సాదాబైనామా..50 ఏళ్ల హైరానా..! 9.24 లక్షల దరఖాస్తులు పెండింగ్

2020కు ముందే 2.24 లక్షల దరఖాస్తులు.. ఆ తర్వాత వచ్చినవి 7 లక్షలు
దాదాపు 20 లక్షల ఎకరాలకు సంబంధించి సాదాబైనామాల సమస్య
చట్ట సవరణ చేసి పరిష్కరించాలంటున్న భూచట్టాల నిపుణులు
1971 ఆర్‌వోఆర్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాతే సమస్య ఉత్పన్నం
అంతకుముందు నోటిమాటతో లావాదేవీలు జరిగినా తహసీల్దార్లకు పట్టా ఇచ్చే అధికారం
సాక్షి, హైదరాబాద్: సాదాబైనామా.. తెల్ల కాగితాలపై రాసుకుని జరిపే భూముల క్రయ విక్రయ లావాదేవీలకు పెట్టిన పేరు ఇది. ఈ సాదాబైనామాలు సాధారణమైనవేమీ కాదు.. రామాయణమంత చరిత్ర ఉంది అంటే అతిశయోక్తి కాదు. వందల ఏళ్ల చరిత్ర ఉన్న సాదాబైనామాలు సమస్యల్లో చిక్కుకుని 50 ఏళ్లు గడిచినా ఇంతవరకు శాశ్వత పరిష్కారం మాత్రం లభించడం లేదు. ఇప్పటికీ రాష్ట్రంలో 9.24 లక్షల దరఖాస్తులు సాదాబైనామా కింద పరిష్కారం కోసం పెండింగ్‌లో ఉన్నాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆర్‌వోఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్) చట్టం–1971 అమల్లో ఉన్నప్పుడు 2.4 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, కొత్త రెవెన్యూ చట్టం (2020) అమల్లోకి వచ్చాక మరో 7 లక్షల దరఖాస్తులు పరిష్కారం కోసం వచ్చాయి.
12 రోజుల్లోనే 7 లక్షల మంది
కేవలం తెల్లకాగితంపై రాసుకున్నవి కావడం, ఎలాంటి రిజిస్ట్రేషన్ పత్రాలూ లేకపోవడంతో ఏళ్లు గడిచే కొద్దీ వివాదాలు పెరుగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సాదాబైనామాల క్రమబద్ధీకరణ మొదలయ్యింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు రెండుసార్లు సాదాబైనామా దరఖాస్తులు స్వీకరించారు. 2014 జూన్ 2 లోపు తెల్లకాగితాలపై రాసుకున్న లావాదేవీల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తులు ఆహ్వానించగా 2.4 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తులు వచ్చి ఏళ్లు గడుస్తున్నా పరిష్కారం లభించలేదు. 2020లో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది.
అప్పటివరకు అమల్లో ఉన్న ఆర్‌వోఆర్ చట్టం–1971కి సవరణలు చేసి ఆర్‌వోఆర్ చట్టం–2020ని అమల్లోకి తెచ్చింది. 2020, అక్టోబర్ 29న ఈ చట్టం అమల్లోకి రాగా, అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు మరోమారు సాదాబైనామాల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించారు. ఈ 12 రోజుల్లోనే 7 లక్షల మంది తమ సాదాబైనామా లావాదేవీలను క్రమబద్ధీకరించాలని కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. కాగా రెండోసారి దరఖాస్తులు తీసుకున్నప్పుడు కూడా 2014, జూన్ 2నే కటాఫ్ డేట్‌గా నిర్ణయించారు. కానీ ఇప్పటివరకు ఆ 9.4 లక్షల దరఖాస్తులకు మోక్షం లభించలేదు.
1971 చట్టం అమల్లోకి వచ్చిన తర్వాతే..
సాదాబైనామా లావాదేవీలు గతంలో అధికారికంగా చెల్లుబాటు అయ్యేవి. 1948లో హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్–1948 ప్రకారం సాదాబైనామా లావాదేవీలను తహశీల్దార్లు క్రమబద్ధీకరించే వారు. రిజిస్ట్రేషన్లు, నోటిమాట, తెల్ల కాగితాల ద్వారా జరిగిన భూముల క్రయవిక్రయ లావాదేవీలను పరిగణనలోకి తీసుకుని జమాబందీ ద్వారా తహశీల్దార్లు పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేసేవారు. 1970 వరకు ఇదే విధానం అమల్లో ఉంది. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1948 చట్టాన్ని సవరించి 1971 ఆర్‌వోఆర్ చట్టాన్ని అమల్లోకి తెచ్చినప్పుడు ఈ సాదాబైనామాల విషయంలో నిబంధనలు మార్చారు.
భూమి కొనుగోలు లావాదేవీలపై రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటేనే పట్టాదారు పాస్‌పుస్తకం ఇవ్వాలనే నిబంధన పెట్టారు. దీంతో తెల్లకాగితాలు, నోటిమాట లావాదేవీలు అధికారికంగా చెల్లకుండా పోయాయి. ఆ తర్వాత 1989లో ఓసారి 1971 చట్టాన్ని సవరించారు. దీని ప్రకారం తహశీల్దార్లకు సాదాబైనామాలను పరిష్కరించే అధికారం కల్పించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ సవరణ చట్టం ద్వారానే సాదాబైనామాలను క్రమబద్ధీకరిస్తున్నారు. 1989, 2000, 2014, 2020లో నాలుగుసార్లు ఇలా సాదాబైనామాల పరిష్కారానికి దరఖాస్తులు స్వీకరించారు.
కొత్త చట్టంలో అధికారాలేవీ..?
అయితే 2020లో అమల్లోకి వచ్చిన కొత్త రెవెన్యూ చట్టంలో తహశీల్దార్లకు గానీ, ఇతర ఏ స్థాయి రెవెన్యూ యంత్రాంగానికి గానీ సాదాబైనామాలను పరిష్కరించే అధికారం కల్పించలేదు. అసలు సాదాబైనామాల ప్రస్తావనే లేదని భూచట్టాల నిపుణులు చెపుతున్నారు. కొత్త చట్టం అమల్లోకి వచ్చాక నోటిఫికేషన్ ఇచ్చి మరీ 7 లక్షల దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం.. పరిష్కార వ్యవస్థను కొత్త చట్టంలో ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. ఇప్పుడు మొత్తం 9.4 లక్షల (20 లక్షల ఎకరాల విస్తీర్ణం ఉంటుందని అంచనా.)
సాదాబైనామాల దరఖాస్తులను పరిష్కరించాలంటే చట్ట సవరణే మార్గమని, ఆర్‌వోఆర్ చట్టం–2020కి సవరణ జరిగేంతవరకు ఈ సాదాబైనామాల క్రమబద్ధీకరణ సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల మాట అలా ఉంచితే... 2014 జూన్ 2 తర్వాత జరిగిన సాదాబైనామాల పరిస్థితి ఏంటనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. మరి, చట్ట సవరణ, కొత్త దరఖాస్తుల స్వీకరణ, కటాఫ్ డేట్ మార్పు లాంటి అంశాల్లో ప్రభుత్వం ఏం చేస్తుందో..సాదాబైనామాల అంశాన్ని ఎప్పటికి శాశ్వతంగా పరిష్కరిస్తుందో వేచి చూడాల్సిందే.