సినిమా షూటింగ్‌ స్పాట్లు.. సింగరేణి ఓసీపీలు

Movie Shooting Locations In Karimnagar District - Sakshi

పర్యాటక ప్రాంతాలకు ఉమ్మడి కరీంనగర్‌ పుట్టినిల్లు

ఆహ్లాదకర వాతావరణంలో సేదతీరుతున్న సందర్శకులు

జోరుగా సినిమాలు, షార్ట్‌ ఫిలింల చిత్రీకరణ

3 కిలోమీటర్ల లక్ష్మీదేవిపల్లి–సారంగాపూర్‌ అడవి

టూరిజం స్పాట్లుగా అభివృద్ధి చేస్తే మేలు

సారంగాపూర్‌(జగిత్యాల): జగిత్యాల జిల్లా సారంగాపూర్‌ అటవీప్రాంతాన్ని టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేసేందుకు అటవీశాఖ చర్యలు ప్రారంభించింది. జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ప్రారంభమైన దట్టమైన అడవి మూడు కిలోమీటర్ల పొడవునా లక్ష్మీదేవిపల్లి– సారంగాపూర్‌ గ్రామాల మధ్య ఆహ్లాదం పంచుతుతోంది. కరోనా సమయం నుంచి ఎక్కువ సంఖ్యలో సందర్శకులు రావడంతో ఈ ప్రాంతమంతా సందడిగా ఉంటోంది. చుట్టూ టేకు, ఇతర వృక్ష జాతులు, వన్యప్రాణులు, సమీపంలో బతుకమ్మ కుంట, దాని ఎగువన అటవీశాఖ నూతనంగా నిర్మిస్తున్న మరో కుంటతో ఇక్కడి వాతావరణం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

అటవీశాఖ ఆలోచన ఇదీ...
ఇటీవల సారంగాపూర్‌ అటవీ, బతుకమ్మ కుంట ప్రాంతాలను చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ అక్బర్‌ జిల్లా అటవీశాఖ అధికారి వెంకటేశ్వర్‌రావుతో కలిసి సందర్శించారు. నిత్యం వందల సంఖ్యలో పర్యాటకులు సారంగాపూర్‌ అడవిని వీక్షించడానికి వస్తుండటంతో అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, అందుకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో బతుకమ్మ కుంట వద్ద అటవీ భూమిలో వివిధ రకాల పూలు, నీడనిచ్చే మొక్కలు, చిన్న పిల్లలు ఆడుకోడానికి క్రీడాపరికరాలు, కుంటలో పక్షులు సేదతీరడానికి, అవి నివాసం ఉండేలా కృత్రిమ ఆవాసాలు, వన్యప్రాణులు తాగడానికి అవసరమైన నీరు, సందర్శకుల కోసం వెదరుతో పందిళ్లు వేయడం వంటి పనులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెట్ల ప్రాధాన్యతను వివరించడానికి బోర్డులు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. 

నామమాత్రపు రుసుముకు పంచాయతీ తీర్మానం..
అటవీ ప్రాంతాన్ని వీక్షించేందుకు వస్తున్న పర్యాటకులు తిని, తాగి పడేస్తున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలు పర్యావరణానికి ముప్పుగా మారుతున్నాయని సారంగాపూర్‌ పంచాయతీ పాలకవర్గం గుర్తించింది.  వీటికితోడు సినిమా షూటింగ్‌లు నిర్వహిస్తున్నప్పుడు ఎఫెక్ట్‌ కోసం అడవిలో పొగను వదులుతున్నారు. దీనివల్ల మంటలు వ్యాపించకుండా ఉండేందుకు వారికి ముందే సూచనలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇద్దరు వాచ్‌మెన్‌లను నియమించి, వారికి సందర్శకుల నుంచి కొంత రుసుము వసూలు చేసి జీతం ఇవ్వాలని తీర్మానించారు. సంబంధిత కాపీని త్వరలో అటవీశాఖకు అందించాలని నిర్ణయించారు. 

పెద్దపల్లిలో షార్ట్‌ఫిలింల చిత్రీకరణ
పెద్దపల్లి‌: ఇంటర్నెట్, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వా త బుల్లితెరపై నటించడం, షార్ట్‌ఫిలింల నిర్మాణంపై యువతలో ఆసక్తి పెరిగింది. సమాజానికి ఏదో ఓ సందేశాన్ని ఇవ్వాలన్న ఆలోచనతో ముందుకొస్తున్న వారంతా వీటిపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఇంకొందరు తమ అభిరుచులకు అనుగుణంగా జానపద గేయాలను చిత్రీకరించే పనిలో ఉంటున్నారు. ఇవి కాకుండా పెద్దపల్లి జిల్లాలో ఉన్న పరిస్థితులను బట్టి నారాయణమూర్తి లాంటి దర్శకులు సినిమాలు కూడా చిత్రీకరించారు. 

