
వైద్య విద్యలో విప్లవాత్మక మార్పులకు ఎన్‌ఎంసీ శ్రీకారం
మెడికల్ ఇన్‌స్టిట్యూషన్స్ రెగ్యులేషన్స్–2025 విడుదల
దేశవ్యాప్తంగా 75 వేల వైద్య సీట్ల లక్ష్యం నెరవేరే దిశగా కొత్త నిబంధనలు
బోధనా సిబ్బంది అర్హతలకు సంబంధించి కీలక మార్పులు
గెజిట్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: దేశంలో వైద్య విద్య సామర్థ్యాన్ని విస్తరించి, బోధనా సిబ్బంది (ఫ్యాకల్టీ) కొరతను అధిగమించే దిశగా నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) కీలక నిర్ణయం తీసుకుంది. మెడికల్ ఇన్‌స్టిట్యూషన్స్ (ఫ్యాకల్టీ అర్హతలు) రెగ్యులేషన్స్–2025 పేరుతో రూపొందించిన కొత్త నిబంధనలను శనివారం ఢిల్లీలో విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ కూడా విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 75 వేల కొత్త వైద్య సీట్ల లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ఈ నిబంధనలు ఉపపయోగపడనున్నాయి. ముఖ్యంగా బోధనా సిబ్బంది కొరత కారణంగా కొత్త కాలేజీలకు అనుమతులు నిలిచిపోతున్న నేపథ్యంలో ఎన్‌ఎంసీ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా వైద్య విద్యా వ్యవస్థను తిరుగులేని దిశగా నడిపిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త నిబంధనలలో ముఖ్యమైన మార్పులు ఇలా..
ఆ ప్రభుత్వ దవాఖానాలకూ బోధనా హోదా
దేశవ్యాప్తంగా 220 పడకల కంటే ఎక్కువ ఉన్న నాన్–టీచింగ్ ప్రభుత్వ దవాఖానలను కూడా బోధనా ఆసుపత్రులుగా గుర్తించవచ్చు. ఇక్కడ పనిచేస్తున్న 10 సంవత్సరాల అనుభవం ఉన్న నిపుణులను అసోసియేట్ ప్రొఫెసర్, 2 సంవత్సరాల అనుభవం ఉన్నవారిని అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమించుకోవచ్చు. కానీ వీరు రెండేళ్లలో ‘బేసిక్ కోర్స్ ఇన్ బయోమెడికల్ రీసెర్చ్ (బీసీబీఆర్)’పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న అనుభవజ్ఞులైన నిపుణుల సేవలు విద్యారంగానికి కూడా అందుబాటులోకి వస్తాయి. తాజా నిబంధనలతో ఇకపై దేశ వ్యాప్తంగా అధికారికంగా ప్రభుత్వ దవాఖానాలు బోధనాసుపత్రులుగా మారేందుకు అవకాశం ఏర్పడింది.
యూజీ, పీజీ కోర్సులు ఒకేసారి ప్రారంభించుకునే చాన్స్
ఇప్పటివరకు మెడికల్ కాలేజీలు తొలుత ఎంబీబీఎస్ కోర్సు ప్రారంభించిన తర్వాతే ఎండీ/ఎంఎస్ వంటి పీజీ కోర్సులను ప్రారంభించేవి. ఇకపై నూతన ప్రభుత్వ మెడికల్ కళాశాలలు యూజీతో పాటు పీజీ కోర్సులను కూడా ఒకేసారి ప్రారంభించవచ్చు. ఇది వైద్యుల కొరత తీర్చడంలో సహాయపడుతుందని ఎన్‌ఎంసీ పేర్కొంది.
పీజీకి కొన్ని మినహాయింపులు
ఇప్పటివరకు పీజీ కోర్సు ప్రారంభించాలంటే ముగ్గురు ఫ్యాకల్టీ, ఒక సీనియర్ రెసిడెంట్ ఉండాలి. కొత్త నిబంధనల ప్రకారం, కేవలం ఇద్దరు ఫ్యాకల్టీ, 2 సీట్లతో కోర్సును ప్రారంభించవచ్చు. కొన్ని స్పెషాలిటీ విభాగాల్లో బెడ్ అవసరాలు కూడా తగ్గించారు, తద్వారా చిన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా పీజీ కోర్సుల నిర్వహణ సాధ్యమవుతుంది. సూపర్ స్పెషాలిటీ కోర్సులకు అనువైన బ్రాడ్ స్పెషాలిటీ విభాగాల పరిధి పెంచారు. దీని ద్వారా ఇప్పటికే ఉన్న ఫ్యాకల్టీని సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో వినియోగించుకోవడం సులభమవుతుంది.
ఎంఎస్‌సీ–పీహెచ్‌డీ అర్హత గల వారు ఇతర విభాగాలకు..
ఇప్పటివరకు అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ విభాగాల్లో మాత్రమే ఎంఎస్‌సీ – పీహెచ్‌డీ విద్యార్హత గల వారిని ఫ్యాకల్టీగా నియమించేవారు. ఇప్పుడు మైక్రోబయాలజీ, ఫార్మకోలజీ విభాగాలకూ ఇది వర్తిస్తుందని ఎన్‌ఎంసీ తెలిపింది. అలాగే అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, కమ్యూనిటీ మెడిసిన్ వంటి ప్రీ క్లినికల్, పారా క్లినికల్ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ పదవికి గరిష్ట వయో పరిమితిని 50 ఏళ్లకు పెంచారు.
దేశ వ్యాప్తంగా వైద్య విద్య విస్తరణకు దోహదం
‘ఈ నూతన నిబంధనలు వైద్యుల నైపుణ్యాన్ని, అనుభవాన్ని, విద్యార్హతను ప్రధానంగా తీసుకొని రూపుదిద్దుకున్నాయి. కఠినమైన సేవా ప్రమాణాలకు బదులుగా ఫ్యాకల్టీ ఎంపికలో ప్రా మాణికత, అనుభవానికి ప్రాధాన్యత ఇవ్వడం ఈ నిబంధనల మార్పులోని ప్రధాన, బలమైన అంశం. ఇది మెడికల్ విద్యా రంగంలో గొప్ప విప్లవానికి నాంది పలకనుంది. ప్రస్తుతం దేశంలో పట్టణాలకే పరిమితమైన వైద్య విద్య అవకాశాలు, నూతన నిబంధనల వల్ల వెనుకబడిన ప్రాంతాల్లో కూడా విస్తరించనున్నాయి. ప్రజలకు సమగ్ర ఆరోగ్య సేవలు అందించేందుకు ఇది పునాది అవుతుంది..’అని ఎన్‌ఎంసీ పేర్కొంది.