
ఆహ్లాదకర వాతావరణం, వనమూలికలకు ప్రసిద్ధి
శ్రావణమాసంలో పర్యాటకుల సందడి
పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేయాలని విన్నపాలు
రామగిరి(మంథని): రాముడు నడయాడిన నేలగా రామగిరి ఖిల్లా పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఒకప్పుడు నక్సలైట్లకు ఆవాసంగా ఉండేది. అలనాటి చారిత్రక కట్టడాలు, ఆయుర్వేద వనమూలికల భాండాగారంగా ప్రసిద్ధి చెందింది. విభిన్న జాతుల వృక్షాలతో.. ప్రకృతి ప్రేమికుల్ని ఆకట్టుకుంటోంది. అద్భుత కళాసంపదకు నిలయమైన రామగిరి ఖిల్లా.. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామం నుంచి కల్వచర్ల గ్రామం వరకు విస్తరించి ఉంది. శ్రీరాముడు వనవాస సమయంలో ఇక్కడికి వచ్చి తపస్సు చేసి శివలింగం ప్రతిష్టించినట్లు కథనం ప్రచారంలో ఉంది.
వనవాసం సమయంలో కొద్ది రోజులు కుటీరం ఏర్పరచుకొని సీతాలక్ష్మణులతో ఉన్నారని, ఖిల్లాపై సీతారామలక్ష్మణులు సంచరించినట్లు కొన్ని ఆనవాళ్లు ఇప్పటికీ దర్శనమిస్తాయి. ఖిల్లా బండరాతిపై శ్రీరాముని పాదాలు, సీతాదేవి స్నానమాచరించిన కొలనుతో పాటు ఆంజనేయుని విగ్రహాలు ఉన్నాయి. ఏటా శ్రావణమాసంలో కోటపై సీతాసమేత శ్రీరాముడు, హనుమాన్ విగ్రహల ఊరేగింపు నిర్వహించి పూజలు చేస్తారు.
చూడాల్సిన ప్రదేశాలు
ఖిల్లాలో ఏడు కోట ప్రవేశ దర్వాజాలు, 15 ఎత్తయిన శత్రు సైన్యాన్ని పసిగట్టే బురుజులున్నాయి. మొదటి దర్వాజాకి కుడి వైపు వెళ్తే జలపాతం, రెండో దర్వాజా ప్రవేశంలో కుడివైపు గోడలపైన క్రీ.శ.1556 కాలం నాటి పది పంక్తులున్న తెలుగు శాసనం కనిపిస్తాయి. దర్వాజా ప్రవేశించిన తర్వాత ఎడమవైపు అద్భుతమైన పచ్చని కోట, 25 మీటర్ల పొడవున్న అతిపెద్ద ఫిరంగి, నాలుగో దర్వాజాపై అతిపెద్ద ఫిరంగితో పాటు ఏనుగుతో పోరాడుతున్న యోధుడి శిల్పం, రెండు తలల గరుత్మంతుడి శిల్పం ఉంటాయి.
పదిహేను మీటర్ల పొడవున్న పిల్లల ఫిరంగి ఉంటుంది. ఆరో దర్వాజా నుంచి 21 మెట్లు ఎక్కితే కోటపై నుంచి మానేరువాగు వయ్యారాలతో పాటు ఖిల్లాపై వివిధ చారిత్రక స్థలాలైన సీతమ్మ స్నానమాడిన కొలను, పసరు బావులు, పసుపు, కుంకుమ భరణి, సవతుల బావులు, మాధవీ మండపం, రాముడు ప్రతిష్టించిన శివలింగాలు, హనుమంతుడి విగ్రహం, చరశాలలు, గజశాలలు, అశ్వశాలలు, రాజమందిరానికి రాతి నీటి గొట్టాలు, చివరగా సీతారాముల వారిని దర్శించుకోవచ్చు.
శ్రావణమాసంలో సందడి
ప్రతి శ్రావణమాసంలో రామగిరి ఖిల్లాపై పర్యాటకుల సందడి ఉంటుంది. ఈ దుర్గంపై నుంచి ప్రకృతి అందచందాలను తిలకిస్తూ పర్యాటకులు మైమరిచిపోతారు. ఆయుర్వేద వైద్యులు ఈ ఖిల్లాపై వనమూలికలను సేకరిస్తారు. పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని గతంలో ప్రభుత్వం రూ.5 కోట్లు కేటాయించింది. ప్రాచీన కళలకు నిలయమైన రామగిరిఖిల్లా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించి పనులు నిర్వహిస్తే పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చెందుతుంది.
ఖిల్లాకు వెళ్లే దారి
పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి మంథని ప్రధాన రహదారిలో సుమారు 20 కిలోమీటర్లు ప్రయాణించి బేగంపేట ఎక్స్‌రోడ్ (నాగెపల్లి) వద్ద దిగాలి. ఆటోద్వారా బేగంపేట గ్రామానికి చేరుకుని సుమారు 3 కిలోమీటర్లు కాలినడకన ఖిల్లాకు చేరుకోవచ్చు. ఖిల్లాకు ఉదయం 8 గంటల వరకు వెళ్తే.. సాయంత్రం 5 గంటల వరకు అన్ని ప్రదేశాలు చూడవచ్చు.
