కోవిడ్‌ ఇలాగే ఉంటే ఆన్‌లైన్‌ రిపోర్టింగ్‌

National Educational Institutions Will Be Preferred Online Reporting - Sakshi

నవంబర్‌ 9 నుంచి 13 వరకు ఐఐటీ, ఎన్‌ఐటీల్లో రిపోర్టింగ్‌ 

6 నుంచి జోసా కౌన్సెలింగ్‌ ప్రారంభం  

సాక్షి, హైదరాబాద్‌: కరోనా పరిస్థితులు ఇప్ప టిలాగే ఉంటే ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ తదితర జాతీయస్థాయి విద్యా సంస్థల్లో ఆన్‌లైన్‌ రిపోర్టింగ్‌ విధానం అమలు చేయాలని జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ(జోసా) నిర్ణయించింది. ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీ య స్థాయి విద్యాసంస్థల్లో (జీఎఫ్‌టీఐ) ప్రవేశాల కోసం ఈనెల 6 నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రారంభం కానుంది. 5న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదల కాగానే 6 నుంచి ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్‌ను జోసా నిర్వహించనుంది. మొదటిదశ కౌన్సెలింగ్‌లో భాగంగా రిజిస్ట్రేషన్లతోపాటు, వెబ్‌ ఆప్షన్లు, మాక్‌సీట్‌ అలకేషన్‌ ప్రక్రియను అక్టోబర్‌ 15 వరకు నిర్వహించనుంది. 17న మొదటి దశ సీట్ల కేటాయింపును ప్రకటించనుంది.

ఇక 17 నుంచి 19వ తేదీ వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌ లో ఫీజు చెల్లింపు, డాక్యుమెంట్లు అప్‌లోడ్, రిపోర్టింగ్‌ ప్రక్రియను చేపట్టనుంది. ఖాళీ సీట్లను బట్టి రెండో దశ సీట్ల కేటాయింపును 21న ప్రకటించనుంది. రెండోదశ సీట్ల కేటాయింపు తరువాతే 22 నుంచి 24 వరకు విత్‌డ్రాయల్‌కు అవకాశం ఉంటుంది. 26న మూ డో దశ కేటాయింపు, 30న నాలుగో దశ కేటాయింపు, నవంబర్‌ 3న ఐదో దశ సీట్ల కేటాయింపును ప్రకటించనుంది. ఐదో దశ వరకే సీట్ల విత్‌డ్రాయల్‌కు అవకాశం ఉంటుంది. నవంబర్‌ 7న ఆరో దశ సీట్లను కేటాయించి, ఫిజికల్‌గా కాలేజీల్లో చేరేందుకు నవంబర్‌ 9 నుంచి 13 వరకు అవకాశం కల్పించింది.  కరోనా పరిస్థితులు ఇలాగే ఉంటే ప్రత్యక్షంగా వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లో రిపోర్టు చేసేలా చర్యలు చేపట్టింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top