మళ్లీ పుంజుకున్న గృహాల రిజిస్ట్రేషన్లు, 5,181

House Registrations Process Rised In Hyderabad - Sakshi

జూలైతో పోలిస్తే ఆగస్టులో 20% వృద్ధి 

55 శాతం వాటా అందుబాటు ఇళ్లదే 

నైట్‌ఫ్రాంక్‌ ఇండియా నివేదిక వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: ఆషాడమాసం కారణంగా జులైలో పడిపోయిన గృహాల రిజిస్ట్రేషన్లు మళ్లీ పుంజుకున్నాయి. ఆగస్టులో రూ.2,657 కోట్లు విలువ చేసే 5,181 గృహాల రిజిస్ట్రేషన్లు జరిగాయి. అంతకుక్రితం నెలలో 4,313 రిజిస్ట్రేషన్లతో పోలిస్తే 20 శాతం, రూ.2,101 విలువతో పోలిస్తే 26 శాతం వృద్ధి నమోదయిందని నైట్‌ఫ్రాంక్‌ 
ఇండియా నివేదిక వెల్లడించింది. 

ఏడాది క్రితంతో పోలిస్తే.. 
గతేడాది ఆగస్టులో గ్రేటర్‌లో 8,144 గృహాల రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటితో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో రిజిస్ట్రేషన్లలో 36 శాతం క్షీణత నమోదయింది. ఇదే సమయంలో ప్రాపర్టీ విలువల్లోనూ తగ్గుదల కనిపించింది. 2021 ఆగస్టులో రిజిస్ట్రేషన్ల ప్రాపర్టీ విలువ రూ.3,809 కోట్లు కాగా.. ఈ ఏడాది ఆగస్టు నాటికి 30 శాతం క్షీణతతో రూ.2,657 కోట్లుగా ఉన్నాయి. 

8 నెలలతో పోలిస్తే క్షీణతే.. 
గతేడాది తొలి 8 నెలల రిజిస్ట్రేషన్లు, ఆదాయం స్థాయికి గ్రేటర్‌ రియల్టీ ఇంకా చేరుకోలేదు. గతేడాది జనవరి నుంచి ఆగస్టు వరకు గ్రేటర్‌లో రూ.25,007 కోట్ల విలువ చేసే 56,035 గృహాల రిజిస్ట్రేషన్లు జరిగాయి. అదే ఈ ఏడాది తొలి 8 నెలల్లో చూస్తే రూ.22,680 కోట్ల విలువ చేసే 46,078 గృహాల రిజిస్ట్రేషన్లు జరిగాయి.  

రూ. 50 లక్షల లోపు గృహాలకే డిమాండ్‌.. 
ఇప్పటికీ నగరంలో రూ.50 లక్షల లోపు ధర ఉన్న గృహాలకే డిమాండ్‌ ఉంది. గత నెలలో జరిగిన రిజిస్ట్రేషన్లలో 55 శాతం గృహాలు రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలు లోపు ధర ఉన్నవే. గతేడాది ఆగస్టులో జరిగిన రిజిస్ట్రేషన్లలో ఈ ఇళ్ల వాటా 37 శాతంగా ఉంది. 2021 ఆగస్టులో రూ.25 లక్షల లోపు ధర ఉన్న గృహాల వాటా 35%గా ఉండగా.. గత నెలలో వీటి వాటా ఏకంగా 16 శాతానికి పడిపోయింది. రూ.50 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న ఇళ్ల వాటా గతేడాది ఆగస్టులో 28 శాతం నుంచి ఈ ఆగస్టు నాటికి 29 శాతానికి పెరిగింది. 

72% గృహాలు 2 వేల చ.అ. లోపువే.. 
1,000 నుంచి 2,000 చ.అ. మధ్య విస్తీర్ణం ఉన్న గృహాలనే కొనుగోలుదారులు ఇష్టపడుతున్నారు. గత నెలలో జరిగిన రిజిస్ట్రేషన్లలో ఈ విస్తీర్ణం ఉన్న ఇళ్ల వాటా ఏకంగా 72 శాతంగా ఉంది. 2 వేల నుంచి 3 వేల చ.అ. మధ్య ఉన్న అపార్ట్‌మెంట్ల వాటా గతేడాది ఆగస్టులో 9 శాతం ఉండగా.. ఈ ఆగస్టు నాటికి 7 శాతానికి క్షీణించింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top