రూ. 9675,67,35,596 | Sakshi
Sakshi News home page

రూ. 9675,67,35,596

Published Sat, Dec 23 2023 5:06 AM

Hyderabad city police annual report 2023 statistics revealed - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రూ. పదుల కోట్లు.. రూ. వందల కోట్లు కూడా కాదు... రూ. 9675,67,35,596! భాగ్యనగరంలో వైట్‌ కాలర్‌ కేటు­గాళ్లు బాధితుల నుంచి ఈ ఏడాది కొల్లగొట్టిన సొమ్ము విలువ ఇది!! హైదరాబాద్‌ నగర పోలీసు విభాగం శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 2023కు­గాను విడుదల చేసిన వివిధ నేరాల వార్షిక నివేది­కలో వైట్‌ కాలర్‌ నేరాల కేసులకు సంబంధించి ఈ ఆశ్చర్యకర గణాంకాలున్నాయి. బుధవారం వరకు నమోదైన కేసులు, లెక్కల ప్రకారం చూస్తే నేరాల్లో ప్రజలు కోల్పోయిన మొత్తం రూ. 9714,05,44,337గా ఉంది. ఇందులో వైట్‌ కాలర్‌ అఫెండర్స్‌గా పిలిచే మోసగాళ్లు, ఆర్థిక నేరగాళ్లు స్వాహా చేసిన మొత్తం రూ. 9675,67,35,596 (99.6 శాతం)గా తేలింది.

కారణాలు అనేకం...
శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ... ఇదీ వైట్‌కాలర్‌ నేరగాళ్ల తీరు. దొంగతనం, దోపిడీ వంటి నేరాలు చేయాలంటే దానికి భారీ తతంగం అవసరం. టా­ర్గె­ట్‌ను ఎంచుకోవడం, రెక్కీ చేయడం, పక్కా ప్ర­ణాళిక సిద్ధం చేసుకోవడం... ఇలా ఎన్నో ముందస్తు ప్రక్రియలు పూర్తి చేయాలి. ఇంత చేసినా ఆ నేరంలో సఫలీకృతం అవుతాడనే నమ్మకం లేదు. కొన్ని సందర్భాల్లో చేయడానికి ముందో, చేస్తూనో చిక్కే ప్రమాదం కూడా ఉంటుంది.

ఒకవేళ విజయవంతంగా నేరం చేసినా కొల్లగొట్టే సొత్తు విలువ త­క్కువే. దీంతో వైట్‌కాలర్‌ నేరగాళ్లు ఎదుటి వ్యక్తినో, వ్య­క్తుల్నో లేదా సంస్థనో పక్కాగా నమ్మించి మోస­గించే పంథాకు తెరతీస్తున్నారు. ఈ తరహా నేరాల్లో ‘ప్రతిఫలం’ రూ. కోట్లలో ఉంటుండటంతో వైట్‌కా­లర్‌ నేరగాళ్లు ఓపక్క నేరుగా, మరోపక్క ఆన్‌లైన్‌ ద్వారా అందినకాడికి దండుకుంటున్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరవాత సైబర్‌ నేరాలూ అదే స్థాయిలో పెరిగిపోయాయి.

చిక్కడం అరుదే....
సైబర్‌ నేరాలతోపాటు కొన్ని రకాలైన మోసా­లకు పాల్పడుతున్న నేరగాళ్లు చిక్కే అవ­కా­శాలు చాలా తక్కువగా ఉం­టు­న్నాయి. ఎవరికి ఫిర్యాదు చేయా­ల­న్నది సామాన్యులకు స్పష్టంగా తెలియ­క, కొన్నిసార్లు స్థానిక పోలీసుల నుంచి సరైన స్పందన లేక అనేక కేసులు నమోదు కావట్లేదు. రిజిస్టర్‌ అయినా సైబర్‌ నేరగాళ్లు తీసుకుంటున్న జాగ్రత్తలకు తోడు.. నేరాల దర్యాప్తులో అన్ని విభాగాల పోలీసులకు పట్టులేక కొలిక్కిరావట్లేదు. సైబర్‌ నేరాల్లో 30 శాతం కూడా కేసులు నమోదు కావట్లేదు. నమోదైన నేరాల్లో కూడా కొలిక్కి వస్తున్నవి 10 శాతానికి మించట్లేదు.

శిక్షలు తక్కువే..
వైట్‌కాలర్‌ నేరాల్ని దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులకు అవసరమైన స్థాయిలో ఇతర విభాగాల సహకారం లభించట్లేదు. కేసు నమోదు, దర్యాప్తు పూర్తై కోర్టు విచారణ ప్రక్రియ ముగియడానికి చాలా సమయం పడుతోంది. అప్పటి వరకు వేచి ఉండేందుకు ఆసక్తి చూపని బాధితులు మధ్యలోనే మోసగాళ్లతో రాజీ పడుతున్నారు. కోల్పోయిన మొత్తంలో 50–60 శాతం తిరిగి వస్తే చాలనే ధోరణితో ఉంటున్నారు. ఇలాంటి అనేక కారణాల నేపథ్యంలో మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏటా జరుగుతున్న నేరాల్లో బాధితులు కోల్పోతున్న సొమ్ములో 95 శాతానికిపైగా మోసగాళ్ల వద్దకు చేరుతోంది.

Advertisement
Advertisement