మే 3 తర్వాత ఎన్నికలు పెట్టొద్దు

High Court Serious On SEC Over Telangana Municipal Elections - Sakshi

ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం 

రాత్రి కర్ఫ్యూ పొడిగింపు ఉత్తర్వుల జాప్యంపై అసహనం 

ధర్మాసనం సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరిక 

తదుపరి విచారణ 5వ తేదీకి వాయిదా

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 3న మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత... కరోనా కేసులు తగ్గే వరకూ రాష్ట్రంలో ఎక్కడా ఎన్నికలు నిర్వహించరాదని ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ ఉత్తర్వులను ఎన్నికల కమిషన్‌కు తెలియజేయాలని అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌కు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశించింది.

ఏప్రిల్‌ 30తో రాత్రి కర్ఫ్యూ గడువు ఉత్తర్వులు ముగుస్తుండటంతో తర్వాత ఎటువంటి చర్యలు తీసుకుంటారో తెలియజేయాలంటూ గతంలో ఆదేశించిన నేపథ్యంలో కరోనా నియంత్రణ చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలను ధర్మాసనం మరోసారి విచారించింది. ఉదయం 10.45 గంటల ప్రాంతంలో ఈ కేసులు విచారణకు రాగా... భోజన విరామం సమయానికి ప్రభుత్వ నిర్ణయాన్ని చెబుతామని అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) నివేదించారు.

తర్వాత 1.30 గంటల ప్రాంతంలో తిరిగి ఈ కేసులు విచారణకు రాగా... ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుందని ఏజీ నివేదించారు. దీంతో ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘నిన్నటి నుంచి విచారణను ఈ రోజుకు వాయిదా వేశాం. ఇంత తీవ్రమైన అంశంపై నిర్ణయం తీసుకోవడానికి 24 గంటల సమయం సరిపోలేదా? ధర్మాసనం సహనాన్ని పరీక్షిస్తున్నారు. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోనుందో చెప్పాలని 27న ఆదేశించాం. ఏజీ విజ్ఞప్తి మేరకు 28కి కేసు వాయిదా వేశాం. 28న ఏజీ మరోసారి చేసిన విజ్ఞప్తి మేరకు ఈ రోజు విచారించాం. అయినా ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదని చెప్పడం తీవ్ర అభ్యంతరకరం.

మరికొన్ని గంటల్లో అంటే అర్ధరాత్రితో కర్ఫ్యూ గడువు ఉత్తర్వులు ముగియనున్నాయి. అర్ధరాత్రి తర్వాత జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యులు? ప్రభుత్వానికి నిర్ణయం తీసుకోవడం చేతకాకపోతే మేమే తగిన ఉత్తర్వులు జారీచేస్తాం’అని ధర్మాసనం హెచ్చరించిం ది. ఈ దశలో ఏజీ జోక్యం చేసుకొని కోర్టు ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. కార్యనిర్వహణ వ్యవస్థ అధికారాల్లో జోక్యం చేసుకోరాదనే ఉద్దేశంతో అడిగినంత గడువు ఇస్తున్నామని, తమ నుంచి ఊహించిన దాని కంటే తీవ్రమైన ఉత్తర్వులు ఉంటాయని ధర్మాసనం హెచ్చరించింది. తిరిగి 45 నిమిషాల్లో ఈ కేసును విచారిస్తామని, అప్పటిలోగా ప్రభుత్వ నిర్ణయాన్ని చెప్పాలంటూ మరోసారి విచారణ వాయిదా వేసింది.  

కర్ఫ్యూ పొడిగించాం: ఏజీ 
రాత్రి కర్ఫ్యూను ఈనెల 8వ తేదీ ఉదయం 5 గంటల వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ మేరకు జారీ చేసిన జీవోను అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) ధర్మాసనానికి సమర్పించారు. జీవోను పరిశీలించిన ధర్మాసనం సంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని తెలియజేయకుండా తాము ఆదేశాలు జారీచేసే అవకాశం కల్పించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని చెప్పింది. 3వ తేదీ తర్వాత స్థానిక సంస్థల కు, ఇతర ఉప ఎన్నికలు ఏమైనా పెడుతున్నారా అని ఏజీని ప్రశ్నించగా... లేదని తెలిపారు. కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకూ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించరాదని ధర్మాసనం స్పష్టం చేసింది. కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఈనెల 5కు వాయిదా వేసింది.

మధ్యంతర ఉత్తర్వులు జూన్‌ 30 వరకు పొడిగింపు 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో పలు కేసుల్లో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను జూన్‌ 30 వరకు పొడిగిస్తున్నట్లు హైకోర్టు ఫుల్‌ కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌రావు, జస్టిస్‌ రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశించింది.

  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top