కళాశాలలు విస్తృతం.. మరింత నైపుణ్యం

Hyderabad: Govt Set Up To Increase Increase Medical Colleges - Sakshi

వైద్య విద్యా రంగంలో సంస్కరణల జోరు.. ఏడేళ్లలో దేశవ్యాప్తంగా 209 కొత్త వైద్య కళాశాలలు

2014తో పోల్చుకుంటే 54% వృద్ధి

కొత్త కాలేజీల్లో 25% అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లోనే..

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నివేదిక

సాక్షి, హైదరాబాద్‌: దేశ వైద్య విద్యా రంగంలో సంస్కరణల జోరు కొనసాగుతోంది. వైద్య కళాశాలలను విస్తృతం చేస్తూనే, విద్యార్థుల్లో నైపుణ్యాన్ని మరింత పెంపొందించేందుకు పాఠ్యాంశాల్లోనూ కేంద్రం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి ంది. నీట్‌ నిర్వహణ, ఫీజుల నియంత్రణ వంటి చర్యలతో అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా ముందుకు దూసుకెళ్తోంది.

2014లో దేశవ్యాప్తంగా 387 వైద్య కళాశాలలుండగా.. గత ఏడేళ్లలో వీటి సంఖ్య 54% వృద్ధి చెందింది. ప్రస్తుతం దేశంలో 596 వైద్య కళా శాలలున్నాయి. ఇందులో 313 ప్రభుత్వ కాలేజీలు కాగా, 283 ప్రైవేటువి. మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడేళ్ల కాలంలో వైద్య విద్యలో తీసుకొచ్చిన సంస్కరణలపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ ఒక నివేదిక విడుదల చేసింది. 

అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా..
అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న వైద్య వసతులకు దీటుగా భారత్‌ ముందుకు వెళ్తున్నట్లు నివేదిక చెబుతోంది. గత ఏడేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా కొత్తగా 209 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు కాగా, ఇందులో 73 శాతం ప్రభుత్వ, 37 శాతం ప్రైవేటు కాలేజీలున్నాయి. ప్రతి జిల్లాలో వైద్య కళాశాలల ఉండాలనే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కేంద్రం.. దేశవ్యాప్తంగా 157 మెడికల్‌ కాలేజీలను మంజూరు చేయగా, ఇందులో ఇప్పటికే 71 కాలేజీల్లో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. కొత్త కాలేజీల్లో 25 శాతం అత్యంత వెనుకబడ్డ ప్రాంతాల్లో ఏర్పాటు చేసేలా అనుమతులు జారీ చేసింది.

మొత్తం 89,875 వైద్య సీట్లు
► దేశంలో ప్రతి 10 వేల మంది జనాభాకు 11.7 డాక్టర్లు ఉన్నారు. దేశ జనాభాతో పోలిస్తే సగటున 834 మంది జనాభాకు ఒక డాక్టరు ఉన్నట్లు నివేదిక చెబుతోంది. 
► వైద్య కళాశాలల పెరుగుదలతో వైద్య సీట్లు సైతం భారీగా పెరిగాయి. 2014–15 నాటికి దేశవ్యాప్తంగా 57,138 ఎంబీబీఎస్‌ సీట్లు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 89,875కు చేరింది. అదేవిధంగా పీజీ సీట్లు కూడా పెరిగాయి. 
► ప్రస్తుతమున్న ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 10 వేల సీట్లు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా 15 రాష్ట్రాల్లోని 52 ప్రభుత్వ కాలేజీల్లో 3,495 సీట్లను ఇప్పటికే పెంచింది. 
► దేశంలో కొత్తగా 22 ఎయిమ్స్‌ల ఏర్పాటు, 75 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల అప్‌గ్రెడేషన్‌కు కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ఇందులో 19 కొత్త ఎయిమ్స్‌లను ఏర్పాటు చేసి 1,750 ఎంబీబీఎస్‌ సీట్లను అందుబాటులోకి తెచ్చింది. 
► మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ఎంసీఐ)లో మరిన్ని సంస్కరణలు తీసుకువచ్చిన కేంద్రం... దాని స్థానంలో నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 
► కొత్త మెడికల్‌ కాలేజీల ఏర్పాటును సులభతరం చేసింది. ఇదివరకు ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలంటే కనీసం 20 ఎకరాల స్థలం ఉండాలి. ఇప్పుడు 10 ఎకరాల స్థలం ఉన్నా చాలు. 750 పడకలతో ఆస్పత్రిని ఏర్పాటు చేయాల్సి ఉండగా..ఇప్పుడు 600కు కుదించింది. 
► వైద్య విద్యలో ప్రవేశానికి దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష.. నీట్‌ను ప్రవేశపెట్టింది. వైద్య విద్య బోధనలో స్కిల్‌ ల్యాబ్‌లకు ప్రాధాన్యత ఇచ్చింది. ఫీజుల నియంత్రణను నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ ద్వారా చట్టబద్ధం చేసింది. ప్రైవేటు కాలేజీల్లో 50 శాతం సీట్లకు సంబంధించిన ఫీజుల నియంత్రణ కమిషన్‌ పరిధిలోనే ఉంటుంది.
► వైద్య విద్య పాఠ్య ప్రణాళికలో మార్పులు తీసుకువచ్చింది. యూజీ విద్యార్థులకు సబ్జెక్టుతో కూడిన మార్కులతో పాటు యాటిట్యూడ్, కమ్యూనికేషన్‌కు కూడా మార్కులు కేటాయించింది. దీంతో విద్యార్థిలో నైపుణ్యం పెరుగుతుందని నివేదిక చెబుతోంది. కాలేజీల్లో నాణ్యత పెరిగేలా వాటి పనితీరు ఆధారంగా గ్రేడింగ్‌/ర్యాంకింగ్‌ ఇస్తోంది.  

   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top