టాప్‌..  నిజామాబాద్‌ ఆఖరున ఆదిలాబాద్

Monsoon Paddy Procurement In Telangana - Sakshi

దాదాపుగా ముగిసిన వానాకాలం ధాన్యం సేకరణ

లక్ష్యం 1.12 కోట్ల మెట్రిక్‌ టన్నులు... ఇప్పటివరకు సేకరించింది 63.20 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం  

నిజామాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 5.85 ఎల్‌ఎంటీ సేకరణ 

రాష్ట్రంలో భారీ ఎత్తున ప్రైవేటు వ్యాపారులకు తరలిన ధాన్యం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వానాకాలం ధాన్యం సేకరణ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఈ సీజన్‌లో 1.12 కోట్ల మెట్రిక్‌ టన్నుల సేకరణ లక్ష్యం కాగా, ఇప్పటివరకు 63.20 లక్షల మెట్రిక్‌ టన్నుల (ఎల్‌ఎంటీ) ధాన్యాన్ని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. బహిరంగ మార్కెట్‌లో డిమాండ్‌ కారణంగా.. దాదాపు 65 లక్షల టన్నులకు మించి సేకరణ జరిగే అవకాశం కనిపించడం లేదు.

ముప్పావువంతుకుపైగా జిల్లాల్లో ధాన్యం సేకరణ పూర్తయింది. రాష్ట్రంలో నిజామాబాద్‌ జిల్లాలో అత్యధికంగా ధాన్యాన్ని సేకరించగా, అతితక్కువ సేకరణలో ఆదిలాబాద్‌ నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా 7,015 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, 6,100 కేంద్రాలను ఇప్పటికే మూసివేశారు. వరంగల్, మహబూబ్‌నగర్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో ఈనెల 20 వరకు కొంత మేర ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉంది. 

రెండు, మూడు స్థానాల్లో కామారెడ్డి, నల్లగొండ 
రాష్ట్రంలోని 32 జిల్లాల్లో ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయగా, అత్యధికంగా నిజామాబాద్‌ జిల్లాలో ఇప్పటివరకు రూ.1,204.36 కోట్ల విలువైన 5,85,661 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశారు. మూడేళ్లుగా పౌరసరఫరాల సంస్థ నిజామాబాద్‌లోనే అత్యధికంగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తోంది. ఆ తరువాత స్థానాల్లో 4,75,082 మెట్రిక్‌ టన్నుల కొనుగోళ్లతో రెండోస్థానంలో కామారెడ్డి జిల్లా ఉండగా, 4,11,827 మెట్రిక్‌ టన్నులతో మూడోస్థానంలో నల్లగొండ జిల్లా ఉంది. 2,198 మెట్రిక్‌ టన్నులతో ఆఖరున ఆదిలాబాద్‌ జిల్లా నిలిచింది. ఈ జిల్లాలో వరిసాగు అతితక్కువగా ఉండడమే అందుకు కారణం. 

ప్రైవేటు వ్యాపారులకు ధాన్యం 
రాష్ట్రంలో ధాన్యం సేకరణకు పట్టాదారు పాస్‌పుస్తకంతోపాటు ఆధార్, ఫోన్‌ నంబర్‌ అనుసంధానం చేయడంతో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ఆలస్యమైంది. ఈ పరిస్థితుల్లో చాలా జిల్లాల్లో రైతులు ధాన్యాన్ని ప్రైవేటు మిల్లర్లకు, వ్యాపారులకు విక్రయించుకున్నారు. నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, జగిత్యాల, పెద్దపల్లి, నారాయణపేట వంటి జిల్లాల్లో నాణ్యమైన సన్న ధాన్యాన్ని మిల్లర్లు కల్లాల మీదే కొనుగోలు చేసి, బియ్యంగా మరపట్టించి విక్రయించారు.

అగ్గువకో, సగ్గువకో తక్షణమే నగదు వస్తుండటంతో రైతులు కూడా ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులకు భారీ ఎత్తున విక్రయించారు. దీంతో కొనుగోలు కేంద్రాలకు రావలసిన ధాన్యం తగ్గింది. 30 లక్షల టన్నులకు పైగా ధాన్యం ప్రైవేటు వ్యాపారుల ద్వారా బహిరంగ మార్కెట్‌కు తరలినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు రూ.13 వేల కోట్లకు పైగా విలువైన ధాన్యాన్ని సేకరించగా, రూ.12,430 కోట్లను రైతుల ఖాతాల్లో జమచేసినట్లు ఓ అధికారి తెలిపారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top