మూడు మెగా టెర్మినళ్లు! | Key progress in the proposal to construct mega railway terminals | Sakshi
Sakshi News home page

మూడు మెగా టెర్మినళ్లు!

Sep 2 2026 1:29 AM | Updated on Sep 2 2026 1:29 AM

Key progress in the proposal to construct mega railway terminals

నాగులపల్లి, జూకల్, డబీల్‌పురాల్లో నిర్మాణం

ఫైనల్‌ లొకేషన్‌ సర్వేకు దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదన

బోర్డుకు లేఖ... ఆరు నెలల్లో డీపీఆర్‌ సిద్ధం

దేశంలోనే మూడో పెద్ద టెర్మినల్‌గా నాగులపల్లి ప్రతిపాదన

సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడలపై ఒత్తిడి తగ్గింపు

వచ్చే 50 ఏళ్ల వరకు ప్రయాణికుల తాకిడిని తట్టుకునేలా నిర్మాణం

సాక్షి, హైదరాబాద్ : కోటిన్నరకు జనాభా చేరువయ్యేలా శరవేగంగా విస్తరిస్తున్న భాగ్యనగరంలో రైలు ప్రయాణికుల తాకిడిని వచ్చే 50 ఏళ్ల వరకు తట్టుకునేలా మూడు మెగా రైల్వే టెర్మినల్స్‌ నిర్మాణ ప్రతిపాదనలో కీలక పురోగతి ఇది. ప్రతిపాదన దశలోనే ఉన్న ఆలోచనను అమలు దిశగా తీసుకెళ్లే ఫైనల్‌ లొకేషన్‌ సర్వే ప్రారంభం కాబోతోంది. శంషాబాద్‌ సమీపంలోని జుకల్, కొల్లూరు సమీపంలోని నాగులపల్లి, మేడ్చల్‌ సమీపంలోని డబీల్‌పురా స్టేషన్‌లను విస్తరించి భారీ టెర్మినల్‌ స్టేషన్లుగా మార్చనున్నారు. ఇందులో నాగులపల్లి స్టేషన్‌ టెర్మినల్‌లో ఏకంగా 20 ప్లాట్‌ఫామ్స్‌ నిర్మించాలన్నది ప్రతిపాదన. అంటే, ఇది దేశంలోనే మూడో అతిపెద్ద స్టేషన్‌గా మారనుంది. 

ప్రస్తుతానికి ప్రతిపాదనల్లో ఉన్న ఆలోచనలను స్థిరీకరించేలా ఫైనల్‌ లొకేషన్‌ సర్వే నివేదిక ద్వారా ప్రతిపాదించనున్నారు.వాటి నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని డీపీఆర్‌ ద్వారా తేల్చనున్నారు. డీపీఆర్‌తో అంచనా వ్యయంపై కొంత స్పష్టత రానున్నప్పటికీ, దాదాపు రూ.1500 కోట్ల వరకు వ్యయం అవుతుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ మూడు స్టేషన్ల నిర్మాణానికి 1450 ఎకరాల నుంచి 1550 ఎకరాల మధ్య అవసరమవుతుందని భావిస్తున్నారు. ఈ మూడు టెర్మినల్‌ స్టేషన్లను దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదించింది. దీనికి రైల్వే బోర్డు కూడా కొంత సానుకూలతను వ్యక్తం చేసిన నేపథ్యంలో వాటి ఫైనల్‌ లొకేషన్‌ సర్వే నిర్వహించాల్సిందిగా కోరుతూ తాజాగా రైల్వే బోర్డుకు దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదిస్తూ లేఖ రాసింది. 

బడ్జెట్‌తో సంబంధం లేకుండా వచ్చే నెలలోపు రైల్వే బోర్డు సర్వేను మంజూరు చేయనుంది. వచ్చే మార్చి నాటికి ఈ సర్వేను డీపీఆర్‌తో కలిపి పూర్తి చేసే అవకాశం ఉంది. త్వరలోనే సర్వే సంస్థను గుర్తించేందుకు రైల్వే బోర్డు టెండర్లు పిలవనుంది. ప్రస్తుతం నగరంలో మూడు ప్రధాన స్టేషన్లు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడలు రైల్వే సేవలను అందిస్తున్నాయి. స్థలా భావం వల్ల వాటిని విస్తరించే వీలు లేక క్రమక్రమంగా ఇబ్బందులు పెరుగుతున్నాయి. దీంతో చర్లపల్లి టెర్మినల్‌ను నిర్మించి అక్కడి స్టేషన్‌ను విస్తరించారు. 

