SLBC Tunnel: టన్నెల్‌లోకి ప్రవేశించిన రోబోలు | Rescue Operation In SLBC Tunnel 18th Day Updates And Top News Headlines In Telugu | Sakshi
Sakshi News home page

SLBC Tunnel: టన్నెల్‌లోకి ప్రవేశించిన రోబోలు

Mar 11 2025 8:49 AM | Updated on Mar 11 2025 10:32 AM

Rescue Operation In Slbc Tunnel 18th Day Updates

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌ 18వ రోజు కొనసాగుతోంది. సహాయ చర్యల్లోకి రోబోలతో పాటు వాటి బృందాలు అనుమానిత ప్రాంతాల్లో విస్తృతంగా తవ్వకాలు కొనసాగుతున్నాయి

సాక్షి, నాగర్‌కర్నూల్‌/మహబూబ్‌నగర్‌: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌ 18వ రోజు కొనసాగుతోంది. సహాయ చర్యల్లోకి రోబోలతో పాటు వాటి బృందాలు అనుమానిత ప్రాంతాల్లో విస్తృతంగా తవ్వకాలు కొనసాగుతున్నాయి. నేడు ఒకటో, రెండో మృతదేహాలు బయటపడే అవకాశం ఉంది. మంగళవారం ఉదయం అన్వి రోబో బృందంతో పాటు మొదటి షిప్ట్‌లో 110 మంది ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లోకో ట్రైన్‌లో బృందాలు టన్నెల్‌ లోపలికి వెళ్లాయి. టన్నెల్‌ నుంచి ఇప్పటికే ఒక మృతదేహాన్ని వెలికితీశారు. మిగిలిన ఏడుగురి కోసం గాలింపు కొనసాగుతోంది. మినీ జేసీబీలతో శిథిలాలను తొలగిస్తున్నారు.

ఇప్పటికే 14 బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటుండగా.. సింగరేణి కారి్మకులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. సొరంగం లోపల చిక్కుకున్న వారిని గుర్తించేందుకు కేరళ రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా వచ్చిన కాడవర్‌ డాగ్స్‌ తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. జీపీఆర్, కాడవర్‌ డాగ్స్‌ చూయించిన ప్రదేశంలోనే ప్రధానంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. ఆదివారం రాబిన్స్‌ కంపెనీలో టీబీఎం ఆపరేటర్‌గా పనిచేస్తున్న గురుప్రీత్‌సింగ్‌ మృతదేహం లభించింది. దీంతో మిగతా 7 మంది కోసం సహాయక బృందాలు అన్వేషణను ముమ్మరం చేశాయి. టీబీఎం విడి భాగాలను తొలగిస్తూనే ఆ ఏడు మంది కోసం సొరంగంలో గాలిస్తున్నారు. స్థానిక యంత్రాంగం గంటగంటకూ సొరంగంలో జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తున్నారు.

ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో 13.850 కి.మీ. వద్ద ప్రమాదం చోటుచేసుకోగా, అక్కడి చేరుకుని సహాయక చర్యలు చేపట్టడమే రెస్క్యూ బృందాలకు ప్రతిరోజు క్లిష్టతరమవుతోంది. సొరంగంలో 13 కి.మీ. లోపల రెస్క్యూ నిర్వహించే సిబ్బందికి సైతం ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. 16 రోజుల పాటు నిరంతరం శ్రమించిన రెస్క్యూ బృందాలకు ఆదివారం ఒక కారి్మకుడి మృతదేహం లభ్యమైంది. సమీపంలో గాలిస్తున్నా మిగతా వారి ఆచూకీ లభించడం లేదు. సోమవారం రెస్క్యూ బృందాలతో కలసి సొరంగంలోని ప్రమాదస్థలం వద్దకు ‘సాక్షి’ వెళ్లి పరిశీలించింది.

సొరంగం ఇన్‌లెట్‌ నుంచి 13.850 కి.మీ. దూరంలో ఉన్న ప్రమాదస్థలం వద్దకు రెస్క్యూ బృందాలు చేరుకునేందుకే కనీసం 1.45 గంటలు పడుతోంది. లోకోట్రైన్‌ ద్వారా రాకపోకలకే కనీసం 3›–4 గంటలు పడుతోంది. ఒక్కో షిఫ్టులో సహాయక బృందాలు 12 గంటల పాటు పనిచేస్తున్నారు. సొరంగంలో 12 కి.మీ. వద్దకు చేరుకున్నాక సీపేజీ నీరు, బురద వస్తోంది. 13.200 కి.మీ. పాయింట్‌ వరకూ లోకో ట్రైన్‌ వెళ్లగలుగుతోంది. లోకో ట్రైన్‌ ట్రాక్‌ తర్వాత రెండు ఎస్కవేటర్లు మట్టి, శిథిలాలను తొలగిస్తున్నాయి.

SLBC టన్నెల్ వద్ద 18వ రోజు కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

13.400 వద్ద టీబీఎం భాగాలు టన్నెల్‌ నిండా చిక్కుకుని ఉండగా, సహాయక బృందాలు లోపలికి వెళ్లేందుకు వీలుగా కుడివైపు నుంచి మిషిన్‌ భాగాలను కట్‌చేసి దారిని ఏర్పాటుచేశారు. అక్కడి నుంచి ప్రమాదస్థలం 13.850 వరకూ  కాలినడకన బురద, శిథిలాల మధ్య జాగ్రత్తలు పాటిస్తూ చేరుకోవాల్సి ఉంటుంది. సొరంగానికి కుడివైపున కన్వేయర్‌ బెల్టు అందుబాటులోకి తీసుకురాగలిగారు. సుమారు 150 మీటర్ల విస్తీర్ణంలో 15 ఫీట్ల ఎత్తులో టన్నెల్‌ నిండా మట్టి, బురద పేరుకుని ఉండటంతో వాటిని తొలగించేందుకు రోజులు పట్టే అవకాశం ఉంది. దీంతో కడావర్‌ డాగ్స్‌ సూచించిన ప్రాంతాల్లోనే తవ్వకాలను జరిపి కార్మికుల జాడ కోసం అన్వేషణ చేపడుతున్నారు.

సొరంగంలో చిక్కుకున్న 8 మందిలో గురుప్రీత్‌సింగ్‌ మృతదేహం లభ్యమైన ప్రదేశంలో పక్కనే ఆదివారం, సోమవారం సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కేరళ నుంచి వచ్చిన కడావర్‌ డాగ్స్, జీపీఆర్‌ సిస్టం ద్వారా గుర్తించిన డీ1, డీ2 లొకేషన్లలో సింగరేణి కార్మికులు, ర్యాట్‌ హోల్‌ మైనర్లు, ఇతర సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సోమవారం పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ సహాయక బృందాలకు దిశానిర్దేశం చేస్తూ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌ పలు సూచనలు చేశారు. మంగళవారం సొరంగం వద్ద సహాయక చర్యల్లో భాగంగా రోబోలు రంగంలోకి దిగనున్నాయి. హైదరాబాద్‌కు చెందిన అన్వి రోబో నిపుణులు రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగించనున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement