
అందుకే కేంద్రం తెలంగాణను అనుసరిస్తోంది
‘ది హిందూ హడిల్’ చర్చాగోష్టిలో సీఎం రేవంత్‌రెడ్డి
మోదీది వాట్సాప్ యూనివర్సిటీ.. నాది స్కిల్స్ యూనివర్సిటీ
కులం ప్రభావం ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు.. అందుకే సామాజిక న్యాయంపై దృష్టి సారించి పనిచేస్తున్నా
అభివృద్ధి, సంక్షేమాలను మిళితం చేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నా
న్యూయార్క్, టోక్యో, దుబాయ్, సింగపూర్‌లతో పోటీ పడాలన్నదే నా లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: ‘దేశంలో ఇప్పటిదాకా గుజరాత్ మోడల్ గురించి చర్చ జరుగుతోంది. కానీ అది 2000 సంవత్సరం కంటే ముందున్న మోడల్. ప్రస్తుత తెలంగాణ మోడల్ 2025లో ఉన్న అప్ డేటెడ్ మోడల్. మోదీ మోడల్ వాట్సాప్ యూనివర్సిటీ అయితే, నాది స్కిల్స్ యూనివర్సిటీ. గుజరాత్‌లో ఉద్యోగాల్లేవు. నేను ఏడాదిలో 60 వేల ఉద్యోగాలిచ్చా. అక్కడ రైతుల రుణమాఫీ లేదు.. నేను రూ.21 వేల కోట్లు మాఫీ చేశా. గుజరాత్‌లో మద్దతు ధర లేదు. తెలంగాణలో మద్దతు ధరతో పాటు బోనస్ కూడా ఇస్తున్నాం. బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకం.
మేం రిజర్వేషన్ల పెంపును సమర్థిస్తాం. కేంద్ర ప్రభుత్వం, గుజరాత్ మోడల్‌లో మీడియాకు స్వేచ్ఛ లేదు. మా మోడల్‌లో ఈ స్వేచ్ఛ ఉంది. అందుకే మోదీ మోడల్ అవుట్ డేటెడ్. నాది అప్ టు డేట్ మోడల్. అందుకే తెలంగాణను కేంద్రం అనుసరిస్తోంది..’ అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం బెంగళూరు వేదికగా జాతీయ దినపత్రిక ది హిందూ నిర్వహించిన ‘ది హిందూ హడిల్’ చర్చాగోష్టిలో ఆయన హైదరాబాద్ నుంచి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ‘ముందుగా ఈ దేశాన్ని రక్షిస్తున్న భారత ఆర్మికి సెల్యూట్ చేస్తున్నా. సైనికులకు సంఘీభావం ప్రకటించే సమయం ఇది..’ అని సీఎం అన్నారు. అనంతరం పలు అంశాలపై తన అభిప్రాయాలను వెలిబుచ్చారు.
కులగణన భవిష్యత్ తరాలకు దారి చూపిస్తుంది
‘సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ పార్టీ పేటెంట్. దేశంలో లేదా ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా కులగణన చేపడతామని ప్రజలకు రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. ఆ మేరకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సర్వే చేపట్టింది. మేము చేసిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని చేపట్టింది. కులగణన చేయడం మినహా కేంద్రానికి మరో మార్గం లేదు. ఈ కులగణన భవిష్యత్ తరాలకు దారి చూపిస్తుంది. నాలుగు దశాబ్దాలుగా ఎస్సీల వర్గీకరణ కోసం పోరాటం జరుగుతోంది. ఎస్సీల్లో 59 కులాలున్నాయి.
వీటిలో కొన్ని కులాలు విద్య, ఉపాధి రంగాల్లో లబ్ధి పొందుతున్నాయి. కొన్ని వర్గాలకు న్యాయం జరగడం లేదు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శనం చేసింది. మేం వెంటనే రంగంలోకి దిగాం. కేబినెట్ సబ్ కమిటీ సిఫారసు మేరకు ఏకసభ్య కమిషన్ నియమించాం. ఈ కమిషన్ మూడు కేటగిరీల్లో ఎస్సీలను వర్గీకరించాలని చెప్పింది. ఆ సిఫారసుకు అనుగుణంగా ఎస్సీల వర్గీకరణను తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది..’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
విద్యార్థి దశలోనే కులం సమస్య గుర్తించా
‘గ్రామీణ ప్రాంతం నుంచి వచి్చన నాయకుడిగా సమాజంపై కులం ఎంత ప్రభావం చూపిస్తుందో నాకు బాగా తెలుసు. విద్యార్థి దశలో ఉన్నప్పటి నుంచే ఆ సామాజిక వర్గాలకు చెందిన వారితోనే కలిసి ఉండడం ద్వారా సమాజం వారిని విస్మరిస్తోందని, దూరంగా ఉంచుతోందని గుర్తించా. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా కులాల పేరుతో విభజించి చదివించడం మంచిది కాదు. అందుకే నా కేబినెట్ సహచరులకు, అధికారులకు చెప్పా.
అన్ని వర్గాల ప్రజలకు మంచి విద్యా సదుపాయాలు కల్పించాలని, మంచి వాతావరణంలో వారికి విద్యాబుద్ధులు నేర్పాలని. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాలకు చెందిన విద్యార్థులందరినీ కలిపి చదివించాలని వారు సూచించారు. అందులో భాగంగానే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. మొత్తంగా రూ.25 వేల కోట్ల పెట్టుబడి భవిష్యత్ కోసం పెడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి చర్యలను చేపట్టాలి..’ అని రేవంత్ అన్నారు.
రైతుల కోసం ఎన్నో చేస్తున్నాం..
‘సంక్షేమం విషయంలో తెలంగాణ దేశంలోనే మంచి మోడల్. అయితే సంక్షేమానికి సమాంతరంగా అభివృద్ధి జరగాలి. సంక్షేమం, అభివృద్ధి కలిసి ముందుకెళ్లాలి. నేను ఈ విధంగానే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నా. రుణమాఫీ, పెట్టుబడి సాయం, మద్దతు ధర కోసం రైతులు ఇప్పుడు కూడా పోరాడుతున్నారు. మేం తొలి ఏడాదిలోనే 25.30 లక్షల మంది రైతులకు రూ.20,617 కోట్ల రుణమాఫీ చేశాం. ప్రతి యేటా రూ.18 వేల కోట్ల పెట్టుబడి సాయం చేస్తున్నాం. 24 గంటల పాటు రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నాం. సోనియాగాంధీ నేతృత్వంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి తీసుకొచి్చన పథకమిది. ఈ పథకం కింద ఏడాదికి రూ.12 వేల కోట్లు వెచ్చిస్తున్నాం. ధాన్యానికి మద్దతు ధర, బోనస్ కలిపి క్వింటాల్‌కు రూ.2,800 ఇస్తున్నాం..’ అని సీఎం వెల్లడించారు.
నా పోటీ మన దేశ నగరాలతో కాదు..
‘స్వయం సహాయక సంఘాల (67 లక్షల మంది) మహిళలకు సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసే అవకాశం కల్పించాం. రాష్ట్రంలోని 10 వేల ఆర్టీసీ బస్సుల్లో వెయ్యి బస్సులు మహిళలకు కేటాయించాం. విద్యార్థులు డ్రెస్సులు కుట్టే కాంట్రాక్టు మహిళలకు ఇచ్చాం. యువకుల కోసం యంగ్ ఇండియా స్కిల్స్, స్పోర్ట్స్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నాం. దావోస్ వేదికగా రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చాం. రాష్ట్రంలో డ్రైపోర్టు, నెట్‌జీరో సిటీ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. దీనికి భారత్ ఫ్యూచర్ సిటీగా నామకరణం చేశాం. నా పోటీ బెంగళూరు, అమరావతి, ముంబై, ఢిల్లీలతో కాదు. న్యూయార్క్, టోక్యో, దుబాయ్, సింగపూర్‌లు నా లక్ష్యం..’ అని రేవంత్ పేర్కొన్నారు.
వన్ పర్సన్–వన్ పార్టీ విధానం అంగీకరించం
‘లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు మేం వ్యతిరేకం కాదు. అయితే ముందు అన్ని రాజకీయ పార్టీలను పిలిచి మాట్లాడి నిబంధనలు రూపొందించాలని అడుగుతున్నాం. జనాభా ప్రాతిపదికన ముందుకెళితే దక్షిణాది రాష్ట్రాలతో పాటు పంజాబ్ కూడా నష్టపోతుంది. మీరు నియోజకవర్గాలను ఎలా పెంచినా మాకు 33 శాతం సీట్లు ఇవ్వాలని అడుగుతున్నాం. లేనిపక్షంలో అది నియోజకవర్గాల పునర్విభజన కాదు. వన్ పర్సన్–వన్ పార్టీ విధానం ఇది. దీన్ని మేం అంగీకరించేది లేదు..’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. జాతీయ భద్రతా సలహాదారుడిగా పనిచేసిన ఎం.కె.నారాయణన్ చర్చాగోష్టిలో సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశంసించారు. ఉన్నది ఉన్నట్టు కుండబద్ధలు కొట్టి చెపుతున్నారంటూ అభినందించారు. ఈ కార్యక్రమానికి హిందూ తెలంగాణ పొలిటికల్ ఎడిటర్ ఆర్.రవికాంత్‌రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు.