
ట్రిపుల్ ఆర్ వరకు టూడీ మ్యాపింగ్
ఐఐటీ హైదరాబాద్‌తో హెచ్‌ఎండీఏ ఒప్పందం
మాస్టర్‌ప్లాన్ అధ్యయనం కోసం కన్సల్టెన్సీ ఎంపిక
త్వరలో ఆర్‌ఎఫ్‌పీలకు బిడ్డింగ్
హైదరాబాద్: మహా నగర సమగ్ర ప్రణాళిక– 2050 రూపకల్పనకు ఐఐటీ హైదరాబాద్ సాంకేతిక భాగస్వామిగా సేవలందించనుంది. ఈ మేరకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ), ఐఐటీ హైదరాబాద్‌తో ఒప్పందం ఏర్పాటు చేసుకుంది. మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఐఐటీ సంస్థ అందజేయనుంది. భవిష్యత్ అవసరాలకనుగుణంగా అంతర్జాతీయ ప్రమాణాల మేరకు హైదరాబాద్ నగర విస్తరణ, అభివృద్ధి కోసం హెచ్‌ఎండీఏ సమగ్ర మాస్టర్ ప్లాన్ కోసం భారీ కసరత్తు చేపట్టిన విషయం విదితమే.
ఇప్పటి వరకు ఉన్న ఐదు మాస్టర్ ప్లాన్‌లను విలీనం చేస్తూ ట్రిపుల్ ఆర్ వరకు ఒకే సమగ్రమైన మహా ప్రణాళికను రూపొందించనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రజా రవాణా, మౌలిక సదుపాయాల కల్పన కోసం కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్, లాజిస్టిక్స్, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యంగా ఆర్థికాభివృద్ధి ప్రణాళిక, జల వనరులు, అడవులు, పర్యావరణ పరిరక్షణ కోసం బ్లూగ్రీన్ ప్లాన్‌లను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూడు రకాల ప్రణాళికలు తుది దశకు చేరుకున్నాయి. వీటికి అనుగుణంగా సమగ్రమైన మాస్టర్‌ప్లాన్– 2050ను తయారు చేస్తారు. ఇందుకోసం రెండు రకాల సాంకేతికతను జోడించనున్నారు. హైదరాబాద్ ఐఐటీ అభివృద్ధి చేసిన త్రీడీ, టూడీ డిజిటల్ ట్విన్ టెక్నాలజీ ఆధారంగా బేస్ మ్యాపులను సిద్ధం చేయనున్నారు. దీంతో హైదరాబాద్ మహానగర సమగ్ర స్వరూపం ఆవిష్కృతమవుతుందని హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు.
ఔటర్ వరకు ఉన్నది ఉన్నట్లుగా...
కొత్తగా రూపొందించనున్న మాస్టర్‌ప్లాన్– 2050లో ఔటర్ రింగ్‌రోడ్డు వరకు అంటే.. సుమారు 2050 చ.కి.మీ పరిధిలో త్రీడీ డిజిటల్ ట్విన్ టెక్నాలజీని వినియోగిస్తారు. దీనిద్వారా ప్రతి ప్రాంతం వెడల్పు, పొడవు, ఎత్తులను పరిగణనలోకి తీసుకొని మూడు డైమెన్షన్‌లలో మ్యాపింగ్ చేస్తారు. ఇందుకోసం లైడార్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఈ టెక్నాలజీతో ఔటర్ రింగ్‌రోడ్డు వరకు ఉన్న నగరంలోని ప్రతి అంగుళాన్ని రియల్ టైమ్‌లో ఉన్నది ఉన్నట్లుగా వీక్షించేందుకు అవకాశం లభిస్తుంది. వరదలు, ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, మౌలిక సదుపాయాలు వంటి సేవలను సత్వరమే అందజేసే అవకాశం లభిస్తుంది. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ తదితర ప్రభుత్వ విభాగాల ప్లానింగ్‌లోనూ రియల్ టైమ్ టెక్నాలజీ వల్ల వంద శాతం కచి్చతత్వాన్ని పాటించవచ్చు. ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ ఏరియాలో కూడా త్రీడీ డిజిటల్ ట్విన్ టెక్నాలజీని అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లోని స్మార్ట్ లివింగ్ ల్యాబ్ ఈ డిజిటల్ ట్విన్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. దీనిద్వారా ఇనిస్టిట్యూట్ సమీపంలో రాకపోకలు సాగించే వాహనాల సంఖ్య, రద్దీని కచి్చతంగా అంచనా వేసి ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన సూచికలను ఏర్పాటు చేశారు. నీటి వనరులను రియల్–టైమ్‌లో పర్యవేక్షించేందుకు, వృథాను నివారించేందుకు కూడా ఈ టెక్నాలజీ దోహదం చేసింది. గచ్చిబౌలిలోని ఒక రెసిడెన్షియల్ కాలనీలో ఈటెక్నాలజీ ద్వారా పైప్‌లైన్‌ల లీకేజీలను గుర్తించి, నీటి సరఫరాను సమర్ధవంతంగా మెరుగుపరిచారు.అలాగే పార్కులు, పచ్చదనం పరిరక్షణలో త్రీడీ డిజిటల్ ట్విన్ మ్యాపింగ్ అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. ఈ టెక్నాలజీనే ఔటర్ వరకు విస్తరించనున్నారు. ముంబై, జైపూర్, వారణాసి, పుణె తదితర నగరాల మాస్టర్‌ప్లాన్‌ల రూపకల్పనలో త్రీడీ టెక్నాలజీని వినియోగించినట్లు అధికారులు తెలిపారు.
ట్రిపుల్ ఆర్ వరకు టూడీ డిజిటల్..
హెచ్‌ఎండీఏలో కొత్తగా విలీనమైన ట్రిపుల్ ఆర్ వరకు అంటే సుమారు 11 వేల చదరపు కిలోమీటర్‌ల ప్రాంతాన్ని టూడీ డిజిటల్ టెక్నాలజీతో మ్యాపింగ్ చేస్తారు. ఇక్కడ రియల్ టైమ్ సమాచారం లభించదు. ట్రిపుల్ ఆర్ వరకు ఉన్న అన్ని ప్రాంతాల పొడవు, వెడల్పులను మ్యాపింగ్ చేస్తారు. ఆర్థిక అభివృద్ధి మండలాలను, నీటి వనరులు, అడవులు తదితర ప్రాంతాలను సమగ్రంగా మ్యాపింగ్ చేస్తారు. ట్రిపుల్ ఆర్ వరకు రవాణా సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు అవసరమైన రోడ్లు, బస్‌ర్యాపిడ్ సిస్టమ్, మెట్రో, ఎంఎంటీఎస్ తదితర ప్రజా రవాణా సదుపాయాలను ఈ ప్రణాళికలో పొందుపరుస్తారు. పార్కులు, పచ్చదనం విస్తరణకు ఈ ప్రణాళిక దోహదం చేయనుంది.
త్వరలో టెండర్లు..
మాస్టర్‌ప్లాన్– 2050పై అధ్యయనం చేసి సమగ్ర నివేదికను అందజేసేందుకు త్వరలో కన్సల్టెన్సీని ఎంపిక చేయనున్నారు. ఆసక్తి గల సంస్థల నుంచి దరఖాస్తుల స్వీకరణకు త్వరలో ఆర్‌ఎఫ్‌పీ టెండర్ ప్రకటన విడుదల చేయనున్నారు. ఎంపికైన కన్సల్టెన్సీ అందజేసే నివేదిక ఆధారంగా మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించనున్నారు. ట్రిపుల్ ఆర్ వరకు సమగ్ర మాస్టర్‌ప్లాన్ అమల్లోకి రావడానికి ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశం ఉంది.