాభాలు చేకూరుతున్నాయి. నాలుగు నెలల్లోనే రూ.25.66 లక్షల మేర ఆదా కావడం విశేషం. రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ ప్రాజెక్టును సింగరేణి మందమర్రి ఏరియాలో ప్రయోగాత్మకంగా ఏర్పా టు చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు రూ.2.5 కోట్లను యాజమాన్యం వెచ్చించింది.

సింగరేణి ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది ప్రాంతాల్లో 245.5 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్‌ ప్లాంట్లను నిర్వహిస్తోంది. వీటిలో 147 మెగావాట్లను ఓపెన్‌ యాక్సెస్‌ ప్లాంట్లుగా, 98.5 మెగావాట్లను ఇన్‌హౌస్‌ ప్లాంట్లుగా వినియోగిస్తోంది. ఇన్‌హౌస్‌ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను స్థానిక అవసరాలకు వినియోగించిన తర్వాత మిగిలే విద్యుత్‌ను గ్రిడ్‌కు పంపాల్సి వస్తోంది. అయితే విద్యుత్‌ ఒప్పందాల ప్రకారం ఆ మిగులు విద్యుత్‌కు ఎటువంటి చెల్లింపులు ఉండవు. దీంతో ప్రతిరోజూ వేల యూనిట్ల విద్యుత్‌ ఆర్థిక ప్రయోజనం లేకుండానే గ్రిడ్‌లో కలిసిపోతోంది. ఈ నష్టాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూచనలతో సింగరేణి మందమర్రి 28 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్‌కు అనుబంధంగా బీఈఎస్‌ఎస్‌ను ఏర్పాటు చేసింది.

3.35 లక్షల యూనిట్ల నిల్వ 
మందమర్రి, శ్రీరాంపూర్‌ ఏరియాల్లోని గనులు, కాలనీలకు అవసరమైన విద్యుత్‌ను ఈ సోలార్‌ ప్లాంట్‌ సరఫరా చేస్తోంది. మిగిలిన విద్యుత్‌ను ఇప్పుడు బీఈఎస్‌ఎస్‌ ద్వారా నిల్వ చేస్తున్నారు. జనవరి నుంచి ఇప్పటివరకు మొత్తం 3,35,485 యూనిట్ల విద్యుత్‌ను బ్యాటరీల్లో నిల్వ చేసి అవసరమైన సమయంలో వినియోగించారు. దీని ద్వారా సంస్థకు రూ.25,66,460 మేర లబ్ధి చేకూరింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement