మంత్రిగా నిజాం కళాశాల
పూర్వ విద్యార్థి మహమ్మద్ అజహరుద్దీన్ ప్రమాణస్వీకారం
హైదరాబాద్: దేశంలోనే పేరొందిన కళాశాలలో నిజాం కళాశాల ఒకటి. ఇందులో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో అత్యుత్తమ స్థాయిలో తమ సేవలను అందిస్తున్నారు. రాష్ట్ర మంత్రిగా భారత క్రికెట్ జట్టు మాజీ కెఫ్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయడం పట్ల నిజాం కళాశాల పూర్వ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. నిజాం కళాశాలలో విద్యనభ్యసించిన వ్యక్తి నేడు రాష్ట్ర మంత్రి స్థాయికి ఎదగడం గర్వంగా ఉందని కళాశాల బోధనా సిబ్బంది పేర్కొన్నారు. నిజాం కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఏవీ రాజశేఖర్ మాట్లాడుతూ అజహరుద్దీన్ ప్రజలకు మంచి సేవలు అందించి కళాశాల ప్రఖ్యాతలను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు.
ఎందరో ప్రముఖులు..
130 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన నిజాం కళాశాలలో ఎంతోమంది విద్యార్థులు విద్యనభ్యసించారు. ఇక్కడ విద్య అభ్యసించిన విద్యార్థులు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అనేకమంది వివిధ హోదాలలో పనిచేశారు. ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేయగా, మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, కేటీఆర్‌లు మంత్రులుగా పనిచేశారు. అదేవిధంగా నాదెండ్ల మనోహర్, ప్రొఫెసర్ కోదండరాం, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, నటుడు బాలకృష్ణలతో పాటు మరెందరో ప్రముఖులు చట్టసభల్లో తమ గొంతును వినిపించారు. అంతే కాకుండా అంతరిక్ష యాత్రికుడు రాకేష్ శర్మ, ఐపీఎస్ అధికారులు సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర సైతం ఇదే కళాశాల విద్యార్థులు కావడం గమనార్హం.