సబ్బితం జలపాతం...
పెద్దపల్లి మండల కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సబ్బితం శివారు గుట్ట ప్రాంతంలోని జలపాతం షార్ట్‌ఫిలింల నిర్మాణానికి అడ్డాగా మారింది. ఈ ప్రాంతానికి చెందిన పలువురు యువకులు పలు సందేశాత్మక షార్ట్‌ఫిలింలను నిర్మించారు.

ఆండాలమ్మ ఆలయం...
ముత్తారంలో జైనుల కాలంలో నిర్మించిన ఆండాలమ్మ ఆలయం షూటింగ్‌లకు కేంద్రంగా మారుతోంది. అతి ప్రాచీనమైన ఈ కట్టడ పరిసరాల్లో సర్పంచ్‌ కుమారస్వామి పల్లె ప్రకృతి వనాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. కట్టడంపై కళాకారులు చెక్కి న బొమ్మలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఈ ప్రాంతంలో తీసిన చిత్రాలు ఆకట్టుకునేలా ఉంటుండటంతో నిర్మాతలు చిత్రీకరణకు ముందుకొస్తున్నారు.

శ్రీరాముడు నడయాడిన ‘రామునిగుండాల’..
గోదావరిఖని(రామగుండం): రామునిగుండాలకు చారిత్రక నేపథ్యం ఉంది. శ్రీరా ముడు నడయాడిన నేలగా ఈ ప్రాంతం ప్రసిద్ధి. పకృతి రమణీయతకు అద్దం పట్టే చెట్లు, ఎత్తైన కొండలు, జాలువారే నీరు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఆధ్యాత్మిక ప్రాంతం కావడంతో సినిమా షూటింగ్‌లకు కూడా అనుకూలంగా మారింది. ఇక్కడ నిర్భయ భారతం, పోరు తెలంగాణ, దండకారణ్యం, పీపుల్స్‌వార్‌ తదితర సినిమాల చిత్రీకరణ జరిగింది.

ప్రత్యేక ఆకర్షణగా సింగరేణి ఓసీపీలు...
గోదావరిఖని సింగరేణి ఓసీపీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇవి సినిమా షూటింగ్‌లకు అనువుగా మారాయి.  దీంతో 2006లో రాణా హీరోగా నటించిన లీడర్‌ సినిమా షూటింగ్‌ ఓసీపీ–3లో రెండు రో జులపాటు కొనసాగింది. అలాగే ఓసీపీ–2 క్వారీలో గత 10 రోజులుగా ప్రభాస్‌ హీరోగా సలార్‌ చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. 

జనగామలో ‘తుపాకి రాముడు’...
బిత్తిరి సత్తి హీరోగా నటించిన తుపాకి రాము డు చిత్రం చిత్రీకరణ మొత్తం జనగామలో సాగింది. గోదావరిఖనికి సమీపంలో ఉన్న ఈ గ్రామం పల్లెటూరికి అద్దం పట్టేలా ఉండటం, కళాకారులు ఎక్కువగా ఇక్కడే ఉండటంతో సినిమా షూటింగ్‌ జరిపారు. 

పచ్చదనానికి మారుపేరు ఎన్టీపీసీ..
విశాలమైన రోడ్లు, వాటికి ఇరువైలా భారీ చెట్లతో పచ్చదనానికి మారుపేరుగా నిలు స్తోంది రామగుండం ఎన్టీపీసీ.  ఇక్కడ నిర్భయ భారతం, దండకారణ్యం, లీడర్‌ సినిమాలకు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించారు.

మరో కోనసీమ ‘గోదావరి తీరం’..
సీఎం కేసీఆర్‌ కలల ప్రాజెక్టు కాళేశ్వరం ఏర్పాటుతో గోదావరి నది నిండుకుండలా మారి తీర ప్రాంతమంతా మరో కోనసీమను తలపిస్తోంది. అలాగే గోదావరిఖని సమీపంలోని గోదావరి నదిపై రెండు బ్రిడ్జిలు నిర్మించడం, సమీపంలోనే పుష్కర ఘాట్, దగ్గరలోనే సమ్మక్క–సారలమ్మ గద్దెలు ఉండటం వల్ల సినిమా షూటింగ్‌లకు అనుకూలంగా మారింది. ఈ ప్రాంతంలో ఇటీవల సంపూర్ణేష్‌బాబు చిత్రం షూటింగ్‌ జరిపారు.

‘కృష్ణలంక’ సన్నివేశం చిత్రీకరణ..
సారంగాపూర్‌: బీర్‌పూర్‌ మండల కేంద్రంలోని కొండపై వెలసిన శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ ప్రాంగణంలో శనివారం కృష్ణలంక అనే సినిమాకు సంబంధించిన హోమ సన్నివేశం చిత్రీకరించారు. కార్తికేయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నలుగురు హీరోలతోపాటు, కన్నడ నటి అనితాభట్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రముఖ మాటల రచయిత పరుచూరి వెంకటేశ్వర్‌రావు కుమారుడు రవీందర్‌ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. షూటింగ్‌ను ప్రారంభించేందుకు ముందు ఆలయంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు ప్రత్యేక పూజలు చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top