పరువు.. ప్రాణం తీస్తున్నారు

LoanApps Illigal Business - Sakshi

లోన్‌యాప్స్‌ అనైతిక వసూళ్ల దందా 

పరువు తీసేలా సోషల్‌మీడియాలో ప్రచారం 

బంధువులు, స్నేహితులకు వాట్సాప్‌లో డిఫాల్టర్‌ అంటూ సందేశాలు 

కుటుంబ సభ్యులకు, మిత్రులకు ఫోన్లు చేసి దూషణలు 

తీవ్ర వేధింపులు... అవమానాలు 

తట్టుకోలేక బాధితుల ఆత్మహత్యలు 

లోన్‌యాప్‌ ఏజెంట్ల అరాచకాలు 

‘‘హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో సునీల్‌ (29) అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ లోన్‌యాప్స్‌ ద్వారా అప్పు చేశాడు. వాటిని చెల్లించాలని ఏజెంట్లు తీవ్రంగా వేధించడంతో ఉరివేసుకొని చనిపోయాడు.’’

‘‘సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాల్‌పేటలో స్నాప్‌ఇట్‌ అనే లోన్‌యాప్‌ ఏజెంట్‌ వేధింపులతో వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) మౌనిక ఆత్మహత్యకు పాల్పడింది. డిఫాల్టర్‌ అంటూ పోస్టర్లు రూపొందించి వారి బంధువులు, స్నేహితుల వాట్సాప్‌ గ్రూపుల్లో షేర్‌ చేయడంతో మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకుంది.’’ 

సాక్షి, హైదరాబాద్‌:  ‘‘సులువుగా వస్తున్నాయి కదా... అని లోన్‌యాప్‌లలో రుణాలు తీసుకున్నారా? పొరపాటున అప్పు చెల్లించడం ఒక్కరోజు ఆలస్యమైనా ఇక మీ పరువు గోవిందా! వెంటనే రంగంలోకి ఏజెంట్లు దిగిపోతారు. మీ కాంటాక్ట్‌ లిస్టు చేతిలో పట్టుకుని మీ పరువుకు ఎన్నిరకాలుగా భంగం కలుగజేయవచ్చో.. అన్ని రకాలుగా అరాచకాలకు పాల్పడుతున్నారు. తీవ్రమైన వేధింపులకు గురిచేసి... మానసికంగా హింసిస్తున్నారు. రుణం తీసుకునేటపుడే... మన ఫోన్‌లోని కాంటాక్ట్స్, ఫొటోలు, ఇతర సమాచారం యాక్సెస్‌ చేసుకుంటారు. అనుమతి నిరాకరిస్తే... అప్పు ఇవ్వరు. అలా రుణగ్రహీత కాంటాక్ట్స్‌అన్నీ యాప్‌ ఏజెంట్‌ చేతిలో ఉంటాయి. ఏం చేసైనా సరే.. అప్పు తీసుకున్న వ్యక్తి నుంచి వడ్డీలు, చక్రవడ్డీలతో సహా ముక్కుపిండి వసూలు చేయాలన్నదే వీరి లక్ష్యం. తీసుకున్న అప్పు చిన్నదా.. పెద్దదా అన్నది వీరికి అనవసరం. రుణగ్రహీత అప్పటికపుడు చెల్లించాడా? లేదా అన్నదే వీరికి ముఖ్యం.

వీరి ఆగడాలకు హద్దూపద్దూ ఉండటం లేదు. సోషల్‌ మీడియాలో రచ్చరచ్చ చేసి... కాంటాక్ట్‌ లిస్టులోని వారందరికీ డిఫాల్టర్‌ అంటూ సందేశాలు పంపి పరువు తీస్తున్నారు. ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వీరి టార్చర్‌ భరించలేక కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎలాంటి ష్యూరిటీలు, హామీలు లేకుండా.. ఆధార్, పాన్‌కార్డు, ఇతర గుర్తింపుకార్డుల సమాచారంతో రూ.2 నుంచి రూ.3 వడ్డీతో మూడు లక్షల రూపాయల వరకు ఈ లోన్‌యాప్స్‌ అప్పులిస్తూ... నేరుగా బ్యాంకు ఖాతాలో వేస్తున్నాయి. కరోనా కాలంలో ఉపాధి దెబ్బతిని చాలామంది వీటిల్లో లోన్లు తీసుకున్నారు. మరోవైపు యువత వివిధ అవసరాల కోసం తేలిగ్గా వీటి వలలో పడిపోతోంది. కొందరైతే క్రికెట్‌ బెట్టింగ్, ఆన్‌లైన్‌ రమ్మీ, ఖరీదైన స్మార్ట్‌ఫోన్ల కొనుగోలు... ఇలాంటి వాటికోసం కూడా అప్పులు చేసేస్తున్నారు. ఆపై రుణాల చెల్లింపులో తేడా వస్తే... ఏజెంట్లు పెట్టే బాధలు తాళలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా చోటుచేసుకున్న పలు విషాదాలు దీనికి నిదర్శనం. 

ఒక అప్పు తీర్చేందుకు మరో యాప్‌..! 
కొన్ని యాప్స్‌ అధిక వడ్డీకి అప్పులు అంటగడుతున్నాయి. 24 శాతం నుంచి 36 శాతం వసూలు చేస్తున్నాయి. లోన్‌యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునేవారు అప్పు తీసుకునే హడావిడిలో టెర్మ్స్‌ అండ్‌ కండిషన్స్‌ను సరిగా చదవరు. వాయిదా రోజు కట్టకపోతే వడ్డీకి వడ్డీ పడిపోతుంది. అందుకే, చాలామంది మరో యాప్‌లో అప్పు తీసుకుంటారు. ఈ అప్పులు కుప్పలు తెప్పలుగా పెరిగిపోతుంటాయి. రాజేంద్రనగర్‌లో తాజాగా ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సునీల్‌ (29) అప్పుల కోసం ఏకంగా 35కి యాప్స్‌కి పైగా ఉపయోగించాడని పోలీసులు తెలిపారు. లాక్‌డౌన్‌ కాలంలో లక్సెట్టిపేటలో ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థి ఆన్‌లైన్‌లో దాదాపు రూ.15 లక్షలు అప్పు చేశాడు. వారి వేధింపులు భరించలేక ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఇతను కూడా అనేక యాప్స్‌ ద్వారా అప్పులు జేశాడు. ఇటీవల నర్సాపూర్‌లోనూ ఎద్దు శ్రీనివాస్‌ యాదవ్‌ అనే 23 ఏళ్ల డిగ్రీ విద్యార్థి యూయూ యాప్‌ ద్వారా కేవలం రూ.16 వేలు అప్పు తీసుకుని చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్న మొత్తాలు తీసుకున్నా... ఏజెంట్ల దూకుడు, అత్యుత్సాహంతో పరువు మంటగలిసిందనే బాధతో కొందరు సున్నిత మనసు్కలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.  

వేధిస్తే ఫిర్యాదు చేయండి 
ఏ తరహా రుణ సంస్థలకైనా ఆర్‌బీఐ అనుమతి తప్పనిసరి. రాష్ట్రవ్యాప్తంగా యాప్‌ల ద్వారా రుణాలిస్తూ వేధిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈ తరహా ఆన్‌లైన్‌ యాప్‌లలో అధికశాతం ఆర్‌బీఐలో నమోదు కాలేదు. రుణాలు ఇచ్చే నిర్వాహకులు బెదిరిస్తే ప్రజలు భయపడిపోకుండా వెంటనే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి.
– డీజీపీ డాక్టర్‌ ఎం.మహేందర్‌రెడ్డి 

గుడ్డిగా డౌన్‌లోడ్‌ చేసుకోవద్దు 
► అధిక వడ్డీలు, వేధింపులతో ప్రజలను బెంబేలెత్తిస్తోన్న దాదాపు 60 రకాల ప్లేస్టోర్స్‌లో ఉన్న లోన్‌ యాప్స్‌ ఆర్బీఐ గైడ్‌లైన్స్‌కి విరుద్ధంగా పనిచేస్తున్నాయని డీజీపీ కార్యాలయం పేర్కొంది. వీటిని తొలగించాలని త్వరలోనే గూగుల్‌కు సమాచారమిస్తామని తెలిపింది. 
► వ్యక్తిగత భద్రతా పాలసీకి విరుద్ధంగా వ్యవహరించినా, కాంటాక్ట్స్‌ సేకరించినా ఐటీ రూల్స్‌ 2011 ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపింది. బంధువులకు ఫోన్‌ చేసి వేధిస్తే రూల్‌ 3(2) ప్రకారం చర్యలు ఉంటాయని స్పస్టం చేసింది.
► లోన్‌యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే ముందు ఆర్బీఐ వెబ్‌సైట్‌లో ఒకసారి తనిఖీ చేసుకోవాలని సూచించింది. వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, కాంటాక్ట్స్, లొకేషన్‌ యాక్సెస్‌ చేయాలని కోరిన ఏ యాప్‌నైనా సరే.. డౌన్‌లోడ్‌ చేసుకోవద్దని తెలిపింది. 

టార్చర్‌పెడతారిలా
► ముందు సదరు ఫోన్‌ నంబరుకు లీగల్‌నోటీసులు వాట్సాప్‌ చేస్తారు. దానికి స్పందించి ఆలస్యానికి విధించిన జరిమానాతో సహా కొందరు కట్టేస్తున్నారు. 
► తల్లిదండ్రులకు, ఇంట్లోని పెద్దవాళ్లకు చెబుతామని బెదిరిస్తున్నారు. దీంతో యువకులు తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు. 
► మిత్రులు, బంధువులకు ఫోన్లుచేసి సదరు వ్యక్తి చనిపోయాడంటూ, యాక్సిడెంట్‌ అయిందని దుష్ప్రచారం చేస్తున్నారు. దీంతో మిత్రులంతా ధ్రువీకరించుకునేందుకు మళ్లీ బాధితుడికి ఫోన్‌ చేసి అడుగుతుంటారు. దీంతో చాలామంది తాము బతికే ఉన్నామని చెప్పుకోవాల్సి వస్తోంది.  
► ఇంకొందరు వేధింపుల్లో మరో పద్ధతిలో వెళుతున్నారు. కాంటాక్ట్స్‌ లిస్ట్‌లో అక్కా, వదిన, పిన్ని అని సేవ్‌ చేసుకున్న నంబర్లే వీరి లక్ష్యం. వారికి ఫోన్‌ చేసి ఫలానా వ్యక్తి మీ తమ్ముడు కదా... మా దగ్గర రూ.5,000 అప్పు తీసుకున్నాడు. నువ్వు తీర్చు, నువ్వు ఏం చేస్తావో మాకు తెలియదు.. వాడి అప్పు కట్టకపోతే.. నీ భర్తకు ఫోన్‌ చేస్తాం అంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు దిగుతారు. తమకీ వేధింపులు ఏంటని సదరు బంధువులు వెళ్లి రుణగ్రహీతతో వాగ్వాదానికి దిగుతున్నారు. దగ్గరి కుటుంబాల మధ్య గొడవలొస్తున్నాయి. 
► ఇంకొందరు ఏజెంట్లు బాధితుడి వాట్సాప్‌ గ్రూపుల్లోకి చొరబడుతున్నారు. డిఫాల్టర్‌ అంటూ బాధితుడి ఫొటో, బాకీ వివరాలు పెట్టి పలు వాట్సాప్‌ గ్రూపుల్లో షేర్‌ చేస్తున్నారు. ఇలాంటి వేధింపులతోనే సిద్ధిపేటలో వ్యవసాయాధికారి మౌనిక, తాజాగా రాజేంద్రనగర్‌లో సునీల్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఉరేసుకుని చనిపోయారు. 
► బాధ భరించలేక నంబర్‌ మార్చితే.. యాప్‌ ఏజెంట్లు ఇంకా రెచ్చిపోతున్నారు. అప్పటికే మీ డేటా, కాంటాక్ట్స్‌ లిస్ట్‌ మొత్తం వారి దగ్గర ఉంటుంది. మీ బంధువులు, స్నేహితులను ఇబ్బంది పెట్టడం మరింత తీవ్రతరం చేస్తారు. 
► బాధితులను అమ్మాయిల బ్రోకర్‌గా పేర్కొంటూ, వ్యక్తిత్వం దెబ్బతినే విధంగా ఫొటోలు మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. 
► అప్పు కట్టకుంటే ఫొటోలను, ఫోన్‌నంబర్లనూ అశ్లీలౖ సెట్లలో అప్‌లోడ్‌ చేస్తామని కూడా బెదిరిస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top