తగ్గని సిలిం'డర్‌'! | LPG Gas Crisis: People Suffers with Cooking gas not receive for 20 days | Sakshi
Sakshi News home page

తగ్గని సిలిం'డర్‌'!

Apr 7 2026 2:02 AM | Updated on Apr 7 2026 2:02 AM

LPG Gas Crisis: People Suffers with Cooking gas not receive for 20 days

20 రోజులైనా అందని వంటగ్యాస్‌

బుక్‌ చేసినా సిలిండర్లు సరఫరా కాక రాష్ట్రవ్యాప్తంగా జనం గగ్గోలు 

కమర్షియల్‌ సిలిండర్లు లేక హోటళ్ల పరేషాన్‌ 

గ్యాస్‌ ఏజెన్సీలు, గోడౌన్‌ల వద్ద క్యూలు

సాక్షి, హైదరాబాద్‌: ‘వంట గ్యాస్‌కు ఎలాంటి ఇబ్బంది లేదు. బుక్‌ చేసుకున్న ప్రతీ ఒక్కరికి సిలిండర్‌ పంపిణీ చేస్తాం. ఆందోళన వద్దు’.. ఇది ఇరాన్‌– ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ప్రారంభమైన మొదటి వారంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, ఆ శాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర చేసిన ప్రకటన. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. బుకింగ్‌ చేసి 15, 20 రోజులు దాటినా సిలిండర్లు ఇంటికి చేరడం లేదని గృహిణులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీంతో గ్యాస్‌ ఏజెన్సీలు, గోడౌన్‌ల వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూలు కడుతున్నారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్‌ వంటి నగరాల్లోనే కాదు, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. ఉదయం నుంచే గ్యాస్‌ ఏజెన్సీల వద్ద క్యూలు కడుతున్న ప్రజలు ‘ఒక్క సిలిండర్‌ ఇప్పించండి’అంటూ వేడుకుంటున్నారు. కొందరు వినియోగదారులు నేరుగా గోడౌన్‌కు వెళ్లి ఏజెన్సీలకు అదనంగా సొమ్ములు చెల్లించి సిలిండర్‌ తీసుకుంటున్న పరిస్థితి ఉంది. 

పెండింగ్‌లో లక్షల బుకింగ్‌లు 
రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో బుకింగ్‌లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. రోజువారీ సరఫరా జరుగుతున్నప్పటికీ డిమాండ్‌కు సరిపడా పంపిణీ జరగడం లేదని వినియోగదారులు చెబుతున్నారు. సింగిల్‌ సిలిండర్‌ మాత్రమే ఉన్నవారితోపాటు కుటుంబాలకు దూరంగా హైదరాబాద్‌ వంటి నగరాల్లో సింగిల్‌ రూముల్లో ఉండి ఉద్యోగాలు చేసుకుంటున్న యువతీ యువకులు వంట గ్యాస్‌ దొరకక పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. హైదరాబాద్‌లోని చర్లపల్లిలో ఉన్న భారత్, ఇండేన్, హెచ్‌పీ గ్యాస్‌ ఫిల్లింగ్‌ ప్లాంట్లలో గ్యాస్‌ సిలిండర్ల రీఫిల్లింగ్‌ పెద్దఎత్తున జరుగుతోందని చెబుతున్నప్పటికీ వినియోగదారులకు సకాలంలో అందడం లేదు. దీంతో చాలామంది ఎలక్ట్రిక్, ఇండక్షన్‌ స్టవ్‌లను కొనుగోలు చేస్తున్నారు.  

కమర్షియల్‌ సెక్టార్‌లో తీవ్ర సంక్షోభం 
హోటళ్లు, చిన్న వ్యాపారులు గ్యాస్‌ కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. బ్యాచ్‌లర్లుగా, హాస్టళ్లలో భోజనాలు చేస్తున్న వారి పరిస్థితి సంకటంగా మారుతోంది. కమర్షియల్‌ సిలిండర్లు లభించకపోవడంతో హోటళ్లలో టిఫిన్లు, భోజనాలకూ ఆంక్షలు విధిస్తున్నారు. కాగా, 19 కిలోల కమర్షియల్‌ సిలిండర్‌ ధర భారీగా పెరిగి రూ. 2,300కు చేరింది. ప్రైవేటు ఏజెన్సీలు కిలో ఎల్‌పీజీని రూ. 250కి విక్రయిస్తున్నాయి. అది కూడా దొరకకపోవడంతో బ్లాక్‌లో ఒక్కో సిలిండర్‌కు రూ.7వేల వరకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. సకాలంలో గ్యాస్‌ అందించేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement