ఆరు నుంచి ముప్పైకి.. వర్సిటీ ప్రతిష్ట కిందకి

Prof Jayashankar Agricultural University 30th Place In Icar Rankings - Sakshi

ఐకార్‌ టాప్‌ ర్యాంక్‌ కోల్పోయిన జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ 

గతంలో దేశంలో ఆరో స్థానం... ఇప్పుడు 30వ స్థానం 

గత ర్యాంకులపై ఇతర వ్యవసాయ వర్సిటీల ఫిర్యాదు 

కారణాలు కోరుతూ ఐకార్‌కు లేఖ రాసిన అధికారులు 

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ విద్యలో ఒక వెలు గు వెలిగిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఒక్కసారిగా తన ప్రభను కోల్పోయింది. భారతీయ వ్యవసాయ పరి శోధన సంస్థ (ఐకార్‌) కొద్దిరోజుల క్రితం విడుదల చేసిన వ్యవసాయ విశ్వవిద్యాలయాల ర్యాంకుల్లో కిందిస్థాయికి పడిపోయింది. గతంలో ఆరో ర్యాంకు సాధించగా, 2020 సంవత్సరానికి సంబంధించి ఇటీవల విడుదల చేసిన జాబితాలో 30వ స్థానానికి పడిపోయింది. వాస్తవంగా ఈసారి తొలి ఒకట్రెండు స్థానాల్లో ఉంటామని కొందరు భావించినట్లు ప్రచారం కూడా జరిగింది. కానీ ఇంత ఘోరంగా పరిస్థితి మారడంపై చర్చ జరుగుతోంది.  

ఎందుకిలా?  
తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉండేది. రాష్ట్రం ఏర్పడ్డాక ఆ పేరు ఏపీకి వెళ్లగా, తెలంగాణలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ పేరుతో కొత్త గా ఏర్పడింది. అంటే రాష్ట్రంతోపాటు గత వ్యవసా య విశ్వవిద్యాలయం విడిపోయిందని అనుకోవచ్చు. కొత్త వర్సిటీలో అనేక సంస్కరణలు చేశామని, కొత్త వంగడాలు, పరిశోధనలు, రైతులకు మేలు చేసే అనేక కార్యక్రమాలు చేపట్టామని అధికారులు చెప్పేవారు.

నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడం, అంతర్జాతీయ వర్సిటీల నుంచి ఫ్యాకల్టీని తీసుకురావడం జరిగిందని అనేవారు. అందుకే వర్సిటీకి ఆరో ర్యాంకు వచ్చిందని  చెప్పేవారు. తమకు తక్కువ ర్యాంకు ఎందుకు వచ్చిందో అర్థం కావడంలేదని, కారణాలు తెలుసుకునేందుకు ఐకార్‌కు లేఖ రాసినట్లు వర్సిటీకి చెందిన ఓ కీలకాధికారి చెప్పారు.

తమ పరిశోధన పత్రాలు కొన్ని ప్రముఖ జర్నల్స్‌ల్లో అనుకున్న స్థాయిలో ప్రచురితం కాకపోవడం ఒక కారణమన్నారు. ర్యాంకింగ్‌లో విద్యార్థి–అధ్యాపక నిష్పత్తి, పరిశోధనలు, కొత్త వంగడాలు, జాతీయ–అంతర్జాతీయ స్థాయి లో ఒప్పందాలు, ఇతర వర్సిటీల కంటే ప్రత్యేకంగా చేపట్టే కార్యకలాపాలు కీలక పాత్ర పోషిస్తాయి.

ఫిర్యాదుల వల్లనే... 
వర్సిటీ ర్యాంకు 30వ స్థానానికి పడిపోవడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయని పలువురు నిపుణులు చెబుతున్నారు. గతంలో ఆరో ర్యాంకు సాధించినప్పుడు కొన్ని ఇతర రాష్ట్రాల వ్యవసాయ విశ్వవిద్యాలయాలు మన వర్సిటీపై ఐకార్‌కు ఫిర్యాదులు చేశాయని అంటున్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి వచ్చిన కొన్ని వారసత్వాలను కూడా కొత్త వర్సిటీ చెప్పుకుంటోందన్న విమర్శలు అందులో ఉన్నట్లు సమాచారం. అంటే ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, ఇతర రాష్ట్రాల్లో చదివి ఈ వర్సిటీలో అధ్యాపక వృత్తి చేపట్టిన వారి విషయంలో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఎన్జీ రంగా వర్సిటీ ఏపీకి వెళ్లిపోగా, అప్పుడు చదివిన వారు ఇప్పుడు వేరే రాష్ట్రం కిందకు వెళ్లడంతో దాన్ని అనుకూలంగా వాడుకున్నారన్న ఫిర్యాదు వెలుగుచూసింది. ఈ నేపథ్యంలో ర్యాంకు ఖరారులో ఈసారి ప్రతీ అంశాన్ని క్షుణ్నంగా పరిశీలించారని అందుకే ర్యాంకు దిగువకు పడిపోయిందని ఒక వర్సిటీ అధికారి వ్యాఖ్యానించారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top