కిరాణా షాపు.. బడ్డీ కొట్టు | Illegal Liquor Belt Shops in Rural and Urban Areas: Telangana | Sakshi
Sakshi News home page

కిరాణా షాపు.. బడ్డీ కొట్టు

May 2 2026 3:51 AM | Updated on May 2 2026 3:51 AM

Illegal Liquor Belt Shops in Rural and Urban Areas: Telangana

ఖమ్మం జిల్లా సిరిపురం గ్రామంలోని ఓ బెల్టు షాపు

ఎక్కడ పడితే అక్కడ.. ఎప్పుడు పడితే అప్పుడు ఫుల్లు కిక్కు 

ప్రతి పల్లె, ప్రతి వీధిలో బెల్టు షాపులు.. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు

వైన్స్‌ సిండికేట్ల కనుసన్నల్లో అధిక రేట్లతో అనధికార దందా

ఒక్కో క్వార్టర్‌కు, బీరు సీసాకు రూ.50 అదనంగా వసూలు

ఒక్కో మండలంలో 100 నుంచి 200 వరకు దుకాణాలు

కొన్నిచోట్ల ఒక్కరోజులోనే రూ.లక్షకు పైగా విలువైన విక్రయాలు

మద్యం సులభంగా అందుబాటులో ఉండటంతో విచ్ఛిన్నమవుతున్న కుటుంబాలు.. బానిసలవుతున్న యువత

టార్గెట్ల ఒత్తిడి, మామూళ్లతో ఎక్సైజ్‌ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు

కొన్ని గ్రామాల్లో బెల్టు షాపులు, మద్యపానంపై ప్రజలే స్వచ్ఛందంగా నిషేధం విధించుకుంటున్న వైనం

ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో 220, ఖమ్మం జిల్లాలోని వైరా మండలంలో 200 కంటే ఎక్కువగా, జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండల పరిధిలో 190 వరకు బెల్టుషాపులు ఉన్నాయి

నల్లగొండ జిల్లాలోని చిట్యాల, యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్‌ (ఎం) మండలాల్లో  100 చొప్పున, సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలో 120కి పైగా బెల్టుషాపులు నడుస్తున్నాయి.

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పరిధిలోని ప్రతి గ్రామ పంచాయతీలో 10–15 బెల్టుషాపులున్నాయి. ఇక్కడ ఒక్కో బెల్టుషాపులో రోజుకు లక్ష రూపాయలకు పైగా విలువైన మద్యం విక్రయాలు జరుగుతున్నట్టు అంచనా.

నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి, మోపాల్‌ మండలాల్లో వరుసగా 22, 18, 16 గ్రామాల్లో బెల్టు షాపులు ఉన్నాయి. ఆర్మూర్‌ మండలంలోని చాలా గ్రామాల్లో
24 గంటలూ మద్యం దొరుకుతోంది.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రతి పల్లె, ప్రతి వీధి, ప్రతి సెంటర్‌లో మద్యం బెల్టు షాపులు దర్శనమిస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా కిరాణా దుకాణాలు, బడ్డీ కొట్లు, చిన్న చిన్న దుకాణాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఉదయం పాల ప్యాకెట్లు అమ్మినట్టే, ఆ సమయాని కంటే ముందే ఈ బెల్టు షాపుల్లో క్వార్టర్‌ బాటిళ్లు, బీర్‌ సీసాలు దొరుకుతున్నాయంటే అతిశయోక్తి కాదు.

తెల్లవారుజామున మొదలుపెట్టి.. అర్ధరాత్రి 12 గంటలు దాటినా తలుపు కొట్టి అడిగిన వారికి కాదనకుండా కావాల్సిన బ్రాండ్‌ మద్యం అందుబాటులో ఉంటోంది. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో మండలంలో కనీసం 100 నుంచి 200 వరకు బెల్టు షాపులు ఉంటున్నాయంటే ఏ స్థాయిలో దందా జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. అడుగడుగునా అందుబాటులో ఉంటున్న బెల్టు షాపుల కారణంగా కుటుంబాలు, యువత నాశనమవుతున్నా పట్టించుకునే నాధుడే లేడని, టార్గెట్ల ఒత్తిడి, మామూళ్ల మత్తులో ఎక్సైజ్, పోలీస్‌ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

అధిక రేట్లతో అడ్డగోలు దోపిడీ..
    మద్యం కోసం ఎగబడేవారి నుంచి బెల్టు షాపుల యజమానులు అడ్డగోలు రేట్లు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం లైసెన్సు ఇచ్చి నడిపే మద్యం దుకాణాలు (వైన్స్‌) కంటే క్వార్టర్‌కు రూ.10 నుంచి రూ.40–50 వరకు అదనంగా చెల్లించాల్సిందే. బీరుకు కూడా రూ.20 నుంచి రూ.50 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. బెల్ట్‌షాపుల్లో ఎక్కువగా క్వార్టర్‌ బాటిళ్లే అమ్ముడవుతాయి.

