ఆదాయం వెయ్యి కోట్లు.. కాగితం కొనేందుకు డబ్బుల్లేవు! | Sanitation workers have not received their salaries for five months | Sakshi
Sakshi News home page

ఆదాయం వెయ్యి కోట్లు.. కాగితం కొనేందుకు డబ్బుల్లేవు!

Apr 16 2026 4:23 AM | Updated on Apr 16 2026 4:23 AM

Sanitation workers have not received their salaries for five months

రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్‌ కమిటీల దైన్య స్థితి 

ఐదు నెలలుగా పారిశుధ్యకార్మికులకు అందని వేతనాలు

విద్యుత్, ఇంటర్‌నెట్, ఫోన్,ఇతర బిల్లులు ఇవ్వని వైనం

ఇప్పటికీ రూ.250 కోట్ల చెల్లింపులు పెండింగ్‌ 

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: రైతులు పండించిన పంటల క్రయ విక్రయాలలో విశేష సేవలు అందజేస్తూ.. ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ఆదాయం సముపార్జించి పెడుతున్న మార్కెట్‌ కమిటీల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తోంది. నిధులు లేక పోవడం మార్కెట్‌ కమిటీలకు కనీసం తెల్లకాగితం కొనేందుకు కూడా డబ్బులు ఉండడం లేదు. రాష్ట్రంలో మొత్తం 206 మార్కెట్‌ కమిటీలు ఉన్నాయి. వీటిలో 180 కమిటీలకు పాలకవర్గాలు ఉన్నాయి. 

రాష్ట్రంలో అన్ని మార్కెట్ల నుంచి ఏటా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,000 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతోంది. ఇంత భారీగా ఆదాయం వస్తున్నా.. మార్కెట్‌ యార్డులను ప్రతిరోజూ శుభ్రం చేసే వర్కర్లకు గత 5 నెలలుగా వేతనాలు అందడం లేదు. ఈ క్లీనింగ్‌ కార్మికులకు నెలలో 26 రోజులకు గాను రోజుకు రూ.503 చొప్పున వేతనం చెల్లించాల్సి ఉంది. అయితే వీరికి మార్కెట్‌ కమిటీల నుంచి ఇచ్చిన చెక్కులు పాస్‌ కావడం లేదు. హైదరాబాద్‌ లాంటి చోట్ల మార్కెట్లలో పారిశుధ్య పనులను ఏజెన్సీల ద్వారా చేయిస్తున్నారు. ఈ ఏజెన్సీలకు సైతం చెల్లింపులు చేయడం లేదు. 

కొన్ని చెక్‌పోస్టుల్లో నిలిచిన ఫీజు వసూలు 
మార్కెట్‌ కమిటీల విద్యుత్, ఇంటర్‌నెట్, వాటర్‌ ప్లాంట్ల నిర్వహణ, ఫోన్‌ బిల్లులు, సీసీ కెమెరాల నిర్వహణ, ఈ–నామ్‌ సాఫ్ట్‌వేర్‌ యాంటీ వైరస్‌ బి ల్లులతో పాటు తెల్ల కాగితాలు, ప్రింటింగ్, జిరాక్స్, లైట్లు, బ్లీచింగ్‌ తదితరాలకు సంబంధించిన నిర్వహ ణ బిల్లులు కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు. అలాగే మార్కెట్‌ కమిటీ చైర్మన్ల జీతాలు, వాహనం అలవె న్సు బిల్లులు సైతం ఇవ్వడం లేదు. 

వీటన్నింటికీ గత ఐదు నెలలకు సంబంధించి రూ.250 కోట్ల మేర చెల్లింపులు చేయాల్సి ఉన్నా ప్రభుత్వం తనకే మాత్రం సంబంధం లేనట్టు వ్యవహరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో పలు మార్కెట్‌ కమిటీలకు సంబంధించి చెక్‌పోస్టుల విద్యుత్‌ బిల్లులు చెల్లించలేదు. దీంతో ఆయా చోట్ల ఇంటర్‌నెట్‌ సిస్టమ్‌ నడవడం లేదు. దీంతో మార్కె ట్‌ ఫీజులు వసూలు చేయలేని దుస్థితి నెలకొంది. 

వైఎస్‌ హయాంలో కమిటీల ఖాతాల్లోనే డబ్బులు
వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో మార్కెట్‌ కమిటీల ఆదాయం వాటి ఖాతాల్లోనే ఉండేది. ఇప్పుడు మాత్రం నేరుగా ట్రెజరీ ఖాతా లోకి వెళుతుండటంతో కమిటీలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గతంలో ఎల్‌వోసీ (లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌) ద్వారా మార్కెట్‌ కమిటీలకు బిల్లులు వచ్చేవి. 

ఇప్పుడు ఐఎఫ్‌ఎంఎస్‌ (ఇంటిగ్రేటెడ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌) ద్వారా లింక్‌ చేయడంతో మార్కెట్‌ కమిటీల నిర్వహణ నిధులకు సంబంధించి ప్రతి చిన్న బిల్లుకు ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రావాల్సి ఉంటోంది. ఈ అనుమతులు రాకపోవడంతో మార్కెట్‌ కమిటీల నిర్వహణలో అనేక సమస్యలు వస్తున్నాయి. ఎక్కడికక్కడ కమిటీల చైర్మన్లు, కార్యదర్శులే తమ సొంత డబ్బులు ఖర్చు పెడుతూ నెట్టుకొస్తున్నట్టు తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement