ఆధారం..జాగారం! | People are struggling for changes and additions to Aadhaar | Sakshi
Sakshi News home page

ఆధారం..జాగారం!

Dec 25 2024 4:30 AM | Updated on Dec 25 2024 5:18 PM

People are struggling for changes and additions to Aadhaar

ఆధార్‌లో మార్పులు, చేర్పుల కోసం జనం తిప్పలు 

పొరపాట్లు, బయోమెట్రిక్‌ సవరణ కోసం ప్రాంతీయ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు 

రెండు తెలుగు రాష్టాల నుంచి హైదరాబాద్‌లోని ఆఫీసుకే రావాల్సిన పరిస్థితి 

తెల్లవారుజామున 5 గంటల నుంచే బారులు తీరుతున్న ప్రజలు 

రోజుకు 150 మందికి మాత్రమే టోకెన్లు ఇస్తున్న అధికారులు 

తప్పుల సవరణపై సందేహాలు నివృత్తి చేయని తీరు 

రోజులకు రోజులు ఇక్కడే ఉండాలంటే ఎలాగని దూరప్రాంతాల వారి ఆవేదన

సాక్షి, హైదరాబాద్‌:  ప్రస్తుతం ఏ చిన్న పని కావాలన్నా ఆధార్‌ కార్డు ఉండాల్సిందే. స్కూళ్లలో అడ్మిషన్‌ నుంచి ఉద్యోగం పీఎఫ్‌ వరకు, మొబైల్‌ సిమ్‌కార్డు నుంచి ట్రైన్‌ టికెట్‌ వరకు ఆధార్‌ కావాల్సిందే. ఇక ప్రభుత్వ పథకాలను పొందాలనుకునే ఆధార్‌ తప్పనిసరి. అలాంటి ఆధార్‌లో ఏవైనా పొరపాట్లు ఉంటే ప్రతిచోటా సమస్యలే. ఆ మార్పులు, చేర్పుల కోసం జనం తిప్పలు పడుతున్నారు. 

ఆధార్‌లో మార్పుచేర్పులు, అప్‌డేషన్‌కు ఉన్న పరిమితుల కారణంగా.. అవి దాటితే కచ్చితంగా ప్రాంతీయ కార్యాలయానికి రావాల్సిందే. దీనితో తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్‌లో ఉన్న యూఐడీఏఐ ప్రాంతీయ కార్యాలయానికి జనం క్యూకడుతున్నారు. 

తెల్లవారుజాము నుంచే టోకెన్‌ కోసం పడిగాపులు కాస్తున్నారు. రోజుకు 150 టోకెన్లు మాత్రమే ఇస్తుండటంతో మిగతావారు ఉసూరుమనాల్సి వస్తోంది. ప్రధానంగా విద్యార్థుల ఆధార్‌ కార్డులో అప్‌డేషన్‌ సమస్యగా మారింది. చిన్నప్పుడు ఆధార్‌ నమోదు చేసుకున్నవారు... నిర్ధారిత వయసు దాటాక బయోమెట్రిక్‌ను అప్‌డేట్‌ చేయించుకోవాల్సి రావడమే దీనికి కారణం.

అప్‌డేట్‌కు పరిమితులతో... 
భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ (యూఐడీఏఐ) 2019లో ఆధార్‌ రికార్డుల్లో మార్పులు, చేర్పులపై కొన్ని నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఆధార్‌ కార్డులో వ్యక్తి పేరు, పుట్టిన తేదీ, జెండర్‌ వంటివి అప్‌డేట్‌ చేసుకునేందుకు పరిమితులు పెట్టింది. ఆధార్‌ కార్డులో పేరును రెండుసార్లు మాత్రమే అప్‌ డేట్‌ చేసుకోవచ్చు. ఇంటిపేరు, స్పెల్లింగ్‌ తప్పిదాలను సరిచేసుకోవచ్చు. 

ఇందుకోసం తగిన ధ్రువపత్రాలను సమర్పించాలి.. పుట్టిన తేదీని కేవలం ఒకసారి మాత్రమే అప్‌డేట్‌ చేసుకోవచ్చు. అదికూడా నమోదు సమయంలో ఇచ్చిన తేదీకి మూడేళ్లు మాత్రమే తగ్గించుకోవచ్చు. అలాగే ఎంతైనా పెంచుకోవచ్చు. ఇందుకోసం తప్పనిసరిగా ఆధారాలు సమర్పించాలి. 

జెండర్‌ వివరాలు ఒక్కసారి మాత్రమే మార్చుకోవచ్చు. ఆధార్‌ కార్డుపై ఉండే ఫొటోను మాత్రం ఎన్నిసార్లయినా అప్‌డేట్‌ చేసుకోవచ్చు. దీనిపై పరిమితి లేదు. జారీ అయి పదేళ్లు దాటిన ఆధార్‌ కార్డుల్లో ఫొటో అప్‌డేట్‌ తప్పనిసరి.

