రోగాలను బట్టి పీజీ మెడికల్‌ సీట్లు! | PG medical seats depending on diseases | Sakshi
Sakshi News home page

రోగాలను బట్టి పీజీ మెడికల్‌ సీట్లు!

Published Sat, Sep 9 2023 3:26 AM | Last Updated on Sat, Sep 9 2023 3:27 AM

PG medical seats depending on diseases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆయా ప్రాంతాల్లో వ్యాధులు.. రోగుల సంఖ్య..అందుతున్న వైద్య సేవలను బట్టి మెడికల్‌ కాలేజీలకు పీజీ సీట్లు కేటాయించాలని జాతీయ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) నిర్ణయించింది. అంటే ఏ ప్రాంతంలో ఎలాంటి  రోగాలున్నాయో, ఆయా ప్రాంతాల్లోని మెడికల్‌ కాలేజీలకు ఆయా స్పెషాలిటీల్లో పీజీ మెడికల్‌ సీట్లు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట.

ఈ మేరకు కొత్త పీజీ మెడికల్‌ ముసాయిదాను విడుదల చేసింది. దీని ప్రకారం.. మెడికల్‌ కాలేజీలో సంబంధిత స్పెషాలిటీ వైద్యంలో ఔట్‌ పేషెంట్‌ (ఓపీ)ల సంఖ్య 50కి తగ్గకుండా ఉంటేనే రెండు ఎండీ లేదా ఎంఎస్‌ సీట్లను ఎన్‌ఎంసీ మంజూరు చేస్తుంది. ఉదాహరణకు ఒక మెడికల్‌ కాలేజీకి రెండు పీడియాట్రిక్‌ సీట్లు కావాలంటే సంబంధిత కాలేజీలో రోజుకు చిన్న పిల్లల ఓపీ కనీసం 50 ఉండాలి.

ఒక ఆపరేషన్‌ థియేటర్‌ 24 గంటలు పనిచేస్తేనే రెండు పీజీ అనస్తీషియా సీట్లు ఇస్తారు. వారానికి 20 ప్రసవాలు జరిగితేనే రెండు గైనిక్‌ సీట్లు ఇస్తారు. ఇక సంబంధిత స్పెషాలిటీలో అదనంగా మరో సీటు కావాలంటే 20 శాతం ఓపీ పెరగాలి. సూపర్‌ స్పెషాలిటీకి సంబంధించి రెండు సీట్లు కేటాయించాలంటే ఆయా సూపర్‌ స్పెషాలిటీ విభాగంలో రోజుకు 25 ఓపీ ఉండాలి. 

పడకల్లో 75% ఆక్యుపెన్సీ ఉండాలి
ఎన్‌ఎంసీ మరికొన్ని కొత్త నిబంధనలను కూడా ముసాయిదాలో చేర్చింది. మెడికల్‌ కాలేజీల్లోని స్పెషాలిటీ పడకల్లో 75 శాతం ఆక్యుపెన్సీ ఉండాలి. అల్ట్రా సౌండ్‌లు రోజుకు 30 జరగాలి. 10 సీటీ స్కాన్లు చేయాలి. రోజుకు మూడు ఎంఆర్‌ఐ స్కాన్లు తీయాలి. రోజుకు 15 శాతం మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించాలి. గతంలో ఇలాంటి నిబంధనలు లేవు. సంబంధిత స్పెషాలిటీలో నిర్ణీత ఓపీ సంఖ్యతో సంబంధం లేకుండా మౌలిక సదుపాయాలు, సర్జరీలు, అన్ని రకాల ఓపీలు, ఐపీలు, బ్లడ్‌ బ్యాంకు నిర్వహణ, సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ యంత్రాలు ఉన్నాయా లేవా? వంటివి మాత్రమే చూసి సీట్లు ఇచ్చేవారు. ఇప్పుడు ప్రధానంగా ఓపీని ప్రామాణికంగా తీసుకొని ఇవ్వాలని నిర్ణయించారు.  

ఐసీఎంఆర్‌ ఆన్‌లైన్‌ కోర్సులు చదవాలి
ఎండీలో కొత్తగా 3 కోర్సులను ఎన్‌ఎంసీ చేర్చింది. ప్రజా రోగ్యం, బయో ఫిజిక్స్, లేబొరేటరీ మెడిసిన్‌లను ప్రవేశపెట్టింది. అలాగే సూపర్‌ స్పెషాలిటీలో ఉండే చిన్న పిల్లల గుండె, రక్తనాళాల కోర్సులను ఎత్తివేసి, సాధారణ గుండె, ఛాతీ, రక్తనా ళాల సర్జరీలో చేర్చింది. సూపర్‌ స్పెషాలిటీలో ఉన్న ఛాతీ శస్త్రచి కిత్స కోర్సును ఎత్తివేసి సాధారణ గుండె శస్త్రచికిత్సలో కలి పేసింది. అలాగే 11 పోస్ట్‌ డాక్టర్‌ సర్టిఫికెట్‌ కోర్సులు ప్రవేశపె ట్టింది.

అవయవ మార్పిడి అనెస్తీషియా, పీడియాట్రిక్‌ ఎండోక్రైనాలజీ, లేబొరేటరీ ఇమ్యునాలజీ, న్యూక్లియర్‌ నెఫ్రాలజీ, రీనాల్‌ పెథాలజీ, గ్యాస్ట్రో రేడియాలజీ, రక్తమార్పిడి థెరపీ, పెయిన్‌ మేనేజ్‌మెంట్, హిమటో ఆంకాలజీ, పీడియాట్రిక్‌ ఈ ఎన్‌టీ, స్పైన్‌ సర్జరీ కోర్సులు ప్రవేశపెట్టారు. పీజీ అయిపో యిన వారు ఈ కోర్సులను చేసే సదుపాయం కల్పించారు. ప్రతి పీజీ విద్యార్థి మొదటి ఏడాది ఐసీఎంఆర్‌ నిర్వహించే ఆన్‌ లైన్‌ కోర్సులు తప్పనిసరిగా చదవాలి. ఈ ముసాయిదా లోని అంశాలపై అభ్యంతరాలను 15లోగా తెలియజేయాలన్నారు.

ఇలా అయితేనే ఉపయోగం
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు దాదాపు అన్ని జిల్లాలకు విస్తరించాయి. అందువల్ల ఆయా మెడికల్‌ కాలేజీల్లో పీజీ మెడికల్‌ సీట్లను స్థానిక రోగాలను బట్టి కేటాయిస్తేనే ఉపయోగం ఉంటుంది. ఎన్‌ఎంసీ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో శాస్త్రీయ మైనది. ఆయా ప్రాంతాల రోగులకు సంబంధిత వైద్యం అందుబాటులోకి వస్తుంది. – డాక్టర్‌ కిరణ్‌ మాదల,ఐఎంఏ సైంటిఫిక్‌ కన్వీనర్, తెలంగాణ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement