చెట్టే కదా.. అని నరికితే!

Huge Fine to Tree cutter in Peddapalli District - Sakshi

కోల్‌సిటీ (రామగుండం): చెట్టే కదా.. అని ఓ వ్యక్తి నరికాడు. కొమ్మలు విరిగి విద్యుత్‌ తీగలపై పడటంతో షార్ట్‌సర్క్యూట్‌ జరిగింది. వీధి మొత్తం అంధకారమైంది. ఫలితంగా అతడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపాలిటీలోని సంతోష్‌నగర్‌లో పిడుగు సతీశ్‌ అనే వ్యక్తి తన ఇంటి ముందున్న చెట్టును అనుమతి లేకుండా మూడు రోజుల కిందట నేలకూల్చాడు. కొమ్మలు తెగి విద్యుత్‌ తీగలపై పడటంతో షార్ట్‌సర్క్యూట్‌ ఏర్పడి నగరపాలక సంస్థకు చెందిన 25 వీధిదీపాలు కాలిపోయాయి. దీంతో మున్సిపల్‌ చట్టం–2019 ప్రకారం రూ.49,500 జరిమానా చెల్లించాలని కమిషనర్‌ పి.ఉదయ్‌కుమార్‌ మంగళవారం సతీశ్‌కు నోటీసు జారీ చేశారు. సతీశ్‌ జరిమానా చెల్లించి మరోసారి పునరావృతం కాకుండా జాగ్రత్త వహిస్తానని హామీనిచ్చాడు.

ఈ విధంగా పచ్చదనం పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఒకవైపు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కల పెంపకం విస్తృతంగా చేపడుతూనే ఉన్న చెట్లను కాపాడుకునేందుకు అధికార యంత్రాంగం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఆ చెట్టు తొలగించిన వ్యక్తికి భారీ జరిమానా విధించారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో చాలా చోట్ల జరిగాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top