సాక్షి, హైదరాబాద్ : ఉప్పల్ నుంచి రోజూ బంజారాహిల్స్‌లోని ఆఫీసుకు బైకుపై వచ్చేందుకు కుమార్ అనే ఉద్యోగికి నెలకు పెట్రోలు ఖర్చు రూ.1500 అయ్యేది. కొద్దిరోజులుగా పెరుగుతున్న పెట్రోల్ ధరల వల్ల అతని నెలవారి బండి ఖర్చు రూ.1800కు చేరుతోంది. ఇలా నగరంలో మధ్యతరగతి అల్పాదాయ వర్గాలపై చమురు ధరల పెంపు ప్రభావం గణనీయంగా ఉంటోంది. సోమవారం లీటర్‌పై ఏకంగా రూ. 2.84 పైసలు పెరిగింది.
గడిచిన పది రోజుల్లోనే మొత్తం రూ.8.23 పైసలు అదనపు భారం పడటంతో సామాన్యుడి బడ్జెట్ తలకిందులవుతోంది. నగరంలో సుమారు 66 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలు తిరుగుతున్నాయన్నది అంచనా. మెట్రో, సిటీ బస్సుల్లో రద్దీని తట్టుకోలేక, ఆటోలు, క్యాబ్‌ల చార్జీలు భరించ సొంత బండిని ఆశ్రయించిన వారికి పెట్రోల్ ధరలు షాక్ ఇస్తున్నాయి. ఒక సగటు ఉద్యోగి, వ్యాపారి తన విధులు, పనులకు వెళ్లి రావడానికి మొత్తం నెలవారీ పెట్రోల్ బిల్లును లెక్కగడితే భారం అధికంగానే ఉంది.


