డిపోర్టేషన్‌కు ‘నై’జీరియన్లు! | Police are struggling to control Nigerians | Sakshi
Sakshi News home page

డిపోర్టేషన్‌కు ‘నై’జీరియన్లు!

Jun 6 2025 1:45 AM | Updated on Jun 6 2025 1:45 AM

Police are struggling to control Nigerians

తిప్పి పంపడాన్ని తప్పించుకోవడానికి కేసులు 

కావాలనే నమోదయ్యేలా చేసుకుంటున్న వైనం

బలవంతంగా పంపినా మరో పాస్‌పోర్టుతో రాక 

కట్టడి చేయలేక తలలు పట్టుకుంటున్న పోలీసులు 

సాక్షి, హైదరాబాద్‌: వివిధ రకాలైన వీసాలపై వచ్చి ..సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌ దందాతో దడ పుట్టిస్తున్న నల్లజాతీయులు పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. దీంతో వీరిని జైలుకు పంపడం కంటే..డిపోర్టేషన్‌ ద్వారా తిప్పిపంపడమే ఉత్తమని పోలీసులు భావిస్తున్నారు. అయితే దీనిని కూడా తప్పించుకోవడానికి ఆ కేటుగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది. ఇలాంటి వారిలో నైజీరియన్లే ఎక్కువగా ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.  

వివిధ రకాలైన వీసాలపై వచ్చి తిష్ట  
నైజీరియా, సోమాలియా, టాంజానియా, ఐవరీ కోర్టు, మొరాకో వంటి దేశాల నుంచి అనేకమంది వివిధ రకాలైన వీసాలపై హైదరాబాద్‌ వస్తున్నారు. వీరిలో కొందరు వీసా, పాస్‌పోర్టుల గడువు ముగిసినా అక్రమంగా నివసిస్తున్నారు. అనేక మంది డ్రగ్స్‌ దందాలు, సైబర్‌ నేరాలు చేస్తున్నారు. 

గతంలో ఇలా ఉంటూ చిక్కిన వారిపై ఫారెనర్స్‌ యాక్ట్, ఎన్డీపీఎస్‌ యాక్ట్‌ తదితరాల కింద కేసు నమోదు చేసేవారు. కోర్టులో దీని విచారణ పూర్తయ్యే వరకు డిపోర్టేషన్‌ చేయడానికి ఆస్కారం ఉండేది కాదు. ఈ మధ్య కాలంలో బెయిల్‌పై బయటకు వచ్చే ఆ విదేశీయులు జైల్లో ఏర్పడిన పరిచయాలతో మరింత రెచ్చిపోవడం ప్రారంభించారు.  

పోలీసుల్ని ముప్పతిప్పలు పెడుతూ... 
ఫారెనర్స్‌ రీజినల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌ (ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ) సాయంతో నల్లజాతీయులను డిపోర్టేషన్‌ చేయడం మొదలెట్టారు. అయితే ఈ డిపోర్టేషన్‌ను తప్పించుకోవడానికి నల్లజాతీయులు కొత్త ఎత్తులు వేస్తున్నారు. తమ వివరాలు చెప్పకపోతే ఎంబసీ నుంచి క్లియరెన్స్‌ రాదని తెలుసుకున్నారు. దీంతో అసలు వివరాలు చెప్పకుండా డిటెన్షన్‌ సెంటర్‌లోనే ఉండిపోతామంటున్నారు. సాంకేతిక ఆధారాల ద్వారా పోలీసులు ఈ వివరాలు సేకరిస్తే, స్థానికంగా ఉన్న తమ అనుచరుల ద్వారా మరో కథ నడిపిస్తున్నారు. 

ఇక్కడే ఉంటున్న ఆ దేశీయురాలితో వివాహమైనట్టు, ఆమెను వేధిస్తున్నట్టు కేసులు పెట్టించుకుంటున్నారు. ఇలా నమోదైన కేసుల విచారణ పూర్తయ్యే వరకు వారిని డిపోర్ట్‌ చేయడానికి ఆస్కారం ఉండట్లేదు. ఈ వ్యవహారాలన్నింటినీ నైజీరియన్లు వ్యవస్థీకృతంగా నడిపిస్తున్నారు. ఈ వివరాలను గుర్తిస్తున్న పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఆ కేసుల్ని మూసేయించి డిపోర్ట్‌ చేస్తున్నారు.  

‘అవతారం’మార్చుకొని మళ్లీ అడుగు... 
డిపోర్టేషన్‌ ద్వారా తమ దేశానికి వెళ్లిపోతున్న నైజీరియన్లు అక్కడ నుంచి ఘనా, ఐవరీకోస్ట్, సూడాన్‌లకు చేరుకుంటున్నారు. అక్కడ ఉన్న భారీ నెట్‌వర్క్‌ వీరికి ఆ దేశాల పౌరసత్వం, గుర్తింపులు ఇప్పిస్తోంది. వీటి ద్వారా పాస్‌పోర్ట్‌ పొందుతున్న నైజీరియన్లు ఆ మూడు దేశాలకు చెందిన వారుగా మళ్లీ ఇక్కడకు వస్తున్నారు. ఆపై ఈ నల్లజాతీయులు తమ గుర్తింపుల్ని దాచేస్తున్నారు. 

నకిలీ పేర్లు, వివరాలతో ఫోర్జరీ పాస్‌పోర్టు, వీసాలు తయారు చేసుకుంటున్నారు. పట్టుబడుతున్న వారిలో దాదాపు 70 శాతం మంది వద్ద ఇవే లభిస్తున్నాయి. ఈ కారణంగానే వీరి వివరాలు కాదు కదా అసలు పేరు తెలుసుకోవడం కూడా కష్టసాధ్యంగా మారుతోంది. వీరిని కట్టడి చేయలేక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement