
సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో హైకోర్టు సీజే జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ శామ్‌కోషి, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి
సీజే జస్టిస్ ఏకే సింగ్‌కు తెలిపిన సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో న్యాయవ్యవస్థకు మౌలిక సదుపాయాల కల్పన, కోర్టుల్లో సిబ్బంది నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. జిల్లా కోర్టుల నిర్మాణానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్ సూచనలిస్తే స్వీకరిస్తామని చెప్పారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సీఎం రేవంత్, జస్టిస్ ఏకే సింగ్ శనివారం భేటీ అయ్యారు.
కొత్త జిల్లాల్లో కోర్టు భవనాలు, మౌలిక వసతుల కల్పనతో పాటు అవసరమైన సిబ్బంది నియామకాలను త్వరితగతిన చేపట్టాలని జస్టిస్ ఏకే సింగ్ కోరారు. దీనిపై పలు ప్రతిపాదనలను సీఎం దృష్టికి తెచ్చారు. న్యాయవ్యవస్థ సూచనల మేరకు అవసరమైన వసతులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ తెలియజేశారు. ఈ సమావేశంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శామ్‌కోషి, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, అడ్వొకేట్ జనరల్ ఎ. సుదర్శన్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.