Munugodu: అన్నీ పార్టీల నేతలంతా ఇక్కడే.. దూసుకుపోతున్న రాజగోపాల్‌రెడ్డి

Munugode Bypoll: All Main Party Leaders At One Place - Sakshi

సాక్షి, నల్లగొండ: ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్‌ఎస్, బీజేపీలు మునుగోడులో మకాం వేశాయి. ఆయా పార్టీల నాయకులు స్థానికంగా ఉన్న నివాస గృహాలను అద్దెకు తీసుకొని అక్కడి నుంచే నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి బీజీపీ బహిరంగ సభకు ముందే స్థా«నికంగా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచే కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ఇటీవల ఓ ఇంటిని అద్దెకు తీసుకొని కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పార్టీ కార్యాలయం ప్రత్యేకంగా ఉన్నా.. దీనిని అదనంగా తీసుకున్నారు. మంత్రి జగదీష్‌రెడ్డి నియోజకవర్గంలో నిత్యం పర్యటిస్తూ చేరికలను వేగంగా కొనసాగిస్తున్నారు. 

పెరుగుతున్న ఉప ఎన్నికల వేడి
మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికల వేడి పెరుగుతోంది. ఈ ఉప ఎన్నిక ప్రధాన పార్టీలకు సవాలుగా మారింది. అమిత్‌షా సభ జరిగిన మరుసటి రోజు నుంచే రాజగోపాల్‌రెడ్డి రోజుకో మండలంలో తిరుగుతూ బీజేపీలోకి చేరికల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మండలాల వారీగా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డే కావడంతో ఆయనే స్వయంగా పర్యవేక్షణ చేస్తూ విస్తృతంగా పర్యటిస్తున్నారు.

టీఆర్‌ఎస్‌ పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించకపోవడంతో మంత్రి జగదీష్‌రెడ్డి అన్నీ తానై నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని వెంట పెట్టుకొని సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేటాయించిన మండలాల్లోని గ్రామాల్లో రెండు రోజులకు ఒకసారి సమావేశాలు జరిగేలా చూస్తున్నారు. ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని దిశా నిర్దేశం చేస్తున్నారు. 

పోటాపోటీగా సమావేశాలు..
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మంత్రి జగదీష్‌రెడ్డి పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం రాజగోపాల్‌రెడ్డి మునుగోడులో సమావేశం నిర్వహించారు. దీనికి స్థానిక నేతలు భారీ ఎత్తున హాజరయ్యారు. ఆయన నేతృత్వంలో పెద్ద ఎత్తున చేరికలు కొనసాగాయి. దీంతో అధికార పార్టీ అప్రమత్తమైంది. ఆగమేఘాల మీద మునుగోడులోనే శనివారం సాయంత్రం స్థానిక నేతలు, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసింది.

ఇందులో మంత్రి జగదీష్‌రెడ్డి గ్రామాల వారీగా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ఏ గ్రామంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు.. మహిళలు, పురుషులు ఎంత మంది? అందులో కులాల వారీ ఓట్లు ఎన్ని.. ఎక్కువ ఓట్లు  ఏ గ్రామంలో ఏ కులం వారికి ఉన్నాయి.. వాటిల్లో టీఆర్‌ఎస్‌కు ఎన్ని ఓట్లు వస్తాయి.. మిగతా ఓట్లు టీఆర్‌ఎస్‌కు రావాలంటే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్న అంశాలపై సమీక్షించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top