మావో గణపతి.. ఎప్పుడొచ్చారు?

Maoist Ganapathi Last Time Spotted In Bihar Says Officials - Sakshi

2018లో ఫిలిప్పీన్స్‌కు వెళ్లిపోయాడన్న పోలీసులు

ఇప్పుడు ఎందుకు వచ్చాడన్న సందేహాలు

చివరిసారిగా బిహార్‌లో కనిపించాడంటున్న నిఘా వర్గాలు

సాక్షి, హైదరాబాద్‌: మావోయిస్టు అగ్రనేత గణపతి ఆరోగ్యం క్షీణించిందని, ఆయన త్వరలోనే జన జీవన స్రవంతిలో కలుస్తారన్న ప్రచారం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. అసలు ఆయన విదేశాలకు దేని కోసం వెళ్లారు?.. అక్కడి నుంచి ఎప్పుడొచ్చారు?.. ఎందుకు వచ్చారు?.. అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానాలు దొరకడంలేదు. మావోయిస్టు కేంద్ర కార్యదర్శి పదవి నుంచి 2018 నవంబర్‌లో తప్పుకున్నాక గణపతి ప్రస్థానం సందేహంలో పడింది. ఆయన స్థానంలో నంబాల కేశవరావు కేంద్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ సీనియర్‌ పోలీసు ఉన్నతాధికారి గణపతి ఆచూకీపై సంచలన విషయం వెల్లడించారు. గణపతి ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యం నుంచి బిహార్‌ మీదుగా నేపాల్‌ వెళ్లాడని, అక్కడ నుంచి ఫిలిప్పీన్స్‌కు వెళ్లిపోయాడని తమ వద్ద సమాచారం ఉందని పేర్కొన్నారు. మావోయిస్టుల టెలిఫోన్‌ సంభాషణలపై నిఘా ఉంచగా తమకు ఈ విషయం తెలిసిందని ఆయన అన్నారు. 

చివరిసారిగా కనిపించింది అక్కడే..!
ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌ గణపతి కోసం పలు రాష్ట్రాల పోలీసులే కాకుండా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కూడా అన్వేషిస్తోంది. చివరిసారిగా 2017లో బిహార్‌లోని గయ ప్రాంతంలో సంచరించినట్లుగా నిఘా వర్గాలు అప్పట్లో పేర్కొన్నాయి. నేపాల్‌ మీదుగా ఫిలిప్పీన్స్‌కు వెళ్లడం కోసమే ఆయన అక్కడ ఉన్నట్లు విశ్లేషణలు ఉన్నాయి. గణపతిపై ఎన్‌ఐఏ రూ.15 లక్షల రివార్డు ప్రకటించింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిపితే ఆయన తలపై రూ.3.6 కోట్ల వరకు రివార్డు ఉంది. ఒకవేళ గణపతి విదేశాలకు వెళ్లిపోయేందుకు ప్రయత్నించి ఉంటే.. సదరు పోలీసు అధికారి కథనం నమ్మదగినదే అని పలువురు అంగీకరిస్తున్నారు. భారతీయులంతా బిహార్‌ ద్వారా రోడ్డు మార్గంలో నేపాల్‌కు వెళ్లడం సర్వసాధారణమే. అక్కడి నుంచి విమానాల్లో పలు దేశాలకు వెళ్లడం పెద్ద విషయమేమీ కాదు. భారతదేశంలో అశాంతికి పాల్పడే అంతర్జాతీయ ఉగ్ర సంస్థల సభ్యులు ఇదే పంథాను అనుసరిస్తారు. (చ‌ద‌వండి: కీలక నిర్ణయం తీసుకోనున్న మావో గణపతి)

నేడు గణపతి.. నాడు కత్తుల సమ్మయ్య
గతంలో లొంగిపోయిన కరీంనగర్‌ జిల్లా కాచాపూర్‌కు చెందిన కత్తుల సమ్మయ్య కూడా నక్సలైట్లలో ఉండగా పలుమార్లు విదేశాలకు వెళ్లిన దాఖలాలు ఉన్నాయి. అదే క్రమంలో 1993లో దళంతో విభేదించి.. తోటి సభ్యులను కాల్చిచంపిన అనంతరం అతడు పోలీసులకు లొంగిపోయాడు. తరువాత హైదరాబాద్‌లో కొందరు అవినీతి ఉన్నతాధికారుల పరిచయాలతో రియల్‌ ఎస్టేట్‌ వ్యవహారాలతో పాటు అనేక దందాలు నడిపాడు. 2001లో కొలంబోలో జరిగిన విమాన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మరణించాడు.

ఫిలిప్పీన్స్‌కు ఎందుకు వెళ్లాడు?
గణపతి.. ఫిలిప్పీన్స్‌కు వెళ్లి ఉంటే.. ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అనారోగ్యంతో ఉన్న ఆయన చికిత్స కోసమే వెళ్లారా? అక్కడ ఆయనకు ఆశ్రయం కల్పించిందెవరు? అన్న విషయాలు ఆసక్తికరంగా మారాయి. జీవితంలో అధిక భాగం దండకారణ్యంలో ఉన్న గణపతికి.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చక్కటి సంబంధాలు ఉన్నాయన్న పేరుంది. పార్టీకి పలువురు ప్రవాసీయుల నుంచి రూ.కోట్ల చందాలు తీసుకురావడంలో ఆయనది కీలకపాత్రగా పలువురు పేర్కొంటారు. నేపాల్, ఫిలిప్పీన్స్‌లోనూ మావోయిస్టు పార్టీ క్రియాశీలకంగా ఉండటం ఆయనకు కలిసి వచ్చిన అంశాలుగా పరిశీలకులు భావిస్తున్నారు. మంచి వ్యూహకర్త, సిద్ధాంతకర్త అయిన గణపతి.. మావోయిస్టు పార్టీకి అంతర్జాతీయ సంబం ధాల బలోపేతం కోసం ఫిలిప్పీన్స్‌ వెళ్లి ఉండొచ్చన్న ఊహాగానాలు ఉన్నాయి. (చ‌ద‌వండి: గణపతి లొంగుబాటుకు లైన్‌క్లియర్‌..!)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top