తప్పుడు సలహాలు..కొన్నిసార్లు ఆత్మహత్య ఆలోచనలు...
సంక్షోభాలకు సరైనప్రతిస్పందనలను అందించడంలో విఫలం అవుతాయంటున్నఅధ్యయనాలు
వంటలు మొదలు పన్నురిటర్న్‌ల వరకు పెరిగిన వినియోగం
పన్ను మదింపు, ఆరోగ్యం వంటి వాటిలో చాట్‌బాట్‌పై ఆధారపడటం రిస్క్
సాక్షి, హైదరాబాద్ : ఇప్పుడు సర్వం చాట్‌బాట్ మయమైపోతోంది. వంట మొదలు ఆదాయపు పన్ను మదింపు వరకు... సాధారణ అనారోగ్య సమస్యలు మొదలు వివిధ స్పెషలైజ్డ్ రంగాల్లోనూ దీనిపై ఆధారపడుతున్నారు. రోజువారీ పనుల కోసం ఏఐ చాట్‌బాట్‌లను ఉపయోగిస్తున్నా... అది ఇచ్చే సమాచారం కచ్చితత్వం, డేటా గోప్యత, జవాబుదారీతనం విషయంలో ప్రమాదాలు పొంచి ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
‘వంటకాల విషయంలో చాట్‌బాట్‌లు భోజన ప్రణాళికలను రూపొందించగలవు, తగిన వంటకాలను సూచించగలవు. అయితే రుచిని లేదా ఆకృతిని అంచనా వేయలేదు. వంటల్లో కొలతలు తప్పుగా ఉండొచ్చు, ఆహార సంప్రదాయాలను విస్మరించవచ్చు. ఆలోచనల రూపకల్పనకు ఇది సురక్షితమే కానీ సమస్యల నివారణకు ఇచ్చే సూచనలను తరచుగా సమీక్షించాల్సి ఉంటుంది’అని నిపుణులు సూచిస్తున్నారు.
పన్ను మదింపు, హెల్త్ ఇష్యూస్ వంటి వాటిలో దీనిపై అతిగా లేదా పూర్తిగా ఆధారపడటం ప్రమాదకరమని చెబుతున్నారు. ప్రతి 8 మంది టీనేజర్లు/యువకుల్లో ఒకరు సలహా కోసం వీటిని ఉపయోగిస్తున్నారు. ఓపెన్ ఏఐ, హార్వర్డ్ అధ్యయనం ప్రకారం... అన్ని రంగాల్లో చాట్‌బాట్‌లపై ఆధారపడటం పెరిగింది.
ఆరోగ్య విషయంలో...
చాట్‌బాట్‌లు తప్పుడు లేదా హానికరమైన వైద్య సలహాలనుఇవ్వగలవని వివిధ అధ్యయనాలు వెల్లడించాయి. కొన్నిసార్లుఆత్మహత్య ఆలోచనల వంటి సంక్షోభాలకు సరైన ప్రతిస్పందనలను అందించడంలో విఫలమౌతాయని చెప్పాయి.
» వైద్య సంబంధిత ప్రశ్నలకు అనేక చాట్‌బాట్ ప్రతిస్పందనల్లో తప్పుడు సమాచారం ఉంటోంది.
» ఆరోగ్య సలహాల కోసం ఏఐని ఉపయోగించడం ప్రమాదకరం.
» తీవ్రమైన అనారోగ్య సమస్యలకు వైద్య సహాయంపొందడంలో ఆలస్యం జరగవచ్చు.
» వైద్యుల మాదిరిగా ఏఐ శారీరక పరీక్షలు చేయలేదు. అలాగే వినియోగదారుడి పూర్తి వైద్య చరిత్రను అర్థం చేసుకోలేదు.సందర్భం తెలియకపోవడం వల్ల తప్పుడు రోగ నిర్ధారణల జరుగుతాయి.
» మానసిక ఆరోగ్యం కోసం చాట్‌బాట్‌లపై ఆధారపడితే వృత్తిపరమైన సంరక్షణ విషయంలో చిక్కులు ఎదుర్కునే ప్రమాదముంది.
» హానికరమైన సలహాలను ఇచ్చిన తర్వాత, యూఎస్ నేషనల్ ఈటింగ్ డిజార్డర్స్ అసోసియేషన్ (నెడా) తమ చాట్‌బాట్ ’టెస్సా’ను తొలగించింది.
పన్ను మదింపు విషయంలో..
» ఏఐ పాత పన్ను చట్టాలనుఉపయోగించవచ్చు. వ్యూహాత్మక ప్రణాళికను అందించలేకపోవచ్చు. కచ్చితత్వ సమస్యలెదురుకావొచ్చు.
» పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులకు బాధ్యత వహించాలి. ఏఐ ప్లాట్‌ఫారమ్‌లు తరచుగా తమ సమాధానాలు అధికారిక సలహా కాదని పేర్కొంటాయి.
» డేటా గోప్యతకు భంగం వాటిల్లుతుంది.
వివిధ అధ్యయనాల్లో సిఫార్సులు
» అత్యంత కీలకమైన సమాచారం కోసం ఎల్లప్పుడూ మానవ నిపుణులను సంప్రదించాలి.
» వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారాన్ని చాట్‌బాట్‌లతో పంచుకోవద్దు. వ్యక్తిగత డేటాను సంరక్షించుకోవాలి.
» సాధారణ మేధోమథనం కోసం ఏఐని ఉపయోగించుకోవచ్చు. ఏదైనా అంశానికి సంబంధించి ప్రాథమిక, ప్రారంభ సమాచారంగా మాత్రమే ఉపయోగించుకోవచ్చు.


