
కేటీఆర్‌కు ఎర్రవల్లిలో కేసీఆర్ దంపతుల ఆశీస్సులు
సాక్షి, హైదరాబాద్/పటాన్‌చెరు టౌన్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు గురువారం తెలంగాణ భవన్‌లో ఘనంగా జరిగాయి. ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ భవన్‌కు పోటెత్తారు. సమావేశ మందిరంలో జరిగిన వేడుకల్లో కేటీఆర్ భారీ కేక్‌ను కట్ చేశారు. మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, లక్ష్మారెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి, మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, పార్టీ నేతలు దేవీ ప్రసాద్, రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు కేటీఆర్‌కు కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ భవన్‌లో పార్టీ కేడర్ మధ్య పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న కేటీఆర్.. అనంతరం సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షుతో కలసి ఎర్రవల్లి నివాసానికి వెళ్లి తల్లిదండ్రులు కేసీఆర్, శోభ పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. కేటీఆర్‌ను ఆత్మీయ ఆలింగనం చేసుకుని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుమారుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కాగా కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ‘గిఫ్ట్ ఎ స్మైల్’పేరిట రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ నేతలు, కేటీఆర్ అభిమానులు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజీవ్ సాగర్, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ సహకారంతో ఓ ప్రైవేటు పాఠశాలకు బెంచీలు, విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల చికిత్స కోసం ‘తలసేమియా సికిల్‌సెల్ ఎనీమియా సొసైటీ’కి కేటీఆర్ చేతుల మీదుగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి రూ.3 లక్షల చెక్కును విరాళంగా అందజేశారు.
అలాగే కేటీఆర్ పటాన్‌చెరుకు వెళ్లి ఇటీవల అరెస్టయిన పార్టీ సోషల్ మీడియా విభాగం కార్యకర్త నల్లబాలు అలియాస్ శశిధర్‌గౌడ్‌ను పరామర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఆయన పోస్టు పెట్టడంతో అరెస్టయిన విషయం తెలిసిందే. నల్లబాలు నివాసంలో ఆయన కుటుంబ సభ్యుల మధ్య కేటీఆర్ కేక్‌కట్ చేసి పుట్టినరోజు వేడుక చేసుకున్నారు. అనంతరం వారి ఇంట్లో భోజనం చేశారు.