
2024 డిసెంబర్ 12న ఈ పరిశ్రమను తనిఖీ చేసిన నిజామాబాద్ డీవైసీఐ
అంతా సవ్యంగానే ఉందని అప్పట్లో నివేదిక
తనిఖీ చేసిన ఏడు నెలల్లోపే భారీ ప్రమాదం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: పాశమైలారంలోని సిగాచి పరిశ్రమను కర్మాగారాల శాఖ అధికారులు చివరిసారిగా 2024 డిసెంబర్ 12న తనిఖీ చేసినట్టు ఆ శాఖ రికార్డులు చెబుతున్నాయి. వార్షిక తనిఖీల్లో భాగంగా జంబ్లింగ్ విధానంలో నిజామాబాద్ జిల్లా డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ జి.నెహ్రుతో ఈ పరిశ్రమను తనిఖీ చేయించారు. తాను నిర్వహించిన తనిఖీల్లో పరిశ్రమలో అన్ని భద్రత ప్రమాణాలు పాటించారని నెహ్రు అప్పట్లో నివేదిక ఇచ్చారు.
ఈ తనిఖీ జరిగి ఏడు నెలల్లోనే భారీస్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లేలా ప్రమాదం జరిగింది. అయితే తనిఖీలు తూతూ మంత్రంగానే చేశారా అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్మికుల ఆరోగ్యానికి ముప్పు లేకుండా, పర్యావరణానికి విఘాతం లేకుండా ఈ పరిశ్రమ అన్ని నిబంధనలు పాటించిందంటూ ఉన్నతాధికారులకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు.
జంబ్లింగ్ విధానంలో తనిఖీలు
పరిశ్రమలు.. కార్మికుల భద్రత ప్రమాణాలు పాటిస్తున్నాయా లేదా? అనేదానిపై కర్మాగారాలశాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తారు. రియాక్టర్లు, బాయిలర్లు, డ్రయ్యర్లు.. ఇలా వివిధ విభాగాలను తనిఖీలు చేసి ప్రమాణాలు సరిగ్గా ఉన్నాయా? లేదా? చూస్తారు. పరిశ్రమల్లోని ఆయా విభాగాల వద్ద భద్రతపై థర్డ్ పార్టీ ప్రైవేట్ ఏజెన్సీలు తనిఖీ చేసి నివేదికలు ఇస్తాయి. కర్మాగారాల శాఖ అధికారులు ఈ నివేదికలను మాత్రమే చూసి వదిలేస్తుండటంతో ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయనే విమర్శలు ఉన్నాయి.
మెషినరీ కాలం చెల్లిందని చెప్పినా...
సిగాచి పరిశ్రమ దుర్ఘటనపై భానూరు పీఎస్‌లో ఈనెల 2న కేసు నమోదైంది. పరిశ్రమలోని మెషినరీ కాలం చెల్లిపోయిందని, వెంటనే మార్చాలని, లేకపోతే భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉందనే విషయాన్ని తన తండ్రి వెంకటజగన్ మోహన్ యాజమాన్యం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లానని, తనకు చెప్పారని సాయి యశ్వంత్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయినా యాజమాన్యం పట్టించుకోలేదన్నారు.
నేను తనిఖీ చేసినప్పుడు అన్నీ బాగా పనిచేశాయి
సిగాచి పరిశ్రమను 2024 డిసెంబర్ నెలలో నేను తనిఖీ చేశారు. డ్రయ్యర్లు, రియాక్టర్, బాయిలర్లు, ఇతర యంత్ర పరికరాలు బాగానే పనిచేశాయని మా తనిఖీలో తేలింది. అందుకే ఎలాంటి అభ్యంతరాలు లేవని మా శాఖ ఉన్నతాధికారులకు అప్పట్లో నివేదిక ఇచ్చాను. ఈ ఫ్యాక్టరీలో మూడు షిఫ్టుల్లో ఉత్పత్తి జరుగుతోంది. నేను తనిఖీ చేసిన తర్వాత పరిస్థితులు మారి ప్రమాదానికి దారితీసి ఉండొచ్చు. మామూళ్లు తీసుకున్నారనే ఆరోపణలు అవాస్తవం. – జి.నెహ్రూ, ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్
40కి చేరిన ‘సిగాచి’ మరణాలు
చికిత్స పొందుతున్న వారిలో మరొకరు మృతి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగి దుర్ఘటనలో క్షతగాత్రులైన వారు ఒక్కొక్కరుగా రాలిపోతున్నారు. తీవ్రగాయాలై ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో శుక్రవారం కార్మికుడు భీంరావు మృతి చెందగా, శనివారం మరో కార్మికుడు మున్‌మున్‌చౌదరి మృత్యువాత పడ్డారు. దీంతో ఈ దుర్ఘటనలో మరణాల సంఖ్య 40కి చేరింది. ధ్రువ ఆస్పత్రిలో చేరిన 9 మంది క్షతగాత్రుల్లో ఇప్పటికే ఇద్దరు మృతి చెందగా, మిగిలిన ఏడుగురిలో 40 నుంచి 80 శాతానికి పైగా కాలిన గాయాలైన ముగ్గురికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.
ఆ రెండు మృతదేహాలు ఎవరివి?
పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రిలో రెండు ఫుల్ డెడ్‌బాడీలు ఉన్నాయి. ఈ మృతదేహాలు ఎవరివనేది తేలడం లేదు. అవి ఆయా కుటుంబసభ్యుల డీఎన్‌ఏలతో సరిపోవడం లేదు. దీంతో ఆయా కుటుంబాల్లోని ఇతర సభ్యుల రక్తం శాంపిల్స్ సేకరిస్తున్నారు. ఇప్పటికే ఇచి్చన వారివి కాకుండా ఆ కుటుంబంలోని మరొకరి రక్తం శాంపిల్‌ను తీసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఈ నివేదికలు వచ్చాకే ఈ రెండు ఫుల్ డెడ్‌బాడీలను సంబంధిత కుటుంబాలకు అప్పగిస్తామని అధికారులు ప్రకటించారు. డీఎన్‌ఏ రిపోర్టులు వచ్చిన మూడు డెడ్‌బాడీలను శనివారం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
శిథిలాల కింద మరిన్ని శరీరభాగాలు లభ్యం
శనివారం శిథిలాల కింద మరిన్ని శరీరభాగాలు లభించాయి. ఎముకలు, చేతివేళ్లు, ఇతర శరీరభాగాలు లభించడంతో వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఇప్పటికే 15 శరీరభాగాలు మార్చురీలో ఉన్నాయి. వీటి డీఎన్‌ఏ రిపోర్టులు వచ్చి నా, అవి శాంపిల్స్ ఇచ్చిన వారి కుటుంబాలకు సరిపోవడం లేదు.
కొనసాగుతున్న రెస్క్యూ
పేలుడు జరిగిన స్థలంలో ఎస్‌డీఆర్‌ఎఫ్, హైడ్రా అధికారుల రెస్క్యూ ఆపరేషన్ శనివారం కూడా కొనసాగింది. శిథిలాల తొలగింపు దాదాపు పూర్తయ్యింది. కానీ పేలుడు తీవ్రతకు భూమిలోకి దంతాలు, ఎముకలు వంటి శరీరభాగాలు ఏమైనా చొచ్చుకుని పోయాయా? మరేదైనా ఆనవాళ్లు లభిస్తాయోనని ఎస్‌డీఆర్‌ఎఫ్, హైడ్రా అధికారులు పంట చేలో కలుపు తీసిన మాదిరిగా ఆనవాళ్ల కోసం చేతులతో తవ్వుతున్నారు.