‘నైరుతి’ ఉపసంహరణ షురూ | Moderate rains in the state for 3 days due to the influence of low pressure and trough | Sakshi
Sakshi News home page

‘నైరుతి’ ఉపసంహరణ షురూ

Sep 15 2025 4:47 AM | Updated on Sep 15 2025 4:47 AM

Moderate rains in the state for 3 days due to the influence of low pressure and trough

3 రోజుల ముందే మొదలైన ప్రక్రియ.. అక్టోబర్‌ రెండో వారాంతానికి పూర్తి 

ఈ సమయంలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం: ఐఎండీ 

అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులపాటు మోస్తరు వర్షాలు

సాక్షి, హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాల ఉపసంహరణ మొదలైంది. సాధారణంగా సెప్టెంబర్ మూడో వారం చివరలో మొదలవ్వాల్సిన ఈ ప్రక్రియకు ఈసారి సానుకూల వాతావరణ పరిస్థితులు ఉండటంతో ముందే ప్రారంభమైందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. రానున్న రెండు రోజుల్లో రాజస్తాన్, పంజాబ్, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు క్రమంగా నిష్క్రమిస్తూ అక్టోబర్‌ రెండో వారాంతానికి దేశం నుంచి పూర్తిస్థాయిలో నిష్క్రమిస్తాయని వివరించింది. 

ఈ సమయంలోనూ చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు గతేడాది కంటే మూడు రోజుల ముందే.. మే 23న కేరళను తాకాయి. ఆ తర్వాత మూడు రోజుల్లో రాష్ట్రంలోకి ప్రవేశించాయి. జూలై రెండో వారం నాటికి దేశమంతా విస్తరించాయి. నైరుతి రుతుపవనాల సీజన్‌లో రాష్ట్రంలో సగటున 74.06 సెం.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటికే 83.02 సెం.మీ. మేర వర్షం కురిసింది. ఇది సాధారణ వర్షపాతంకన్నా 12 శాతం అధికం. 

మూడు రోజులపాటు మోస్తరు వర్షాలు 
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదిలి ఉత్తర తెలంగాణ, విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వివరించింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దీని ప్రభావంతో పలుచోట్ల తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement