ఐపీఎల్ బెట్టింగ్‌.. సజ్జనార్‌ వార్నింగ్ | IPL Cricket Season: CP Sajjanar Warns Betting Gangs | Sakshi
Sakshi News home page

ఐపీఎల్ బెట్టింగ్‌.. సజ్జనార్‌ వార్నింగ్

Mar 28 2026 3:31 PM | Updated on Mar 28 2026 3:52 PM

IPL Cricket Season: CP Sajjanar Warns Betting Gangs

సాక్షి, హైదరాబాద్‌: ఐపీఎల్ క్రికెట్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో నగరంలో బెట్టింగ్ ముఠాలకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.  క్రికెట్ క్రీడను జూదంగా మార్చి అమాయకుల జీవితాలతో ఆడుకునే వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. గతంలో చేపట్టిన #SayNoToBettingApps ప్రచారానికి ప్రజల నుంచి అద్భుతమైన మద్దతు లభించిందన..  తద్వారా కేంద్ర ప్రభుత్వం వందలాది బెట్టింగ్ యాప్‌లను నిషేధించడమే కాకుండా కఠినమైన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లును కూడా తీసుకువస్తోందన్నారు

అయితే ప్రస్తుతం ఈ వంచన కొత్త రూపం దాల్చిందని.. యాప్‌లు పోయినా టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల వేదికగా కొత్త వెబ్‌సైట్లను సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. కేవలం ఆన్‌లైన్ మాత్రమే కాకుండా, నివాస గృహాలు, ఫామ్ హౌస్‌లు, ఇతర రహస్య స్థావరాల్లో గుంపులుగా చేరి ఫోన్ల ద్వారా ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లు నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. స్థానిక బుకీలు యువతను అప్పుల ఊబిలోకి నెడుతున్నారని, ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు.

తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశ చివరికి కన్నీళ్లే మిగిలిస్తుందని, బెట్టింగ్‌లో గెలిచేది కేవలం నిర్వాహకులు మాత్రమేనని, ఆడేవారు సర్వస్వం కోల్పోతారని హెచ్చరించారు. ఒక్కసారి ఈ వ్యసనానికి బానిసలైతే కుటుంబాలు రోడ్డున పడతాయని, క్రికెట్‌ను ఒక క్రీడగా ఆస్వాదించాలి తప్ప జూదంగా మార్చుకోవద్దని హితవు పలికారు.

యువతను ఈ బెట్టింగ్ భూతం నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని,  పరిసరాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిస్తే లేదా మిమ్మల్ని వేధిస్తున్నా వెంటనే డయల్ 100కు గానీ, హైదరాబాద్ పోలీస్ వాట్సాప్ నంబర్ 94906 16555కు గానీ సమాచారం అందించాలని కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement