సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు విమానాశ్రయం ట్రీట్‌మెంట్‌ 

IRSDC to Maintain Secunderabad Railway Station, Improving Amenities - Sakshi

రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో భారీ ప్లాన్‌

ఈనెలాఖరుకు ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్‌ విడుదల

పట్టాలుండే భాగం తప్ప పూర్తిగా కొత్త రూపు

లక్ష చదరపు మీటర్ల పరిధిలో మూడంతస్తుల భారీ భవన సముదాయం

పై అంతస్తులన్నీ ప్రైవేట్‌కే.. ఆదాయ పంపకం విధానం త్వరలో ఖరారు 

సాక్షి, హైదరాబాద్‌: సరుకు రవాణా ద్వారా భారీ ఆదాయాన్ని సమకూర్చుకుంటూ.. ప్రయాణికుల రైళ్లతో చేతులు కాల్చుకుంటున్న రైల్వే.. పాత విధానాలను సమూలంగా మార్చే దిశగా అడుగులు వేస్తోంది. నేరుగా కాకుండా పరోక్షంగా ప్రైవేటీకరణ దిశగా పరుగుపెట్టించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా పెద్ద రైల్వే స్టేషన్లను ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టి వాణిజ్యపరంగా ఆదాయాన్ని పొందేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇందులో భాగంగా రైల్వేకు అనుబంధంగా ఏర్పాటైన ఇండియన్‌ రైల్వే స్టేషన్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఆర్‌ఎస్‌డీసీ) ఈ నెలలోనే కార్యాచరణ ప్రారంభిస్తోంది. ఇందులో భాగంగా సికింద్రాబాద్‌ స్టేషన్‌ రీడెవలప్‌మెంట్‌ ప్రణాళికను ఇప్పుడు తెరపైకి తెస్తున్నారు. ఇందుకు గాను ఆసక్తివ్యక్తీకరణ (ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌) నోటిఫికేషన్‌ను ఈ నెలలోనే పిలవబోతున్నారు.  

సేవల విస్తరణ కంటే ఆదాయంపైనే దృష్టి.. 
దాదాపు ఐదున్నర ఎకరాల స్థలంలో లక్ష చదరపు మీటర్ల మేర నిర్మాణం రూపుదిద్దుకోనుంది. ఇక్కడ స్థలం లేక.. ఉన్న పది ప్లాట్‌ఫామ్‌లకు అదనంగా కొత్తవి ఏర్పాటు చేయలేకపోయారు. ఇప్పుడు కొత్త నిర్మాణంలో కూడా ఆ సంఖ్య పెరగదు. అంటే రైలు ప్రయాణానికి సంబంధించిన సేవల విస్తరణ ఉండదు. వెరసి రైలు ప్రయాణికుల సేవల కంటే ఆదాయం పెంచుకోవడంపైనే రైల్వే ఈ ప్రాజెక్టులో దృష్టి సారించింది. గతంలో రైల్వే అధికారులు పీపీపీ పద్ధతిలో రీడెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు కోసం రెండుసార్లు టెండర్లు పిలవగా స్పందన రాలేదు.

ఇక అలా లాభం లేదని, కేవలం ఈ ప్రాజెక్టును పర్యవేక్షించేందుకే ప్రత్యేక వ్యవస్థ ఉండాలన్న ఉద్దేశంతో ఐఆర్‌ఎస్‌డీసీని ఏర్పాటు చేసింది. దీంతో కొత్త పంథాలో దీనికి ప్రణాళిక సిద్ధం చేస్తోంది. నిర్మాణం, రైల్వేకు ఆదాయం, ఎంతకాలం లీజు.. తదితర వ్యవహారాలకు సంబంధించి కొత్త విధానాన్ని ప్రారంభించనుంది. దీనికోసమే ఆసక్తివ్యక్తీకరణ నోటిఫికేషన్‌ విడుదల చేస్తోంది. అందులో ముందుకొచ్చే సంస్థలతో సంప్రదింపులు జరిపి కొత్త విధానాన్ని ఖరారు చేయనుంది.  

మెట్రో రైలుతో అనుసంధానం... 
కొత్త ఆలోచనలో మెట్రో రైలును కూడా చేర్చనున్నారు. ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌ వైపు, పదో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌ వైపు ప్రత్యేకంగా మెట్రో రైలుతో అనుసంధానం చేయనున్నారు. సాధారణ రైలు దిగిన ప్రయాణికులు నేరుగా ఎస్కలేటర్‌ ద్వారా పక్కనే ఉన్న మెట్రో రైలు స్టేషన్‌లోకి చేరుకుంటారు. అక్కడ మెట్రో రైలు ఎక్కి గమ్యస్థానం వైపు వెళ్తారు. దీనికి సంబంధించి వారం రోజుల క్రితం ఐఆర్‌ఎస్‌డీసీ ఎండీ మెట్రో రైలు అధికారులతో భేటీ అయ్యారు. అలాగే జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలతో కూడా కలిసి పనిచేయనున్నట్లు వారు పేర్కొంటున్నారు.
  
నిర్వహణ భారం రైల్వేపై పడకుండా.. 
ప్రస్తుతం రైళ్లు, రైల్వేస్టేషన్ల నిర్వహణ అంతా రైల్వే శాఖనే చూస్తోంది. ఇక భవిష్యత్‌లో ఆ భారాన్ని పూర్తిగా వదిలించుకోనుంది. ప్రతిపాదిత స్టేషన్ల నిర్వహణ ఖర్చంతా ఐఆర్‌ఎస్‌డీసీనే చూస్తుంది. వాణిజ్యపరంగా స్టేషన్‌ను అభివృద్ధి చేసి భారీగా ఆదాయం పొందుతూ అందులో నుంచే ఖర్చును వెళ్లదీస్తుంది. అది పోనూ సాలీనా రైల్వేకు భారీ ఆదాయాన్ని ముట్టజెపుతుంది. దీనికి తగ్గ విధానాన్ని ఇప్పుడు ఖరారు చేయనున్నారు. ప్రస్తుతానికి తెలంగాణలో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను మాత్రమే దీని ప్రకారం అభివృద్ధి చేయనుండగా, ఆ తర్వాత నాంపల్లి, కాచిగూడ, బేగంపేట, లింగంపల్లి, కాజీపేట, వరంగల్, తాండూరు, వికారాబాద్, మహబూబాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, రామగుండం, భద్రాచలం, ఖమ్మం తదితర స్టేషన్లను అధీనంలోకి తీసుకోనుంది.

 

ఇలా చేస్తారు.. 

  • ప్రస్తుతమున్న రాతి కట్టడం ఎలివేషన్‌ను అలాగే ఉంచుతూ దాని మీదుగా మూడంతస్తులో భారీ భవన సముదాయం నిర్మితమవుతుంది.  
  • ప్లాట్‌ఫామ్‌ నం.1 ముందువైపు ఉండే ఖాళీ స్థలం, ప్లాట్‌ఫామ్‌ నం.10 వైపు ఉండే ఖాళీ స్థలాలను కలుపుతూ భారీ భవన సముదాయాన్ని నిర్మిస్తారు.
     
  • దీనికి పూర్తిగా విమానాశ్రయాల ప్రణాళికను అమలు చేయనున్నారు. అరైవల్, డిపార్చర్‌కు విడివిడి సెక్షన్లు ఉంటాయి.  
  • భవనానికి దిగువన 450 వాహనాలు నిలిపేలా భారీ పార్కింగ్‌తో సెల్లార్‌ నిర్మిస్తారు. 
     
  • ప్రస్తుతం రైలు ట్రాక్‌పైన పూర్తి ఖాళీగా ఉంది. కొత్త ప్రణాళికలో.. అవి భవనం లోపలకు చేరతాయి. అంటే ట్రాక్‌ పైభాగంలో కూడా నిర్మాణం ఉంటుంది.  
  • టికెట్‌ కౌంటర్లు సహా ప్రయాణికులతో ముడిపడి ఉన్న ఇతర కార్యకలాపాలకు సంబంధించి వేర్వేరుగా ప్రాంగణాలు ఉంటాయి. ఇవన్నీ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉంటాయి. విమానాశ్రయంలోకి వెళ్లగానే ఉండే తరహా సెటప్‌ ఉంటుంది.  
     
  • పైఅంతస్తులు పూర్తిగా వాణిజ్యపరంగా అభివృద్ధి చేస్తారు. సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, గేమింగ్‌ జోన్, దుకాణ సముదాయాలు, ఇతర వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించిన ఏర్పాట్లు ఉంటాయి.  
  • ప్రస్తుతం సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ఉన్న 10 ప్లాట్‌ఫామ్‌ల సెటప్‌ మాత్రమే ఉంటుంది. మిగతా అంతా మారిపోతుంది. 

చదవండి:
ఇంటర్‌లో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌

తెలంగాణలో చాప కింద నీరులా కరోనా

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top