Hyderabad: న్యూఇయర్‌ వేడుకలు.. లిక్కర్‌ టార్గెట్‌పై ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌ 

Omicron Effect On Liquor Sales In Hyderabad - Sakshi

‘కొత్త’ వేడుకల వేళ లక్ష్యాలపై ఆబ్కారీ శాఖ కసరత్తు

ఆంక్షలు ఉంటే అమ్మకాలు కష్టమేనంటున్న వ్యాపారులు

వేచి చూసే ధోరణిలో మద్యం దుకాణాల నిర్వాహకులు

సాక్షి, హైదరాబాద్‌: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం అమ్మకాలను పెంచేందుకు ఎక్సైజ్‌ శాఖ ఒకవైపు సన్నాహాలు చేస్తుండగా..  మరోవైపు ఒమిక్రాన్‌ వేరియంట్‌ భయపెడుతోంది. దీంతో  ఈసారి కూడా లిక్కర్‌ అమ్మకాలపై కోవిడ్‌ ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు మద్యం వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం తాజాగా కోవిడ్‌ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎక్కువ సంఖ్యలో జనం గుమిగూడకుండా ఆంక్షలు విధించింది. 

మాస్కులను తప్పనిసరి చేసింది. దీంతో ఈసారి బార్‌లు, రెస్టారెంట్‌లు, పబ్బుల్లో మద్యం వినియోగంపై ఆంక్షలు ఉండనున్నాయి. తాజాగా కొత్త సంవత్సరం జోష్‌ మొదలైంది. గతేడాది కోవిడ్‌ దృష్ట్యా వేడుకలకు దూరంగా ఉన్న యువత ఈసారి ఎలాగైనా ‘ఘనంగా మజా’ చేసుకునేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో ఒమిక్రాన్‌ వెంటాడుతోంది.  

గత ఏడాదీ అంతే... 
గతంలో కోవిడ్‌  ఆంక్షల  దృష్ట్యా చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. తక్కువ మోతాదులో ఇళ్ల వద్దనే వినియోగించేవారు. బార్లు తెరిచి ఉన్నప్పటికీ ధైర్యంగా వెళ్లేందుకు వెనుకడుగు వేశారు. ప్రస్తుతం చాలా వరకు సాధారణ పరిస్థితులు నెలకొనడంతో కొద్ది రోజులుగా వినియోగం పెరిగింది. రానున్న రోజుల్లో ఆంక్షల దృష్ట్యా అమ్మకాలు తగ్గవచ్చనే అంచనాతో వైన్స్‌ నిర్వాహకులు ఎక్కువ మొత్తంలో మద్యం నిల్వ చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు.

మరో రెండు మూడు రోజుల పాటు పరిణామాలను గమనించి కొత్త సంవత్సరం కోసం సరుకును తెప్పించే ఆలోచన ఉన్నట్లు ఓ వైన్‌ షాపు యజమాని తెలిపారు. మరోవైపు ఎక్సైజ్‌ అధికారులు మాత్రం ఈ ఏడాది టార్గెట్‌ను మరింత పెంచాలని  భావిస్తున్నారు. గత సంవత్సరం నూతన సంవత్సర వేడుకల సందర్భంగా  సుమారు రూ.300 కోట్ల మేర అమ్మకాలు జరిగినట్లు అంచనా. ఈసారి రూ.450 కోట్లకు పైగా మద్యం విక్రయాలపై టార్గెట్‌ను నిర్దేశించినట్లు సమాచారం.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top