మెరిసిన వరి రైతు... మునిగిన పత్తి రైతు | Paddy area increasing in Kharif every year | Sakshi
Sakshi News home page

మెరిసిన వరి రైతు... మునిగిన పత్తి రైతు

Nov 21 2024 4:25 AM | Updated on Nov 21 2024 4:26 AM

Paddy area increasing in Kharif every year

ఏటేటా ఖరీఫ్‌లో పెరుగుతున్న వరి విస్తీర్ణం.. తగ్గుతున్న పత్తి, ఇతర పంటల సాగు 

బియ్యానికి డిమాండ్‌తో ధాన్యానికి ‘మద్దతు’ కన్నా ఎక్కువ ధర 

పత్తి ధరలపై మాత్రం మార్కెట్‌ మాయాజాలం 

కొన్నేళ్లుగా రైతులకు చుక్కలు చూపిస్తున్న పత్తి 

వరికి ఖర్చు, పని తక్కువ.. పత్తి పంటకు ఈ రెండూ ఎక్కువే 

దీనితో వరి వైపు మళ్లుతున్న తీరు

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో రైతుల ఆలోచన మారుతోంది. కష్టంతో కూడుకున్న వాణిజ్య పంటల కంటే సంప్రదాయ వరి సాగువైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రంలో కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులతో పెరిగిన సాగునీటి వనరులతోపాటు కష్టం, ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ అనే ఉద్దేశంతో వరి వైపు మళ్లుతున్నారు. దీనితో ఏటేటా రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి వరితోపాటు పత్తి కూడా ప్రధాన పంటగా కొనసాగుతోంది. 

కానీ పత్తి ధరలు పడిపోతుండటం, దాని సాగు ఖర్చు ఎక్కువగా ఉండటంతో ఆ రైతులు మెల్లగా వరి సాగు చేపడుతున్నారని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. పదేళ్ల క్రితం వరకు కరీంనగర్, వరంగల్, మెదక్‌ ఉమ్మడి జిల్లాల్లో సాగునీటి సౌకర్యం లేని ప్రాంతాల్లో ఎక్కువగా పత్తిసాగు చేసేవారు. 

ఇప్పుడీ ప్రాంతాల్లో పత్తి తగ్గిపోయి, వరి పెరిగింది. ప్రస్తుతం నల్లగొండ, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాల్లో అధికంగా.. ఖమ్మం, వరంగల్‌లలో ఓ మోస్తరుగా పత్తి సాగు జరుగుతోంది. కానీ భవిష్యత్తులో ఈ జిల్లాల్లోనూ సాగు తగ్గే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. పత్తి మాత్రమేకాకుండా పప్పు ధాన్యాలు, నూనె గింజల సాగు పట్ల కూడా రైతుల్లో ఆసక్తి తగ్గుతోందని పేర్కొంటున్నారు. 

ఈ ఏడాది మునిగిన పత్తి రైతు 
రాష్ట్రంలో ఈ ఖరీఫ్‌ సీజన్‌లో 43.76 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. 2022 సంవత్సరంతో పోలిస్తే ఇది సుమారు 7 లక్షల ఎకరాల మేర తక్కువ. కేంద్ర ప్రభుత్వం పత్తికి కనీస మద్ధతు ధర రూ.7,521గా నిర్ణయించింది. కానీ కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో నిర్లక్ష్యం వహించడంతో రైతుకు గిట్టుబాటు ధర అందలేదు. 

సెప్టెంబర్ లో కురిసిన వర్షాలు, వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా పంట దిగుబడి కూడా తగ్గింది. పైగా పత్తి ధర తగ్గడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమైంది. రాష్ట్రంలోని పలు వ్యవసాయ మార్కెట్లలో పత్తి క్వింటాల్‌కు రూ.5,300 నుంచి రూ.7,000 వరకు మాత్రమే ధర పలికింది. 

దేశంలోనే మూడో స్థానం 
ఖరీఫ్‌ సీజన్‌లో దేశవ్యాప్తంగా 2.74 కోట్ల ఎకరాల్లో పత్తి సాగు జరిగింది. అత్యధిక సాగులో మహారాష్ట్ర, గుజరాత్‌ తొలి రెండు స్థానాల్లో.. తెలంగాణ మూడో స్థానంలో ఉన్నాయి. ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా 1.60 కోట్ల టన్నుల పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేయగా.. అందులో తెలంగాణలో 25.33 లక్షల టన్నుల మేర వస్తుందని రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ వర్గాలు అంచనా వేశాయి. 

ఇన్నాళ్లూ ఒక ఏడాది ధర గిట్టుబాటు కాకపోయినా.. మరుసటి ఏడాదైనా అందుతుందన్న ఆశతో రైతులు పత్తి సాగును కొనసాగిస్తూ వస్తున్నారు. కానీ గత రెండు, మూడేళ్లుగా తెలంగాణ రైతులు పత్తికి బదులు ఇతర పంటల వైపు చూస్తున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి.

వరి దిగుబడి పెరగడంతో ఆనందం 
ఈ ఖరీఫ్‌లో వరి సాగు చేసిన రైతులకు వాతావరణం కూడా కలసి వచ్చి0ది. రాష్ట్రంలో సుమారు 66 లక్షల ఎకరాల్లో వరిసాగవగా.. అందులో 40 లక్షల ఎకరాల్లో సన్న రకాలు, 26 లక్షల ఎకరాల్లో దొడ్డు రకాలు వేశారు. వరి కోతకు వచ్చే వరకు అకాల వర్షాల బాధలేకపోవడం, గతంతో పోలిస్తే చీడ, పీడలు, తెగుళ్లు తక్కువగా ఉండటంతో ఈసారి వరి దిగుబడి భారీగా పెరిగింది. 

వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం వరి దిగుబడి 150 లక్షల మెట్రిక్‌ టన్నులకుపైనే. వరికి మద్దతు ధర రూ.2,320కాగా... నల్లగొండ, నిజామాబాద్‌ జిల్లాల్లో మేలు రకం సన్న ధాన్యాన్ని రూ.2,500 నుంచి రూ.3,000 ధరతో మిల్లర్లు, వ్యాపారులు కొనుగోలు చేశారు. దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా బియ్యానికి పెరిగిన డిమాండ్‌తో ధరలు పెరిగాయి. 

ఇక 70 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కనీస మద్ధతు ధరకు తీసుకుంటుండటం, గతంలో కన్నా దిగుబడి పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక కొనుగోలు కేంద్రాలకు వచ్చే సన్నధాన్యానికి ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్‌ ఇస్తామనడంపైనా హర్షం వ్యక్తమవుతోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement