breaking news
Ramagundam Municipal Corporation
-
చెట్టే కదా.. అని నరికితే!
కోల్‌సిటీ (రామగుండం): చెట్టే కదా.. అని ఓ వ్యక్తి నరికాడు. కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో షార్ట్‌సర్క్యూట్ జరిగింది. వీధి మొత్తం అంధకారమైంది. ఫలితంగా అతడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపాలిటీలోని సంతోష్‌నగర్‌లో పిడుగు సతీశ్ అనే వ్యక్తి తన ఇంటి ముందున్న చెట్టును అనుమతి లేకుండా మూడు రోజుల కిందట నేలకూల్చాడు. కొమ్మలు తెగి విద్యుత్ తీగలపై పడటంతో షార్ట్‌సర్క్యూట్ ఏర్పడి నగరపాలక సంస్థకు చెందిన 25 వీధిదీపాలు కాలిపోయాయి. దీంతో మున్సిపల్ చట్టం–2019 ప్రకారం రూ.49,500 జరిమానా చెల్లించాలని కమిషనర్ పి.ఉదయ్‌కుమార్ మంగళవారం సతీశ్‌కు నోటీసు జారీ చేశారు. సతీశ్ జరిమానా చెల్లించి మరోసారి పునరావృతం కాకుండా జాగ్రత్త వహిస్తానని హామీనిచ్చాడు. ఈ విధంగా పచ్చదనం పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఒకవైపు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కల పెంపకం విస్తృతంగా చేపడుతూనే ఉన్న చెట్లను కాపాడుకునేందుకు అధికార యంత్రాంగం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఆ చెట్టు తొలగించిన వ్యక్తికి భారీ జరిమానా విధించారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో చాలా చోట్ల జరిగాయి. -
‘స్టాండింగ్’లో సీన్ రివర్స్!
కోల్‌సిటీ(రామగుండం) : రామగుండం నగరపాలక సంస్థలో ‘స్టాండింగ్ కమిటీ’కి శని వారం జరిగిన ఎన్నికల ఫలితాల్లో సీన్ రివర్సయ్యింది. 16 రోజులుగా చోటు చేసుకున్న స్టాండింగ్ కమిటీ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది. ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ వర్గానికి చెందిన ముగ్గురు అభ్యర్థులు గెలుపొందడం.. మరో ఇద్దరు ఓడిపోవడం, మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ వర్గంలోని ఐదుగురు అభ్యర్థులలో ఒక్కరు మాత్రమే గెలుపొంది.. మిగిలిన నలుగురు ఓడిపోవడం, బలంలేకున్నా క్రాస్ ఓటింగ్‌తో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలుపొందడంపై గులాబీ పార్టీ నేతలు పోస్టుమార్టం మొదలుపెట్టారు. డబ్బులు పంచారని ప్రచారం... ఎన్నికలో అభ్యర్థుల మద్దతు కోసం ఓ వర్గం డబ్బులు పంపిణీ చేసిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు సభ్యులను కలుసుకొని బేరసారాలు చేసినట్లు సమాచారం. ఫలించని మేయర్ వ్యూహం... ఎన్నికల్లో మేయర్ వ్యూహం ఫలించలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మేయర్ వర్గీయులు నామినేషన్లు ఉపసంహరిం చుకోవాలని, లేదంటే పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఎమ్మెల్యే హెచ్చరిస్తూ నోటీసులు జారీచేశారు. ఎమ్మెల్యే తన వర్గంకు చెందిన ఐదుగురు అభ్యర్థులకు మద్దతు తెలిపి ఓటు వేయాలని కోరారు. కానీ.. మేయర్ వర్గానికి చెందిన అభ్యర్థులు బరిలో నిలబడ్డారు. వీరిగెలుపు కోసం మేయర్ తననివాసంలో శిబిరం ఏర్పాటుచేసి సమీక్షలు నిర్వహిం చారు. కాంగ్రెస్ అభ్యర్థికి 28 ఓట్లు.. కాంగ్రెస్ పార్టీకి గెలుపునకు సరిపడా బలం లేకపోయినప్పటికీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవం కాకుండా ఉండేందుకు, రెండేళ్లుగా తమ అభ్యర్థిని పోటీలో నిలుపుతోంది. ఉనికిని కాపాడుకుంటూనే టీఆర్ఎస్లో ఉన్నగ్రూపు తగాదాలతో గత ఏడాది ఒక అభ్యర్థిని గెలుచుకోగా, ఇప్పుడు మూడో విడత జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల బరిలో 17వ డివిజన్ కార్పొరేటర్ బొమ్మక శైలజను పోటీలో నిలిపారు. కాంగ్రెస్‌కు 11 ఓట్లు ఉండగా, అదనంగా టీఆర్ఎస్ నుంచి మరో 17 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్లో ఉన్న అంతర్గత విభేదాలు కాంగ్రెస్‌కు కలిసివచ్చాయి. ఐదుగురిని బహిష్కరించిన ఎమ్మెల్యే.. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దుతు ఇవ్వకుండా, నామినేషన్లు ఉపసంహరించుకోని కార్పొరేటర్లు బద్రీ రజిత, సస్రీన్బేగం, మేకల శారద, చుక్కల శ్రీనివాస్, దాసరి ఉమాదేవిలను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ శనివారం ప్రకటించారు. ఇక నుంచి టీఆర్ఎస్ పా ర్టీకి ఎటువంటి సంబంధం లేదని, పార్టీ పేరును వాడుకోవడానికి వీలులేదని స్పష్టం చేశారు. మారుతిపైనా.. 38వ డివిజన్ కార్పొరేటర్ నారాయణదాసు మారుతిని కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు, ఎమ్మెల్యే సోమారపు శనివారం ఉత్తర్వులు జారీచేశారు. 2017–18 సంవత్సరం స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక సభ్యుడు గెలిచేలా చేసినందుకు, మారుతిని ఫ్లోర్‌లీడర్ నుంచి తొలగించినట్లు తెలిపారు. దీంతో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి అయిన ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేయడంతో, మారుతిపై క్రమశిక్షణ కమిటీ వేయడం జరిగిందన్నారు. క్రమశిక్షణ కమిటీ సిఫారసు మేరకు ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. -
పింఛన్ల పేరిట వసూళ్లకు యత్నం : నిందితుడికి దేహశుద్ధి
కోల్‌సిటీ : రామగుండం నగరపాలకసంస్థ పరిధిలో ఆసరా పింఛన్లు ఇప్పిస్తామంటూ ఇద్దరు వ్యక్తులు అక్రమంగా ఇళ్లలోకి చొరబడి డబ్బులు వసూలు చేస్తున్న వైనం మంగళవారం వెలుగుచూసింది. డివిజన్ కార్పొరేటర్ వడ్లూరి రవి, బాధితుల కథనం ప్రకారం... ఎన్టీపీసీ అన్నపూర్ణకాలనీకి చెందిన బొమ్మిదేని వేణుగోపాల్ అనే యువకుడితోపాటు మరో యువకుడు కలిసి 7వ డివిజన్లోని ప్రశాంత్‌నగర్‌కు వచ్చారు. మద్యం తాగి ఉన్న వీరు పింఛన్లు మంజూరు చేయిస్తామని ఇంటింటికీ తిరిగారు. ఐదారు ఇళ్లలోకి వెళ్లి తమకు కొంత ముట్టజెబితే పింఛన్ మంజూరయ్యేలా చూస్తామని చెప్పారు. స్థానికులు అనుమానంతో వారిని పట్టుకునేందుకు యత్నించగా.. వేణుగోపాల్ చిక్కాడు. స్థానికులతోపాటు కార్పొరేటర్ రవి అతడిని చెట్టుకు కట్టేసి విచారించగా, పొంతనలేని సమాధానాలు చెప్పడంతో వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు. విచారణ నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని చెప్పారు.