
ప్రసంగం కొనసాగించాలని మంత్రి జూపల్లికి విజ్ఞప్తి చేస్తున్న అధికారులు, ఉపాధ్యాయులు
ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి టీచర్ల గైర్హాజరుపై మంత్రి అసంతృప్తి
ప్రసంగించకుండానే సన్మానాలతో ముగించిన జూపల్లి
సాక్షి, నాగర్‌కర్నూల్: ‘జిల్లాలో సుమారు 3,600 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు. ఉపాధ్యాయుల కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి 800 మంది టీచర్లు కూడా రాలేదు. మీరంతా ఎప్పుడు వస్తారో.. అప్పుడే కార్యక్రమంలో మాట్లాడతాను’అంటూ ప్రభుత్వ ఉపాధ్యాయుల తీరుపై మంత్రి జూపల్లి కృష్ణారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రంలో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కార్యక్రమానికి తక్కువ సంఖ్యలో ఉపాధ్యాయులు హాజరుకావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు హాజరయినప్పుడే తన సందేశం వారికి చేరుతుందన్నారు. ‘15 రోజుల్లో మరోసారి కార్యక్రమం నిర్వహించండి. జిల్లాలోని ఉపాధ్యాయులందరూ రావాలి. అప్పుడే మాట్లాడుతాను.
ఉపాధ్యాయులపై నాకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది. కానీ టీచర్లు నిబద్ధతతో పనిచేయాలి’అని అన్నారు. ప్రసంగాన్ని కొనసాగించాలని అధికారులు విజ్ఞప్తి చేసినా మంత్రి అంగీకరించలేదు. అనంతరం జిల్లాస్థాయి ఉత్తమ టీచర్లుగా ఎంపికైన 52 మందిని సన్మానించారు.