ప్రాణరక్షక పరికరాలు లేకపోయినా ప్రైవేట్ బస్సుల పరుగులు
పర్మిట్ ఉల్లంఘనలపై నామమాత్రపు జరిమానాలు
సరుకు రవాణాకు పాల్పడుతూ పట్టుబడితే రూ.5000 మాత్రమే
భారీ జరిమానాలు లేకపోవడం వల్లనే యథేచ్ఛగా ఉల్లంఘన
గాలిలో దీపంగా మారిన ప్రయాణికుల భద్రత
సాక్షి, హైదరాబాద్: నామమాత్రపు జరిమానాలే ప్రైవేట్ బస్సులను యమదూతలుగా మార్చేస్తున్నాయి. పరిమితికి మించిన బరువుతో బస్సులు నడిపినా, అదనపు సీట్లు ఏర్పాటు చేసినా, చివరకు అగ్నిమాపక పరికరాలు లేకపోయినా సరే రవాణా అధికారులు గరిష్టంగా రూ.5000 వరకు జరిమానా విధిస్తారు. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్ల కానీ, ఇతర కారణాల వల్ల కానీ బస్సులో మంటలు అంటుకుంటే వెంటనే వాటిని పసిగట్టి, నివారించేందుకు అవసరమైన ఫైర్ డిటెక్షన్ అండ్ సప్రెషన్ పరికరాలు బస్సుల్లో లేకుండా పట్టుబడితే రవాణా అధికారులు కేవలం రూ.2000 పెనాల్టీ విధిస్తున్నారు.
దీంతో క్షణాల్లో పెనాల్టీలు చెల్లించి బస్సులను రోడ్డెక్కిస్తున్నారు. తిరిగి యథావిధిగా నిబంధనల ఉల్లంఘన కొనసాగుతూనే ఉంది. మోటారు వాహనచట్టంలో బలమైన నిబంధనలు లేకపోవడమే ఇందుకు కారణం. రవాణా అధికారులు విధించే నామమాత్రపు పెనాల్టీ లను ఆపరేటర్లు పెద్దగా పట్టించుకోవడం లేదు. పైగా ఒక్కో ఆర్టీఏ అధికారి ఒక్కో విధంగా ఈ పెనాల్టీలను విధిస్తున్నారు. దీంతో ప్రయాణికుల భద్రతకు సంబంధించిన కీలకమైన నిబంధనలు కూడా బేఖాతరవుతున్నాయి.
ప్రాణ నష్టం తగ్గేది..
కర్నూలు బస్సు ప్రమాదం ఘటనలో కొద్ది క్షణాల్లో మంటలు అంటుకొని బస్సు పూర్తిగా కాలిపోయింది. కానీ ఆ సమయంలో బస్సులోని అగ్నిమాపక పరికరాలు పనిచేసి ఉంటే ప్రాణనష్టం చాలా వరకు తగ్గేది. 2013లో జరిగిన పాలెం బస్సు దగ్ధం సమయంలోనే ఈ కీలకమైన అగి్నమాపక పరికరాలు లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. అప్పటి నుంచి ప్రతి బస్సులో వీటిని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలనే నిబంధన విధించినప్పటికీ అమలుకు నోచడం లేదు.
ఎమర్జెన్సీ మార్గాల్లో అదనపు సీట్లు...
ప్రమాదం వాటిల్లినప్పుడు అత్యవసర ద్వారం అద్దాలను పగులగొట్టి బయటకు వెళ్లేందుకు అవకాశం ఉండాలి. కానీ లాభార్జనే ధ్యేయంగా నడిచే ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణికుల డిమాండ్ మేరకు అదనపు సీట్లను ఏర్పాటు చేస్తున్నారు. చివరకు ఎమర్జెన్సీడోర్‌ల వద్ద కూడా ఈ అదనపు సీట్లను వేయడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో తప్పించుకొనేందుకు అవకాశం ఉండడం లేదు. మరోవైపు బస్సు అద్దాలను పగులగొట్టే హ్యామర్లు కూడా ప్రయాణికులకు అందుబాటులో ఉండవు. కర్నూలు ఉదంతం తరువాత ఆర్టీఏ అధికారులు గత నాలుగు రోజులుగా ప్రైవేట్ బస్సులపై దాడులను కొనసాగిస్తున్నారు. అధికారుల తనిఖీల్లో నిబంధనలను ఉల్లంఘిస్తూ పట్టుబడిన వాటిలో చాలా వరకు అలా అగ్నిమాపక పరికరాలు లేకుండా, హ్యామర్లు లేకుండా, అత్యవసర ద్వారాలను మూసివేస్తూ పట్టుబడిన బస్సులే ఎక్కువగా ఉండడం గమనార్హం. కొన్ని బస్సులు మాత్రం పరి్మట్లను ఉల్లంఘించి, సకాలంలో త్రైమాసిక పన్నులు చెల్లించకుండా పట్టుబడుతున్నాయి. ఏ రకమైన నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినప్పటికీ గరిష్టంగా రూ.5000 కంటే ఎక్కువ పెనాల్టీలు విధించేందుకు అవకాశం లేదు.
ఏకీకృతమైన విధానం లేదు...
రవాణా అధికారులు విధించే ఈ పెనాల్టీల్లోనూ ఏకీకృతమైన విధానం లేదు, ఒకేరకమైన ఉల్లంఘనపై ఏ ఇద్దరు అధికారులు విధించే జరిమానాలు ఒకే విధంగా ఉండకపోవడం గమనార్హం. అగ్నిమాపక పరికరాలు లేకుండా పట్టుబడినప్పుడు ఒక అధికారి రూ.2000 జరిమానా వేస్తే మరో అధికారి కేవలం రూ.1000 ఫైన్ విధిస్తారు. ఇలా కాంట్రాక్ట్ క్యారేజీ బస్సుల తనిఖీలపైన రవాణా అధికారులు అనుసరించే లోపభూయిష్టమైన విధానాలు కూడా ప్రయాణికుల పాలిట మృత్యుపాశాలుగా మారుతున్నాయి. ఒకవైపు భారీ జరిమానాలు విధించే అవకాశం లేకపోవడమే ఒక ప్రధాన లోపమైతే, మరోవైపు ఏకీకృతమైన విధానమంటూ లేకపోవడం కూడా సవాల్‌గా మారింది. అదనపు సీట్లు ఏర్పాటు చేయడం, ప్రయాణికుల జాబితా లేకపోవడం, సరుకు రవాణాకు పాల్పడడం వంటి ఉల్లంఘనలపైన పట్టుబడిన ప్రైవేట్ బస్సులను రవాణా అధికారులు గతంలో న్యాయస్థానాల ఎదుట హాజరుపరిచేందుకు అవకాశం ఉండేది. కానీ ప్రయాణికుల రవాణా సదుపాయాన్ని దృష్టిలో ఉంచుకొని న్యాయస్థానాల ఆదేశాల మేరకు దీన్ని మినహాయించారు. దీంతో కేవలం ఇప్పుడు జరిమానాల విధింపు వరకు అధికారులు పరిమితమయ్యారు.
కొనసాగుతున్న దాడులు
కర్నూలు దుర్ఘటన అనంతరం ఆర్టీఏ అధికారులు దాడులను ఉధృతం చేశారు. ఈ నెల 25వ తేదీ నుంచి 28వ తేదీ మంగళవారం వరకు గ్రేటర్ హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ప్రైవేట్ బస్సుల్లో తనిఖీలు చేసి 192 కేసులు నమోదు చేసినట్లు హైదరాబాద్ జేటీసీ రమేష్ తెలిపారు. అగ్నిమాపక పరికరాలు లేకపోవడం, సరుకు రవాణాకు పాల్పడడం, ఎలక్ట్రిక్ పరికరాలు, ఇతర అదనపు హంగులను ఏర్పాటు చేయడం వంటి వివిధ రకాల ఉల్లంఘనలపైన ఈ కేసులను నమోదు చేశారు.ఈ నాలుగు రోజుల్లో రూ.4,55,000 జరిమానాలు విధించారు.8 బస్సులను జఫ్తు చేశారు. మంగళవారం ఒక్క రోజే నగరంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో 49 కేసులు నమోదు చేసి, రూ.లక్షా 49 వేల పెనాల్టీలు విధించినట్లు జేటీసీ చెప్పారు. దాడులను మరింత ఉధృతం చేయనున్నట్లు పేర్కొన్నారు.


