దేశంలో సెకనుకో సైబర్‌ దాడి | Sakshi
Sakshi News home page

దేశంలో సెకనుకో సైబర్‌ దాడి

Published Thu, Apr 13 2023 4:15 AM

Hyderabad Annual Cyber Security Knowledge Summit Hack 2023 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో ప్రతి సెకనుకో సైబర్‌ దాడి జరుగుతోందని సైబర్‌ క్రైమ్‌ నిపుణుడు పెండ్యాల కృష్ణశాస్త్రి ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, ప్రతి 11 సెకన్లకు ఓ సంస్థ లేదా వ్యక్తిపై ర్యాన్సమ్‌వేర్‌ దాడి జరుగుతోందన్నారు. బుధవారం హైదరాబాద్‌ పోలీసులు, హైదరాబాద్‌ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌ సంయుక్తగా నిర్వహించిన హైదరాబాద్‌ యాన్యువల్‌ సైబర్‌ సెక్యూరిటీ నాలెడ్జ్‌ సమిట్‌ (హాక్‌)–2023లో ఆయన కీలకోపన్యాసం చేశారు. నగర కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ నేతృత్వంలో జరిగిన ఈ సమిట్‌కు హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సదస్సులో కృష్ణశాస్త్రి ప్రసంగిస్తూ... ‘అనునిత్యం ఇంటర్‌నెట్‌లోకి 9 లక్షల కొత్త మాల్‌వేర్‌ వచ్చిపడుతోంది. వీటిలో ఏ రెండింటికీ సారూప్యత ఉండట్లేదు. కోవిడ్‌కు ముందు చిన్న, మధ్య తరహా సంస్థల్లో 53 శాతం ఈ ఎటాక్స్‌ బారినపడితే.. కోవిడ్‌ తర్వాత ఇది 68 శాతానికి చేరింది. ఈ నేరాల్లో ఐడెంటిటీ థెఫ్ట్‌తోపాటు ఉద్యోగులు చేసే డేటా చోరీలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇటీవల రాజకీయ కారణాలతోనూ సైబర్‌ దాడులు జరుగుతున్నాయి. చిన్న, మధ్య తరహా సంస్థల్లో 65 నుంచి 70 శాతం కంప్యూటర్లను వాళ్లకు తెలియకుండానే సైబర్‌ నేరగాళ్లు తమ అ«దీనంలోకి తీసుకుంటున్నారు. వీటిని క్రిప్టోకరెన్సీ మైనింగ్‌ కోసం వాడుతున్నారు.

ఈ తరహా సంస్థలు నిర్వహించే వారికి సైబర్‌ సెక్యూరిటీ ఏర్పాటు చాలా ఖరీదైన అంశంగా మారింది. ఈ ధోరణి మా ర­డంతోపాటు డేటా లీక్‌ ప్రివెన్షన్‌ పాలసీలు అమల్లోకి రావాలి. సాధారణ హైజీన్‌తో (శుభ్రత) పాటు సైబర్‌ హైజీన్‌ అన్నది కీలకంగా మారాలి. బ్యాంకులను పర్యవేక్షించడానికి ఆర్బీఐ ఉన్నట్లు చిన్న, మధ్య తరహా సంస్థల పర్యవేక్షణకు ఏ వ్యవస్థా లేకపోవడమూ ఓ లోపమే. వీటికి పోలీసులే రెగ్యులేటింగ్‌ అథారిటీ కావాలి. ఏదేనీ సంస్థ లేదా వ్యక్తికి చెందిన కంప్యూటర్‌లోకి చొరబడి, డేటాను తమ అధీనంలోకి తీసుకుని ఎన్‌క్రిప్ట్‌ చేయడం, డీ–క్రిప్షన్‌కు డబ్బు డిమాండ్‌ చేయడం... ర్యాన్సమ్‌వేర్‌ దాడుల్లో పైకి కనిపించే సైబర్‌నేరాలు.

అయితే సైబర్‌ నేరగాళ్లు తమ అ«దీనంలోకి తీసుకున్న డేటా ను తస్కరిస్తుంటారు. యూరోపియన్‌ హ్యాక­ర్లు ఆయా సంస్థలకు చెందిన కస్టమర్‌ డేటా తీసుకుంటారు. ఈ డేటా సేకరించడం అక్కడి చట్టాల ప్రకా రం తీవ్రమైన నేరం కావడంతో ఇలా చేస్తారు. భార త్‌కు చెందిన హ్యాకర్లను ఈ డేటా డార్క్‌ నెట్‌ సహా ఎక్కడైనా పట్టేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడి ర్యాన్సమ్‌వేర్‌ ఎటాకర్స్‌ ఆయా కంపెనీల సోర్స్‌ కోడ్‌ను తస్కరిస్తున్నారు’ అని ఆయన పేర్కొన్నారు.

కొత్త కాల్స్‌కు స్పందించవద్దు 
ఈ సమిట్‌ ముగింపు కార్యక్రమానికి హాజరైన ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి, హెచ్‌సీఎస్‌సీ ప్రధాన కార్యదర్శి భరణి మధ్య ప్యానల్‌ డిస్కషన్‌ జరిగింది. తన యూనిట్‌లో పని చేసే కొండలు సైబర్‌ నేరంలో ఎలా మోసపోయాడు, తన స్క్రిప్‌్టలు భద్రంగా ఉంచుకోవడానికి తాను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాను తదితర అంశాలను జక్కన్న వివరించారు.

వివిధ సైబర్‌ నేరాలు జరిగే విధానం, వాటి బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల్నీ వీరు చర్చించారు. ‘80 శాతం సైబర్‌ నేరాలు బాధితుల అవగాహనరాహిత్యం వల్ల, 20 శాతం దురాశ వల్ల జరుగుతుంటాయి. ఫోన్‌ కాల్, ఎస్సెమ్మెస్, వాట్సాప్‌ సందేశం... వీటిలో దేనికైనా స్పందించే ముందు ప్రతి ఒక్కరూ ఒక్క నిమిషం ఆలోచించాలి. కొత్త వారి ఫోన్‌ కాల్స్‌కు స్పందించవద్దు’ అని సూచించారు. 

Advertisement
 
Advertisement