
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతదేహం లభ్యం
రాజేంద్రనగర్: అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతదేహం లభ్యమైన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగు చూసింది. ఇన్‌స్పెక్టర్ క్యాస్ట్రో తెలిపిన వివరాల ప్రకారం..కిస్మత్‌పూర్ బ్రిడ్జి పక్కనే ఉన్న కల్లు కంపౌండ్ సమీపంలోని పొదల్లో ఓ మహిళ మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా ఒంటిపై ఎలాంటి దుస్తులు లేకుండా పడి ఉంది. సంఘటన జరిగి రెండు, మూడు రోజులు కావస్తుండటంతో పాటు రెండు రోజులుగా వర్షాలు పడటంతో మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించింది.
క్లూస్ టీమ్, డాగ్స్ టీమ్‌ను రప్పించిన పోలీసులు ఆధారాలు సేకరించారు. మృతదేహనికి కొద్ది దూరంలో నల్లటి స్క్రాప్, నల్లటి పైజామా కనిపించింది. మృతురాలు వయస్సు 25–30 సంవత్సరాలు ఉంటుందని ఇన్‌స్పెక్టర్ తెలిపారు. మహిళను ఇక్కడికి తీసుకొచ్చి లైంగికదాడికి పాల్పడి చంపారా..లేదా ఇతర ప్రాంతంలో హత్య చేసి ఇక్కడ పడేశారా అన్నది దర్యాప్తులో తేలనుందని ఇన్‌స్పెక్టర్ తెలిపారు. పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించామన్నారు. మృతురాలికి సంబంధించిన ఫోటోలను అన్ని పోలీస్‌స్టేషన్లకు పంపించామన్నారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మృతురాలి ఆచూకీ తెలిస్తే రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించాలన్నారు.