వివిధ బ్రాండ్లకు సంబంధించి ఒక్కో క్వార్టర్‌ బాటిల్‌ మీద ఉన్న ఎమ్మార్పీ కంటే రూ.20 అధిక రేటుకు బెల్ట్‌ షాపులకు మద్యం సిండికేట్‌ అమ్ముతుంది. దీనిపై తన లాభంగా బెల్ట్‌షాప్‌ నిర్వాహకుడు మరో రూ.20 లేదా రూ.25ను కలిపి విక్రయిస్తాడు. అంటే క్వార్టర్‌ బాటిల్‌పై కనీసం రూ.40 అదనంగా చెల్లించాలన్న మాట. ఇక బీరు విషయానికి వస్తే ప్రస్తుతం వేసవి కావడంతో ఒక్కో బీరు బాటిల్‌కు ఎమ్మార్పీ ధర కంటే అదనంగా రూ.30 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తున్నారు.

ఎక్సైజ్‌..సైలెన్స్‌!
    అనధికారికంగా విస్తృత స్థాయిలో మద్యం విక్రయాలు జరుగుతున్నా ఎక్సైజ్‌ శాఖ పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. మద్యం అమ్మకాలకు సంబంధించిన లక్ష్యాలు సాధించాలంటే  గ్రామాల్లో మద్యం ఏరులై పారాల్సిందేనని కొందరు అధికారులే అంగీకరిస్తున్నారు. లేదంటే ఉన్నతాధికారుల నుంచి చీవాట్లు తప్పవని చెబుతున్నారు. మరోవైపు వైన్‌ సిండికేట్లు, బెల్టుషాపుల నిర్వాహకులు ఇచ్చే నెలవారీ మామూళ్ల వల్ల కూడా అధికారులు చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగానే పోలీసులు కూడా బెల్టుషాపుల జోలికి వెళ్లరనే విమర్శలున్నాయి.

వివిధ జిల్లాల్లో బెల్టు షాపులు ఇలా..
నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ఉదయం 6 గంటల నుంచే తెరుచుకుంటాయి. కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఒక్క వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఏరియాలోనే ఆరు బెల్టుషాపులున్నాయి. ముబారక్‌ నగర్, గౌతమ్‌ నగర్, అమలువాడి, పాములబస్తీ, పోచమ్మ గల్లీ, చంద్రశేఖర్‌ కాలనీ, కంటేశ్వర్‌ పూలన్‌చౌరస్తా, ఎల్లమ్మ గుట్ట, మిర్చి కాంపౌండ్‌ , నాందేవాడ తదితర ప్రాంతాల్లో బెల్టుషాపులున్నాయి. ఇక్కడ  గ్రామాభివృద్ధి కమిటీలకు ఏడాదికి రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు చెల్లిస్తున్నట్టు సమాచారం. ఒక్క రెంజల్‌ మండల కేంద్రంలోనే 16 బెల్టుషాపులున్నాయి. దోమకొండ మండలంలోని బెల్టుషాపుల్లో ఒక్కో బీరుపై రూ.50 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.

నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి, వెలిమినేడు, ఏపూరు, పేరేపల్లి గ్రామాల పరిధిలో పదుల సంఖ్యలో వివిధ రకాల పరిశ్రమలున్నాయి. ఈ పరిశ్రమల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన కారి్మకులు వేలాదిమంది పనిచేస్తున్నారు. వీరు ఎక్కువగా బెల్టుషాపులకు వచ్చి మద్యం కొనుగోలు చేస్తుంటారు. ఇదే జిల్లాలోని మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బెల్టుషాపుల మూసివేతకు కొంత చొరవ తీసుకున్నారు. ఇక్కడ కొంత నియంత్రించగలిగారు కానీ పూర్తిగా నిలిచిపోలేదు. ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేసి బార్లను తలపించేలా బెల్టు దుకాణాలు నడుపుతున్నారు. తాళ్లవెళ్లెంల, ఎలికట్టె తదితర గ్రామాల్లో పదుల సంఖ్యలో నడుస్తున్నాయి.

యాదాద్రి భువనగిరి జిల్లా  ఆత్మకూర్‌ (ఎం) మండల కేంద్రంలో ఉన్న రెండు వైన్‌షాపులు గ్రామాల్లో బెల్టుషాపుల కోసం పోటీలు పడుతుంటాయి. ఈ మండలంలో చాలాచోట్ల అర్ధరాత్రి 12 గటంల వరకు సిట్టింగ్‌లు సాధారణంగా మారాయి. జనావాసాల మధ్య రాయగిరి–మోత్కూర్‌ ప్రధాన రహదారి వెంట వీటిని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఫుల్‌బాటిల్‌కు రూ.150 వరకు అదనంగా తీసుకుంటున్నారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ప్రతి గ్రామంలో కిరాణం షాపులు, ఇతర వ్యాపార దుకాణాలు బెల్టుషాపులుగా మారిపోతున్నాయి. ఇక్కడ క్వార్టర్‌కు రూ.20 నుంచి రూ.30 వరకు అదనంగా తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో 4 వేల వరకు బెల్టుషాపులుంటాయని అంచనా. వరంగల్, కాజీపేట, హనుమకొండ ట్రైసిటీలో స్లమ్‌ ఏరియాల్లో బెల్టుషాపులు ఎక్కువగా ఉన్నాయి. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండల పరిధిలో ఒక క్వార్టర్‌పై రూ.30 నుంచి రూ.50 వరకు అదనంగా తీసుకుంటున్నారు.

ఖమ్మం జిల్లాలోని వైరా మున్సిపాలిటీ పరిధిలోనే 50కి పైగా బెల్టుషాపులు నడుస్తున్నాయి. వైరాలో వైన్‌షాప్‌ల సిండికేట్‌లు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. ఇక్కడ సిండికేట్‌ మొత్తం ఆబ్కారీ శాఖ కనుసన్నల్లోనే నడుస్తోందని సమాచారం. ప్రతి క్వార్టర్‌ బాటిల్‌పై వైన్‌షాపులు రూ.20, బెల్టుషాపులు మరో రూ.20 అదనంగా వేసి అమ్ముతున్నారు. నేలకొండపల్లి మండలంలో 150 వరకు బెల్టు షాపులున్నాయి. ప్రతి షాప్‌లో 10కి పైగా రకాల బ్రాండ్లు అందుబాటులో ఉంటున్నాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని కొత్తగూడెం టౌన్‌ పరిధిలోనే సుమారుగా 100, కొత్తగూడెం శివార్లలో 150, పాల్వంచ పరిధిలో మరో 150 వరకు కలిపి మొత్తం 400 బెల్టుషాపులున్నాయి. ఒక్కో బెల్ట్‌షాప్‌ నిర్వాహకుడు రూ.10 వేలు వైన్స్‌ సిండికేట్‌కు ఇస్తే మద్యం దుకాణాల నుంచి సరుకు ఇస్తారు.

కేసులు నమోదు చేస్తున్నాం
    బెల్ట్‌ షాపులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేదు. ఈ బెల్టుషాపులు మా దృష్టికి వచ్చినా, ఫిర్యాదు వచ్చినా కేసులు నమోదు చేస్తున్నాం. గత ఏడాది 22 కేసులు పెట్టాం. ఈ ఏడాది ఇప్పటివరకు ఆరు కేసులయ్యాయి. ఎప్పటికప్పుడు తనిఖీలు కూడా నిర్వహిస్తున్నాం.
– సంతోశ్, ఎక్‌పైజ్‌ సూపరింటెండెంట్, నల్లగొండ

బెల్టుషాపులు వద్దని తీర్మానం చేశాం:
మాది చిట్యాల మండలం ఏపూరు. మా గ్రామంలో పది వరకు బెల్టుషాపులుండేవి. యువత, కారి్మకులు మద్యానికి బానిసలవుతుండటంతో మహిళా సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. నేను సర్పంచ్‌ అయిన తర్వాత బెల్టుషాపుల నిర్వాహకులతో చర్చలు జరిపా. షాపులు నిర్వహించబోమని లిఖితపూర్వక హామీ తీసుకున్నా. ఈ మేరకు తీర్మానం చేసి అమలు చేస్తున్నాం.
– పాలెం మహేష్‌ గౌడ్, సర్పంచ్‌ (ఇదే మండలంలోని పేరేపల్లి, పెద్దకాపర్తి గ్రామాల్లో కూడా బెల్టుషాపులు వద్దంటూ ఇటీవల తీర్మానాలు చేశారు)

ఇస్తాలపురం.. అందరికీ ఆదర్శం
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌ (ఎస్‌) మండలంలోని ఇస్తాలపురంలో 2015 నుంచి బెల్టుషాపులు నడవడం లేదు. కుటుంబాలు ఛిద్రమవుతున్నాయన్న కారణంతో బెల్టుషాపులు ఊర్లో ఉండొద్దని గ్రామస్తులు తీర్మానం చేసుకున్నారు. దీంతో తమ సంసారాలు చక్కబడ్డాయని ఈ గ్రామ మహిళలు చెబుతున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం వెంగ్లాపూర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని గోనెపల్లి గ్రామస్తులు కూడా ఇటీవల స్వచ్ఛందంగా మద్యపాన నిషేధం ప్రకటించుకున్నారు. ఇదే విధంగా మరికొన్ని గ్రామాలు కూడా బెల్టుషాపుల్ని నిషేధిస్తూ తీర్మానం చేసుకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement