రేప్‌ చేసి ఉరివేశారు? | Incidnt in a tanda in Rayaparthi mandal | Sakshi
Sakshi News home page

రేప్‌ చేసి ఉరివేశారు?

Apr 10 2026 4:42 AM | Updated on Apr 10 2026 4:42 AM

Incidnt in a tanda in Rayaparthi mandal

యువతి బంధువుల ఆరోపణ 

రాయపర్తి మండలంలోని ఓ తండాలో గ్యాంగ్‌రేప్‌ కలకలం

నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ 

రాయపర్తి/వర్ధన్నపేట: వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలంలోని ఓ తండాలో గురువారం గ్యాంగ్‌రేప్‌ కలకలం రేపింది. తల్లిదండ్రులు, బంధువుల కథనం ప్రకారం.. ఓ తండాకు చెందిన గిరిజన దంపతులకు కుమారుడు, కూతురు (21) ఉన్నారు. తల్లిదండ్రులు బతుకుదెరువుకోసం హైదరాబాద్‌లో ఉంటుండగా కుమారుడు మధ్యప్రదేశ్‌లో పోస్టుమ్యాన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. యువతి తన ఇంట్లో ఉంటోంది. పక్కనే పెద్దనాన్న ఇల్లు ఉండగా ఏదైనా అవసరం ఉంటే ఆ కుటుంబ సభ్యులతో చెప్పేది. నర్సంపేటలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఆ యువతి నర్సు(ఏఎన్‌ఎం)గా శిక్షణ పొందుతోంది.

తండానుంచి నర్సంపేటకు వస్తూ పోతున్న క్రమంలో పర్వతగిరి మండలం రావూరు తండాకు చెందిన కొంతమంది యువకులు తరుచూ వెంటపడుతుండేవారని తన పెద్దనాన్న కుటుంబ సభ్యులతో సదరు యువతి చెప్పేది. బుధవారం రాత్రి యువతి పెద్దనాన్న ఇంట్లో కాకుండా తన ఇంట్లో పడుకుంది, ఉదయం చూడగా ఉరేసుకుని కనిపించింది. ఈ క్రమంలో తల్లిదండ్రులతోపాటు బంధువులు సదరు యువతిని పక్కనే ఉన్న మొక్కజొన్న చేనులో రావూరుకు చెందిన నలుగురు యువకులు గ్యాంగ్‌ రేప్‌ చేసి ఇంట్లో ఉరివేసి వెళ్లారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ముత్యం రాజేందర్‌ తెలిపారు.  

పోలీసులు పట్టించుకోవడం లేదని ఆందోళన.. 
పోలీసులు యువతి మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం వర్ధన్నపేటకు తీసుకురాగా కుటుంబ సభ్యులు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. యువతిపై గ్యాంగ్‌ రేప్‌ చేయడం వల్లనే మృతిచెందిందని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వర్ధన్నపేట సీఐ శ్రీనివాసరావు, ఎస్సై సాయిబాబు ఆందోళనకారులను నచ్చచెప్పి న్యాయం చేస్తామనిచెప్పడంతో ఆందోళన విరమించారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించి మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

Advertisement
 
Advertisement
Advertisement