రీజనల్‌ ఆఫీసులోనే మార్పులు.. 
నిర్దేశిత పరిమితి వరకు ఆన్‌లైన్‌లో తగిన ధ్రువపత్రాలను సమర్పించి ఆధార్‌ను అప్‌డేట్‌ చేసుకోవచ్చు. పరిమితి దాటితే యూఐడీఏఐ ప్రాంతీయ కార్యాలయంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. వాటికి తగిన ఆధారాలను జత చేయడంతోపాటు ఎందుకు వివరాలు మార్చాల్సి వస్తోందనేది స్పష్టంగా పేర్కొనాలి. 

ఈ–మెయిల్, పోస్ట్‌ ద్వారా కూడా ప్రాంతీయ కార్యాలయాలకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నా.. దానిపై అవగాహన లేక జనం ఇబ్బందిపడుతున్నారు. 

అంతేకాదు ఈ దరఖాస్తులకు తగిన ఆధారాలను చేయాలి, ఏమేం సమర్పించవచ్చన్నది తెలియడం లేదని జనం వాపోతున్నారు. దీనితో నేరుగా ప్రాంతీయ కార్యాలయానికి వస్తున్నామని పేర్కొంటున్నారు.

9 ఏళ్ల పాపకు 16 ఏళ్ల వయసు వేశారు 
మాది ఏపీలోని కర్నూలు జిల్లా నందవరం గ్రామం. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటా. నా కూతురు పేరు ఇందు. ఆమె వయసు తొమ్మిదేళ్లే. కానీ ఆధార్‌ కార్డులో 16 ఏళ్లు అని వచ్చిoది. దీనితో ప్రభుత్వ అమ్మ ఒడి పథకం అందలేదు. 

మూడుసార్లు కర్నూలులో ప్రయత్నించినా ఆధార్‌లో మార్పు జరగలేదు. హైదరాబాద్‌ ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లాలంటే వచ్చాం. రెండు, మూడు రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాం. ఏం చేయాలో తెలియడం లేదు. 
– హుసేనమ్మ, నందవరం గ్రామం,కర్నూలు జిల్లా

నాలుగేళ్లుగా తిరుగుతున్నాం 
మాది మహబూబ్‌నగర్‌ జిల్లా కాకర్లపాడు గ్రామం. నా కూతురు మాధవి ఇంటర్‌ చదువుతోంది. తన ఆధార్‌లో పేరు తప్పుగా ఉండటంతోపాటు బయోమెట్రిక్‌ తప్పుగా చూపిస్తోంది. నాలుగేళ్ల నుంచి స్థానికంగా ప్రయత్నం చేశాం. తెలిసిన వారు చెబితే ప్రాంతీయ కార్యాలయానికి వచ్చాం. తప్పులు సవరించాలంటే ఏం చేయాలనేది ఎవరూ చెప్పడం లేదు.  
– భారతమ్మ, కాకర్లపాడు, మహబూబ్‌నగర్‌  

అక్క బయోమెట్రిక్‌ తమ్ముడికి.. తమ్ముడి బయోమెట్రిక్‌ అక్కకు.. 
చిత్రంలో కనిపిస్తున్న ఇద్దరూ అక్కాతమ్ముళ్లు. కర్నూలు జిల్లా సీ బెళగాల్‌ మండలం చెందిన కృష్ణ దొడ్డి గ్రామానికి చెందినవారు. వీరి ఆధార్‌కార్డుల్లో అక్క మమత బయోమెట్రిక్‌ను తమ్ముడికి, తమ్ముడు గోవర్ధన్‌ బయోమెట్రిక్‌ను అక్క ఆధార్‌కు అనుసంధానం చేశారు. దీన్ని సరిచేసుకునేందుకు నాలుగేళ్లుగా ప్రయత్నిస్తున్నా ఫలితం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు.

ఇప్పటికే హైదరాబాద్‌లోని స్వర్ణ జయంతి కాంప్లెక్స్‌లో ఉన్న యూఐడీఏఐ ప్రాంతీయ ఆఫీస్‌కు మూడు సార్లు వచ్చామని.. ప్రతీసారి ఈ– మెయిల్‌ పెట్టామని చెప్తున్నారే తప్ప, సమస్య మాత్రం పరిష్కారం కాలేదని చెబుతున్నారు.

ఈ చిత్రంలోని విద్యార్థి పేరు మహమ్మద్‌ అబ్దుల్‌ గనీ. ఆరేళ్ల ›వయసులో ఉన్నప్పడు 2011లో అతడి తల్లిదండ్రులు ఆధార్‌ నమోదు చేయించారు. రెండేళ్ల క్రితం ఫోటో అప్‌డేట్‌ చేయించారు. ప్రస్తుతం ఘనీ ఇంటర్మీడియట్‌ చదువుతున్నాడు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ దరఖాస్తు కోసం బయోమెట్రిక్‌ అవసరం ఉండటంతో వేలిముద్ర ఇచ్చాడు. 

అది మిస్‌ మ్యాచ్‌ అని వస్తుండటంతో.. ఆధార్‌ కేంద్రాల్లో బయోమెట్రిక్‌ అప్‌డేషన్‌కు ప్రయత్నిoచాడు. కానీ ఆ బయోమెట్రిక్‌తో వేరేవారి పేరుతో ఆధార్‌ ఉన్నట్లుగా చూపిస్తోంది. యూఐడీఏఐ ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లి ప్రయత్నించినా.. ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement