ప్రేమోన్మాది మణితేజ మృతి | Jilted Lover Dies In Mob Attack After Killing Woman In Jadcherla | Sakshi
Sakshi News home page

ప్రేమోన్మాది మణితేజ మృతి

May 18 2026 6:03 AM | Updated on May 18 2026 10:47 AM

Jilted Lover Dies In Mob Attack After Killing Woman In Jadcherla

స్థానికుల దాడిలో తీవ్రగాయాలు

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

జడ్చర్ల: మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లకు చెందిన వైష్ణవిని కత్తితో అతి కిరాతకంగా హత్య చేసిన ప్రేమోన్మాది మణితేజ (29) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. శనివారం వైష్ణవి తాను పనిచేస్తున్న పాఠశాలలో విధులు ముగించుకుని నిమ్మబాయిగడ్డ ప్రాంతంలో బస్సు దిగి ఇంటికి వెళ్తుండగా నిందితుడు కత్తితో దారుణంగా మెడ, గొంతుపై విచక్షణా రహితంగా పొడిచి హత్య చేసిన విషయం తెలిసిందే. రక్తం మరకలతో పారిపోతున్న మణితేజను స్థానికులు పట్టుకుని కాళ్లు చేతులు కట్టి వేసి దేహశుద్ధి చేశారు. ఈ క్రమంలో అతని తలపై రాళ్లు ఎత్తివేయడంతో తీవ్రగాయాలై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన మణితేజను మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతిచెందాడు. 

హైదరాబాద్‌లో పరిచయం.. 
హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు చెందిన మణితేజ ల్యాండ్రీ షాప్‌ నిర్వహించేవాడు. గతంలో వైష్ణవి ఓ హాస్టల్‌లో ఉద్యోగం చేస్తున్న సమయంలో విద్యార్థుల దుస్తులు ఉతికి, ఇస్త్రీచేసి అప్పగించే సందర్భంగా ఆమెతో పరిచయం ఏర్పడింది. తర్వాత వైష్ణవి అక్కడ ఉద్యోగం మానేసినా ఫోన్‌లో ఇద్దరూ మాట్లాడుకునేవారు. ఈ క్రమంలోనే తాను ప్రేమిస్తున్నట్లు వైష్ణవిని వేధింపులకు గురిచేసినట్లు తెలిసింది. అయితే ఇటీవల వైష్ణవికి వెళ్లి కుదిరిందన్న సమాచారం తెలియడంతో మణితేజ తన ప్రేమను కాదన్న వైష్ణవిని హతమార్చాలని నిర్ణయించుకుని.. జడ్చర్లకు వచ్చి ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం.

కాగా, మణితేజ తండ్రి గతంలోనే మరణించగా.. తల్లి, తమ్ముడు ఉన్నారు. హత్య అనంతరం వైష్ణవి మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు యువకుడి ఆచూకీని గుర్తించారు. అనంతరం అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మణితేజ మృతి చెందాడని తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు, బంధువులు హైదరాబాద్‌ నుంచి జడ్చర్లకు వచ్చారు. ఈ క్రమంలో వైష్ణవి కుటుంబ సభ్యులు, బంధువులు వారిపై దాడిచేస్తారన్న అనుమానంతో పోలీసులు వారిని జడ్చర్ల సమీపంలోని డీటీసీలో ఉంచి రక్షణ కల్పించారు. అప్పటి దాకా మణితేజ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించలేదు. జడ్చర్లలో వైష్ణవి మృతదేహానికి అంత్యక్రియలు పూర్తయిన తర్వాత జనరల్‌ ఆస్పత్రిలో మణితేజ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement