కొలెస్ట్రాల్‌ నియంత్రణకు కొత్త మార్గం

New Way To Control Cholesterol CCMB Have Identified New Target - Sakshi

సీసీఎంబీ పరిశోధనల ఫలితం

సాక్షి, హైదరాబాద్‌: శరీంలోని కొలెస్ట్రాల్‌ను నియంత్రించేందుకు సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు కొత్త లక్ష్యాన్ని గుర్తించారు. కణత్వచంపై సెరటోనిన్‌ రిసెప్టార్‌–1ఏ.. కొలెస్ట్రాల్‌ను గుర్తించగలదని సీసీఎంబీ సీనియర్‌ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ అమితబ ఛటోపాధ్యాయ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. సెరటోనిన్‌ రిసెప్టార్లు కణత్వచంలో ఉండే కొలెస్ట్రాల్‌కు సున్నితంగా ఉంటాయని ఆయన గతంలోనే గుర్తించారు. కణాల మధ్య సమాచారం ఇచ్చి పుచ్చుకునేందుకు రిసెప్టార్‌ ప్రోటీన్లు కీలకం కాగా.. చాలా మందులు ఈ రిసెప్టార్‌ ప్రొటీన్లనే లక్ష్యంగా చేసుకుని తయారుచేస్తుంటారు.

సెరటోనిన్‌ రిసెప్టార్‌ ప్రొటీన్‌లోని సీఆర్‌ఏసీ నిర్మాణాలపై తాము దృష్టి పెట్టామని, నిర్దిష్ట అమైనో యాసిడ్స్‌ను మార్చి చూడగా, ఒక అమైనోయాసిడ్‌ కొలెస్ట్రాల్‌ నియంత్రణకు ఉపయోగపడుతున్నట్లు తెలిసిందని ఆయన తెలిపారు. స్పెయిన్‌లోని పాంపియూ ఫాబ్ర యూనివర్సిటీ హాస్పిటల్‌ సాయంతో ప్రొటీన్, కొలెస్ట్రాల్‌ మధ్య జరిగే చర్యలను పరిశీలించామని, తద్వారా తాము గుర్తించిన అమైనో యాసిడ్‌.. ఎలా కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుందో తెలిసిందని చెప్పారు. వయసుతో పాటు కొలెస్ట్రాల్‌ మోతాదుల్లో తేడాలు వస్తాయని, ఈ రిసెప్టార్‌ ఆధారంగా కొత్తగా మందులు తయారుచేస్తే మరింత మెరుగ్గా కొలెస్ట్రాల్‌ను నియంత్రించొచ్చని తాము భావిస్తున్నట్లు వివరించారు. స్ట్రక్చరల్‌ బయాలజీలో సీసీఎంబీకి ఉన్న నైపుణ్యం ఈ కొత్త ఆవిష్కరణకు వీలు కలిగించిందని సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ నందికూరి వినయ్‌ తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top