మమ్మల్నీ పాస్‌ చేయండి..!

Medical students like MBBS and BDS want to pass or reduce the percentage of marks - Sakshi

ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్‌ విద్యార్థుల మొర 

ఆన్‌లైన్‌తో నష్టపోతున్నామని ఆవేదన 

ఆ విధానంపై త్వరలో కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ నిర్ణయం  

ఈ ఏడాది 71% ఉత్తీర్ణత 

సాక్షి, హైదరాబాద్‌: ఇతర అన్ని తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే ప్రమోట్‌ చేసినట్లు తమనూ పాస్‌ చేయాలని లేదా మార్కుల శాతాన్నైనా తగ్గించాలని ఎంబీబీఎస్, బీడీఎస్‌ వంటి వైద్య విద్యార్థులు కోరుతున్నారు. కరోనాతో ఆన్‌లైన్‌ క్లాసుల వల్ల చాలావరకు నష్టపోయామని, పరీక్షల్లో ఫెయిలయ్యామని మొదటి ఏడాది పరీక్షలు రాసినవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన క్లాసులవారి పరిస్థితీ అంతే.  ఈ విషయాన్ని కాళోజీ నారాయణరావు హెల్త్‌ వర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఫస్టియర్‌ పరీక్షల్లో 71 శాతం మంది పాసవగా, మిగిలినవారు ఏదో ఒక సబ్జెక్టులో ఫెయిలయ్యారని వర్సిటీ వర్గాలు చెప్పాయి. కరోనాకు ముందు మొదటి ఏడాది పరీక్షల్లో 88 శాతంపైగా ఉత్తీర్ణు లయ్యారు. ఒకవేళ ప్రమోట్‌ చేయడం నిబంధనల ప్రకారం సాధ్యం కాదనుకుంటే, పాస్‌ మార్కులను 50 శాతం నుంచి 35 శాతానికి తగ్గించాలని కోరుతున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల భవిష్యత్తు పట్ల తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.  

ఆన్‌లైనా? ఆఫ్‌లైనా? 
కరోనా కేసులు నమోదవుతుండటం, థర్డ్‌వేవ్‌ హెచ్చరికల నేపథ్యంలో యూజీ టూ పీజీ వరకు తరగతులన్నింటినీ ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని నిర్ణయించినా, మెడికల్‌ క్లాసులపై సర్కారు స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం ఎంబీబీఎస్, డెంటల్, ఆయుష్, నర్సింగ్‌ తదితర వైద్య కోర్సుల తరగతులు ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. మరి వాటిని అలాగే ఆన్‌లైన్‌లోనే కొనసాగించాలా? లేదా నేరుగా తరగతులు నిర్వహించాలా? అన్నదానిపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు చెప్పాయి. మెడికల్‌ పీజీ విద్యార్థులు సహజంగా బోధనాసుపత్రుల్లో వైద్య సేవల్లో నిమగ్నం కావాల్సిందే కాబట్టి వారికి మినహా యింపు ఉండదు. ఎంబీబీఎస్, డెంటల్, ఆయుష్‌  కోర్సులకు కూడా జాగ్రత్తలతో నేరుగా క్లాసులు నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వైద్య వర్గాల్లోనూ, కొందరు విద్యార్థుల్లోనూ ఉంది. విద్యార్థులను రెండు బ్యాచ్‌లుగా విభజించి, నెలలో 15 రోజులు ఒక బ్యాచ్, మరో 15 రోజులు రెండో బ్యాచ్‌ వచ్చేలా ఏర్పాట్లు చేయాలని కొందరంటున్నారు. అయితే నేరుగా క్లాసులు తీసుకోవడం రిస్క్‌ అవుతుందన్న అభిప్రాయంలో కాళోజీ వర్సిటీ వర్గాలున్నాయి. దీంతో ఆన్‌లైన్‌లోనే తరగతులు కొనసాగింపు విషయంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపే అవకాశం ఉంది.  

55 వేల మందికి ఆన్‌లైన్‌లోనే..
కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, నర్సింగ్, ఫిజియోథెరపీ సహా ఇతర అన్ని రకాల కాలేజీల్లో మొత్తం విద్యార్థులు దాదాపు 55 వేల మంది ఉంటారు. 33 ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో మొదటి ఏడాది నుంచి చివరి ఏడాది వరకు విద్యార్థులు 20 వేల మంది వరకు ఉంటారు. 20 వేల మంది నర్సింగ్, 6 వేల మంది డెంటల్, 5 వేల మంది ఫిజియోథెరపీ విద్యార్థులు, మిగిలినవారు ఆయుష్‌ సహా ఇతరత్రా కోర్సులకు చెందినవారు ఉంటారని అధికారులు తెలిపారు. అన్ని కాలేజీల్లో కరోనా మొదటి వేవ్‌ సందర్భంగా కూడా ఆన్‌లైన్‌లోనే క్లాసులు నిర్వహించారు. కరోనా తగ్గినప్పుడు మధ్యలో రెండు నెలలపాటు ప్రాక్టికల్స్‌ వరకు నేరుగా నిర్వహించారు. వాస్తవంగా మెడికల్‌ క్లాసులను ఆన్‌లైన్‌లో నిర్వహించడం సమంజసం కాకపోయినా, తప్పనిసరి పరిస్థితుల్లో నిర్వహించాల్సి వచ్చింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top