కానీ, నగరంలోని ప్రధాన రైల్వే లైన్లను అనుసంధానిస్తూ, చర్లపల్లి కంటే పెద్ద స్టేషన్లను నిర్మించాలని నిర్ణయించిన దక్షిణ మధ్య రైల్వే ఈ మూడు స్టేషన్లను ప్రతిపాదించింది. వీటిని రైల్వే రింగ్‌ టెర్మినళ్లుగా అనుసంధానించబోతోంది. ఈ టెర్మినళ్లు అందుబాటులోకి వస్తే రైళ్ల సంఖ్య పెరగడంతోపాటు దూర ప్రాంత రైళ్లలో ఎక్కువ సర్వీసులు నగరం లోపలికి రావాల్సిన అవసరం రాకుండా బయటే నిలిచిపోతాయి. అక్కడి నుండి ప్రయాణికులు ఎంఎంటీఎస్‌/మెట్రో ద్వారా నగరంలోకి చేరుకోవచ్చు. ఇది హైదరాబాద్‌ రవాణా ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేయడమే కాకుండా రాబోయే 50 ఏళ్ల ట్రాఫిక్‌ డిమాండ్‌ను తట్టుకుంటుందని రైల్వే ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు 

పశ్చిమ ద్వారం– నాగులపల్లి
»  శంకర్‌పల్లి సమీపంలోని ఔటర్‌ రింగ్‌ రోడ్‌ను అనుకుని ఉన్న ఈ స్టేషన్‌ను అదనంగా 325–500 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తారు. ఇది పూర్తయితే హౌరా, సీల్దా తర్వాత భారతదేశంలోనే మూడో అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా అవతరిస్తుంది.
» ఇక్కడ 20 ప్లాట్‌ఫామ్‌లు, 14 పిట్‌ లైన్లు, 24 స్టాబ్లింగ్‌ లైన్లను ప్రతిపాదించారు.
» ముంబై, పుణె, కర్ణాటకలోని ప్రాంతాలవైపు వెళ్లే ప్రయాణికులకు ఇది పశ్చిమ ద్వారంగా మారుతుంది. ఐటీ కారిడార్‌ ప్రజలకు సికింద్రాబాద్‌ వెళ్లే శ్రమ తప్పుతుంది.

దక్షిణ ద్వారం–జూకల్‌ టెర్మినల్‌
» శంషాబాద్‌ విమానాశ్రయానికి సమీపంలో, ఉందానగర్‌ దాటిన తర్వాత దాదాపు 300 ఎకరాల్లో ఈ టెర్మినల్‌ రూపుదిద్దుకోనుంది.
» ఇక్కడ 18 ప్లాట్‌ఫామ్‌లు, 12 పిట్‌ లైన్లు, 20 స్టాబ్లింగ్‌ లైన్లు ఏర్పాటు కానున్నాయి. ఇది దేశంలోని పెద్ద టెర్మినళ్లలో ఐదో స్థానంలో నిలుస్తుంది.
» బెంగళూరు, తిరుపతి, చెన్నై తదితర రూట్లలో తిరిగే రైళ్లకు ఇది ప్రధాన స్టేషన్‌గా మారుతుంది.

ఉత్తరద్వారం– డబీల్‌పురా టెర్మినల్‌
»  ఇది మేడ్చల్‌ దాటిన తర్వాత ఉత్తర తెలంగాణ మార్గంలో ఉన్న చిన్న స్టేషన్‌. 
»  మనోహరాబాద్‌ రైల్వే జంక్షన్‌ సమీపంలో ఉత్తర దిశగా 250 ఎకరాల విస్తీర్ణంలో దీనిని ప్లాన్‌ చేశారు.
» నిజామాబాద్, నాందేడ్, షిరిడీ, ఢిల్లీ తదితరæ మార్గాల నుంచి వచ్చే రైళ్లకు ఇది ప్రధాన జంక్షన్‌ అవుతుంది. దీనికోసం రూ. 2,867 కోట్లతో కోచింగ్‌ డిపోల సమగ్ర మెయింటెనెన్స్‌ ఫెసిలిటీస్‌ కూడా ప్రతిపాదించారు.

సీఎస్‌కు వివరించిన జీఎం
ఈ మూడు టెర్మినళ్లకు సంబంధించి 1,125 ఎకరాల భూ సేకరణకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఇప్పటికే రైల్వే అధికారులు రాష్ట్రప్రభుత్వాన్ని కోరారు.ఫైనల్‌ లొకేషన్‌ సర్వేలో ఈ మొత్తం 1500 ఎకరాల వరకు చేరుకుంటుందని భావిస్తున్నారు. సోమవారం దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజుతో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంయుక్తంగా చేపట్టే రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. ఈ సందర్భంగా ఈ మూడు టెర్మినళ్ల ప్రతిపాదనలో ఉన్న పురోగతిని వివరించారు. ఫైనల్‌ లొకేషన్‌ సర్వే కోసం లేఖ రాసినందున, ఆ స్టేషన్ల వద్ద కావాల్సిన భూమిని సేకరించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement