
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలు, కబ్జాలు చేసిన కట్టిన నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చి వేస్తున్నారు. తాజాగా నగరంలోని గాజులరామారంలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. దాదాపు 300 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమించారు. దీంతో, రంగంలోకి దిగిన హైడ్రా.. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది.
వివరాల ప్రకారం.. గాజులరామారంలో ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమించారు. 15వేల కోట్ల విలువైన భూమి ఆక్రమణకు గురికావడంతో దీనిపై హైడ్రాకు స్థానికులు ఫిర్యాదులు చేశారు. అనంతరం, హైడ్రా రంగంలోకి దిగి.. అక్కడ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. కబ్జాల చెర నుంచి 300 ఎకరాలకు పైగా భూమికి విముక్తి కల్పించారు. కబ్జాలు నిర్ధారించుకుని ఆదివారం ఉదయం నుంచి తొలగింపు పనులు చేపట్టారు. నివాసాల జోలికి వెళ్లకుండా ఆక్రమణల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. సర్వే నంబర్ 307లో 300 ఎకరాలకు పైగా ఉన్న భూమిలో ఆక్రమణలు తొలగించే పనిలో హైడ్రా అధికారులు ఉన్నారు. ప్రభుత్వ భూమికి కంచె వేస్తున్నారు.
ఇక, కబ్జాదారులు 60 నుంచి 70 గజాల్లో ఇళ్లను నిర్మించి రూ.10 లక్షల చొప్పున స్థానికులకు విక్రయించినట్టు అధికారులు గుర్తించారు. హైడ్రా కూల్చివేతల సందర్బంగా అక్రమార్కులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు బందోబస్తు మధ్య కూల్చివేతలు జరుగుతున్నాయి. హైడ్రా ఫుల్ ఫోర్స్ అక్కడే ఉండి కూల్చివేతల్లో నిమగ్నమైంది. మరోవైపు కూల్చివేతలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. తామంతా డబ్బులకు ఇళ్లను కొనుక్కున్నామని.. వాటిని అమ్మిన వాళ్లపై చర్యలు తీసుకోవాలంటూ చిన్న పిల్లలతో కలిసి జేసీబీ వాహనాలకు అడ్డుగా నిల్చొని నిరసన తెలిపారు.
కూకట్‌పల్లిలో హైడ్రా భారీ దాడులు 🚨 ₹15,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని భూ దోపిడీదారులు మరియు రాజకీయ కబ్జాదారుల నుండి తిరిగి పొందేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అలా ఎలా నొక్కేశారు రా ప్రభుత్వ భూమిని 🙏🏻 pic.twitter.com/RjghXUlTeT
— Vennela Kishore Reddy (@Kishoreddyk) September 21, 2025
ఇక, గాజులరామారం కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందిస్తూ.. కుత్బుల్లాపూర్‌లోని గాజులరామారం సర్వే నంబర్ 307లో 317 ఎకరాల ప్రభుత్వ భూముల్లో కబ్జాలను తొలగిస్తున్నాం. రెవెన్యూ డిపార్ట్మెంట్, హైడ్రా, పోలీస్ విభాగం సంయుక్తంగా భారీ స్థాయిలో ఆపరేషన్ చేపట్టింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, స్థానిక రాజకీయ నాయకులు, అధికారులు ఆక్రమించిన వందల ఎకరాలు ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటున్నాం. సుమారు 40 ఎకరాల్లో పేదలు నివసిస్తున్నారు. స్థానిక రాజకీయ నాయకులు పేదలకు 50, 100 గజాలుగా విక్రయించినట్లు విచారణలో బయటపడింది. ఈ విషయంపై గత ఆరు నెలల్లో అన్ని శాఖల అధికారులతో ఐదు సార్లు సమావేశాలు నిర్వహించి, ప్రభుత్వ అనుమతులు పొందిన తరువాతే ఈరోజు ఆపరేషన్ ప్రారంభమైంది.
పేదల ఇల్లు కూల్చవద్దని ఫీల్డ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. పొలిటీషియన్స్ , రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అధికారులు ఆక్రమించిన ల్యాండ్ మాత్రమే స్వాధీనం చేసుకుంటున్నారు. కమర్షియల్ షెడ్లు, కాంపౌండ్ వాల్‌లు, గదులు కట్టుకొని ఆక్రమించిన భూములను కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. కొందరికి ఇచ్చిన పత్రాలు ఫోర్జరీ చేసిన నకిలీ పత్రాలుగా బయటపడడంతో సంబంధిత అధికారులు వాటిని రద్దు చేస్తున్నారు. మొత్తం 275 ఎకరాల కంటే ఎక్కువ భూమిని తిరిగి స్వాధీనం చేసుకొని ఫెన్సింగ్ చేస్తాం. ఈ భూముల అంచనా విలువ 12 నుంచి 15 వేల కోట్లు ఉంటుంది అని తెలిపారు.
ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌కు 10 కి.మీ. దూరంలో ఉన్న గాజులరామారంలోని వందల ఎకరాల ప్రభుత్వ భూముల్లో పక్కా నిర్మాణాలు వెలిశాయి. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, టీజీఐఐసీ, హెచ్‌ఎండీఏ, హౌసింగ్‌బోర్డు విభాగాలకు దశాబ్దాల క్రితం అప్పటి ప్రభుత్వాలు భూములిచ్చాయి. ఆయా విభాగాలు తమ కార్యకలాపాలు ప్రారంభించకపోవడంతో కొందరు అక్రమార్కులు గత మూడు, నాలుగేళ్లుగా పథకం ప్రకారం భూములను కబ్జా చేస్తున్నారు. గాజులరామారంలోని ప్రభుత్వ స్థలాలను అక్కడున్న కొందరు చోటామోటా నేతలు క్రమంగా సొంతం చేసుకుంటున్నారు. మూడున్నరేళ్లలో ఏకంగా 103 ఎకరాల భూములు ఆక్రమించేశారు. ఈ ప్రాంతాల్లో ఎకరా మార్కెట్ విలువ రూ.40-50 కోట్ల వరకు ఉంటుంది.
